పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్‌ను 93 ఏళ్ల క్రితం విచారించిన చారిత్రక పూంచ్‌హౌస్ లోని ‘భగత్‌సింగ్ గ్యాలరీ’ని పర్యాటకుల కోసం అందుబాటు లోకి తీసుకొచ్చింది. భగత్ సింగ్ జీవితం, స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన చిత్రాలు, లేఖలు, వార్తాపత్రికలు, విచారణ వివరాలు, ఇతర పత్రాలు ఆ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జహీద్ అక్తర్ జమన్ ఈ గ్యాలరీని సోమవారం ప్రారంభించారు. పాకిస్థాన్ ప్రభుత్వం తొలిసారిగా 2018లో భగత్‌సింగ్ కేసు ఫైల్‌కు సంబంధించిన కొన్ని రికార్డులను ప్రదర్శించింది. అందులో అతడికి ఉరిశిక్ష అమలు, కొన్ని లేఖలు, ఫోటోలు, వార్తాపత్రికల క్లిప్పింగ్‌లు ఇతర అంశాలు ఉన్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న నేరంపై భగత్‌సింగ్‌ను 23 ఏళ్ల వయస్సు లో బ్రిటిష్ ప్రభుత్వం 1931 మార్చి 23న లాహోర్‌లో ఉరి తీసింది. బ్రిటిష్ పోలీస్ అధికారి జాన్ పి. సాండెర్స్‌ను హత్య చేశారన్న నేరాభియోగంపై భగత్‌సింగ్‌తోపాటు రాజ్‌గురుపై అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన పలు పత్రాలను తాజాగా పాక్ పంజాబ్ ప్రభుత్వం గ్యాలరీలో ఉంచింది. భగత్‌సింగ్ దళంలో సుమారు 2425 మంది సభ్యులు ఉండేవారు. వీళ్లంతా దేశం లోని పలు ప్రాంతాలకు వెళ్లి ఉద్యమాలు చేపట్టారు. వీళ్లని బ్రిటిష్ పోలీస్ బలగాలు , ఏజెన్సీలు ఎలా పసిగట్టాయి, వారి లింక్‌ను ఎలా ఛేదించాయన్న వివరాల దస్త్రాలను కూడా గ్యాలరీలో ఉంచారు. మంగళవారం భగత్‌సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ ఛైర్మన్ అడ్వకేట్ ఇంతియాజ్ రషీద్ ఖురేషీ మాట్లాడుతూ ఈ గ్యాలరీకి ‘షాడ్‌మన్ చౌక్’ గా నామకరణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.