లాహోర్ : అక్రమంగా సరిహద్దులను దాటారన్న నేరంపై పాక్‌లో ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఇద్దరు భారతీయ ఖైదీలను పాకిస్థాన్ భారత్‌కు అప్పగించింది. వాఘా సరిహద్దు భద్రతా దళాధికారులకు అప్పగించినట్టు మంగళవారం అధికార వర్గాలు తెలిపాయి. 2013 లో శర్మ రాజ్‌పుత్, రామ్ బుహదార్ అనే ఇద్దరు భారతీయులు కశ్మీర్ నుంచి నియంత్రణ రేఖ మీదుగా పాక్ భూభాగం లోకి ప్రవేశించడంతో పాక్ రేంజర్లు వారిని అరెస్టు చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు పాక్ జైళ్లలో వీరు శిక్ష అనుభవించారు. అయితే వారు మానసిక రోగులని, అనుకోకుండా సరిహద్దు దాటారని స్పష్టమైంది. వారి చిత్రాలను, ఇతర ఆధారాలను భారత్‌కు చూపించడంతో చివరకు వారు భారతీయులని అధికారులు అంగీకరించారు. పాక్ రేంజర్లు వారిని సోమవారం సరిహద్దు భద్రతా దళాలకు అప్పగించారు. అయితే ఏడాది క్రితం గూఢచర్యం, అక్రమంగా సరిహద్దును దాటడం వంటి నేరాలపై పాక్ అరెస్టు చేసిన 19 మంది భారతీయుల కేసు మాత్రం ఫెడరల్ రివ్యూ బోర్టు పెండింగ్‌లో ఉంది.