- Advertisement -
ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో అక్రమంగా మరణ శిక్షను ఎదుర్కొంటున్న నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్(51) కేసులో న్యాయవాదిని నియమించుకునేందుకు భారత్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు మరింత సమయాన్ని ఇచ్చింది. కుల్‌భూషణ్ జాదవ్ గూఢచర్యం చేశాడని పాక్ ప్రభుత్వం అతడికి మరణ శిక్ష విధించింది. అయితే అతడు నిర్దోషని, కావాలనే పాకిస్థాన్ అతడిని ఇరికించిందని భారత్ వాదిస్తోంది. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. దాంతో జాదవ్‌కు దౌత్య సాయం అదించేందుకు అవకాశం ఇవ్వడంతోపాటు, శిక్షను సమీక్షించాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించి మంగళవారం వాదనలు విన్న ఇస్లామాబాద్‌లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అథార్ మినల్లా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం భారత్‌కు మరింత సమయం ఇవ్వాలని, విషయాన్ని తెలియజేయాలని అక్కడి అధికారులను ఆదేశించింది.
పాకిస్థాన్ తరఫున ఆ దేశ అటార్నీ జనరల్ ఖాలిద్ జావేద్ ఖాన్ వాదిస్తూ భారత్ ఉద్దేశ్యపూర్వకంగానే న్యాయవాదిని నియమించకుండానేన విచారణకు విఘాతం కల్గిస్తోందన్నారు. ప్రత్యే గదిలో భారత దౌత్య ప్రతినిధులు జాదవ్‌తో మాట్లాడే ఏర్పాటును కోరుతున్నారని,ఇందుకు జైలు అధికారులు సాహసించలేకపోతున్నారని, కేవలం కరచాలనం ద్వారానే వారు హాని కలిగించే అవకాశం ఉందని, అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను పాక్ అమలుచేయాలని చూస్తుంటే భారత్ అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ఖాలిద్ జావేద్ ఖాన్ వాదించారు.