Tuesday, November 5, 2024

ఆర్థిక ఊబిలో పాకిస్తాన్

- Advertisement -
- Advertisement -

గత ఏడాది శ్రీలంక పుట్టి ముంచిన మాదిరి ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ కూరుకుపోతున్నది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) దయాదాక్షిణ్యాల ముంగిట నిలుచున్న అది మరొకసారి పెట్రోల్ ధరలను పెంచింది. పెట్రోల్, గ్యాస్ ధరలను తాజాగా 113% ఎగబాకించింది. దీనితో ప్రస్తుతం అక్కడ పెట్రోల్ లీటరు ధర పాక్ రూ. 272కి చేరుకొన్నది. 3 పైచిలుకు పాకిస్తాన్ రూపాయలు భారత రూపాయికి సమానం. అంటే అక్కడ పెట్రోల్ ధర మన దేశంలో ధరకు దాదాపు సమానం అయినట్టు లెక్క. అయినప్పటికీ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి 7 బిలియన్ డాలర్ల అదనపు ఆర్థిక సాయాన్ని పొందడం కోసం విధిలేని పరిస్థితుల్లో పాక్ ప్రభుత్వం తన ప్రజలపై ఈ మేరకు పెట్రో బాంబును ప్రయోగించవలసి రావడం దాని ఆర్థిక దుస్థితికి నిదర్శనంగా పరిగణించాలి. ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్తాన్‌ను గట్టెక్కించడానికి తాను అదనపు నిధులను సమకూర్చాలంటే విధిగా పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచాలని ఐఎంఎఫ్ షరతు విధించింది.

అదే సమయంలో ఐఎంఎఫ్ సూచన మేరకు ప్రజల నుంచి అధిక పన్నులు వసూలు చేయడానికి మినీ బడ్జెట్‌ను సైతం పాక్ ఆమోదించవలసి వచ్చింది. ప్రజలను 12 రకాల రక్షిత, అరక్షిత వినియోగదారులుగా విభజిస్తూ మంత్రివర్గ ఆర్థిక సమన్వయ సంఘం ఈ నెల 13న నిర్ణయం తీసుకొన్నది. ఆ మేరకు పెట్రోల్, గ్యాస్ ధరలను గురువారం నాడు పెంచారు. అలాగే ఈ ఏడాది జులైతో అంతమయ్యే ఆర్థిక సంవత్సరంలో 639 మిలియన్ డాలర్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోడానికి సాధారణ అమ్మకపు పన్నును 17 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. ఇవన్నీ అక్కడి ప్రజలను విపరీతంగా బాధిస్తాయని, ద్రవ్యోల్బణాన్ని, ధరలను మరింతగా పేట్రేగిస్తాయని ప్రత్యేకించి చెప్పుకోనక్కర లేదు. హైస్పీడ్ డీజెల్‌ను రవాణాకు వినియోగిస్తారు కాబట్టి దాని ధర పెరిగిన మేర అన్ని రకాల సరకుల ధరలు విజృంభిస్తాయి. ప్రభుత్వం వద్ద విదేశీ ద్రవ్యనిధులు ఎన్నడూ లేనంతగా కేవలం 3.1 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.

వాటిని తిరిగి పెంచుకోకపోతే దిగుమతుల బిల్లును తట్టుకోడం కష్టతరమవుతుంది. అందుచేత పాక్ పాలకులు అనివార్యంగా ఐఎంఎఫ్ వద్ద చేతులు చాచారు. ప్రస్తుతమున్న విదేశీ మారక నిల్వలు కొద్ది వారాల దిగుమతులకు మాత్రమే సరిపోతాయని చెబుతున్నారు. 2022 డిసెంబర్‌లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం పాక్ ద్రవ్యోల్బణం గత ఏడాది కంటే రెట్టింపై 24.5 శాతానికి చేరుకొన్నది. ఆహార ధరలు ఆకాశానికి అంటాయి. ఆహార ద్రవ్యోల్బణం 35 % వద్ద వున్నది. పాక్ స్టేట్ బ్యాంకు తానిచ్చే అప్పులపై వడ్డీ రేట్లను గత 24 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా 100 బేసిస్ పాయింట్లు పెంచివేసి 17 శాతానికి ఎగబాకించింది. సొంత కాళ్ళ మీద నిలబడడానికి బదులు బయటి నుంచి వచ్చే ఉదారపూరిత సాయం మీద, గ్రాంట్ల మీద ఆధారపడి ఆర్థిక వ్యవస్థను నడిపించే నేపథ్యమే పాకిస్తాన్‌ను ఇంతటి దురవస్థకు చేర్చింది. సహేతుకమైన పన్ను విధానాన్ని పాటించి దేశీయంగా ఆదాయాన్ని పెంచుకోడమనే ఆరోగ్యకరమైన విధానానికి పాక్ పాలకులు స్వస్తి చెప్పారు.

విద్యుత్తుపై అత్యధిక సబిడీ ఇవ్వడం, దక్షిణాసియాలోనే ఎక్కడా లేనంత స్వల్ప ధరలకు పెట్రోల్, డీజెల్‌ను సరఫరా చేయడం వంటి చర్యలు ప్రస్తుత గడ్డు పరిస్థితికి కారణమని చెబుతున్నారు. 2004లో కేవలం 2.25 బిలియన్ డాలర్లుగా వున్న ద్రవ్యలోటు 2019 నాటికి 25.31 బిలియన్ డాలర్ల అత్యధిక స్థాయికి చేరుకొన్నది. తమ స్థూల దేశీయోత్పత్తికి తగిన రీతిలో పన్నులు లేకపోడం ప్రభుత్వ ఖజానా దెబ్బ తినడానికి కారణమని, 2022 ఆర్థిక సంవత్సరంలో జిడిపితో పోల్చుకుంటే భారత దేశంలో పన్ను రేటు 17.1శాతంగా వుండగా, పాక్‌లో అది 9.2 శాతమేనని చెబుతున్నారు. చైనా నుంచి, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ వంటి గల్ఫ్ దేశాల నుంచి అప్పులు చేసి పప్పు కూడు తింటూ వచ్చిన కారణంగానూ పాక్ ఆర్థికంగా నష్టపోయిందని చెప్పవచ్చు. క్రమణశిక్షణాయుతమైన ఆర్థిక విధానాలు లేకపోడం వల్లనే పాకిస్తాన్‌కు అదనపు నిధుల విడుదలలో ఐఎంఎఫ్ వల్లమాలిన జాప్యం చేస్తూ వచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు.

వాస్తవానికి ఈ నిధులు గత నవంబర్‌లోనే విడుదల కావలసి వుండగా, అనేక పొదుపు చర్యలను తీసుకున్న తర్వాతనే ఇస్తానని ఐఎంఎఫ్ పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చింది. పర్యవసానంగానే ఇప్పుడు పెట్రోల్, డీజెల్, కిరోసిన్ ధరలను పెంచవలసి వచ్చింది. పూర్వపు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్రమణ శిక్షణలేని ఆర్థిక విధానాలే ఇందుకు కారణమని చెబుతున్నారు. గత వర్షాకాలం (జూలై సెప్టెంబర్) లో సంభవించిన భారీ వరదలు కూడా పాక్ ఆర్థిక పతనానికి దోహదం చేశాయి. ఈ వరదలు అనేక మంది ప్రాణాలను బలి తీసుకోడంతో పాటు 40 బిలియన్ డాలర్ల మేరకు మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. 8 మిలియన్ ఎకరాల్లో పంటలను నష్టపరిచాయి. 33 మిలియన్ మంది ప్రజలు కట్టుబట్టలతో వున్నచోటి నుంచి తరలిపోవలసి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News