Friday, December 27, 2024

ఇస్లామాబాద్‌లో సదస్సుకు మోడీ రావాలి.. పాకిస్తాన్ ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

అక్టోబర్‌లో నిర్వహించనున్న షాంఘై సహకార సంఘం(ఎస్‌సిఓ) ప్రభుత్వాధినేతల సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్ ఆహ్వానించింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి గురువారం నాడిక్కడ వెల్లడించారు. అక్టోబర్ 15-16 తేదీలలో జరిగే ఎస్‌సిఓ సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరుతూ సభ్యదేశాల ప్రభుత్వాధినేతలకు ఆహ్వానాలు పంపినట్లు అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలూచ్ విలేకరులకు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఆహ్వానం పంపినట్లు ఆమె తెలిపారు. ఎస్‌సిఓ ప్రభుత్వాధినేత సమావేశంలో పాల్గొనడంపై కొన్ని దేశాలు ఇప్పటికే తమ సమ్మతిని తెలియచేశాయని ఆమె తెలిపారు. ఏఏ దేశాల నుంచి సమ్మతి వచ్చిందో త్వరలోనే తెలియచేస్తామని ఆమె వివరించారు.

కాగా..భారత్, పాకిస్తాన్ మధ్య సుదీర్ఘకాలంగా సత్సంబంధాలు కరువయ్యాయి. ప్రధానంగా కశ్మీరు సమస్యతోపాటు పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్న సీమాంతర ఉగ్రవాదంపై రెండు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎస్‌సిఓ సమావేశానికి ముందు మంత్రిత్వ స్థాయిలో సమావేశాలు జరుగుతాయి. ఆర్థిక, సామాజిక, సాంస్కతి, మానవతాపరమైన సహకారం తదితర అంశాలపై సీనియర్ అధికారుల సమావేశాలు జరుగుతాయి. ఎస్‌సిఓలో భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, కజఖస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యులుగా ఉన్నాయి. భారత్‌తో సంబంధాల గురించి ఒక విలేకరి ప్రశ్నించగా భారత్‌తో సాకిస్తాన్‌కు ప్రత్యక్ష ద్వైపాక్షిక వాణిజ్యం లేదని అధికార ప్రతినిధి తెలిపారు. 2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం కశ్మీరులో 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత భారత్‌తో తన సంబంధాలను పాకిస్తాన్ పూర్తిగా తగ్గించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News