న్యూఢిల్లీ : భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన చిచ్చు రేగడానికి దారి తీసిన ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఈమేరకు నిఘా వర్గాల సమాచారాన్ని ఉదహరిస్తూ అనేక జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. భారత్ కెనడా మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకే నిజ్జర్‌ను ఐఎస్‌ఐ అంతమొందించి ఉంటుందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ నిజ్జర్‌కు కెనడాలో ఉంటున్న పాక్ ఐఎస్‌ఐ నిఘా ఏజెంట్లతో సంబంధాలున్నాయి. కెనడాకు వచ్చే తమ గ్యాంగ్‌స్టర్లకు పూర్తి మద్దతు ఇవ్వాలని ఐఎస్‌ఐ గత కొన్నేళ్లుగా నిజ్జర్‌పై ఒత్తిడి పెంచుతోంది. కానీ అతడు మాత్రం ఖలిస్థానీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. ఇక స్థానికంగా పాప్యులారిటీ పెంచుకున్న అతడు , డ్రగ్స్ అక్రమ దందాను నియంత్రిస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యం లోనే కక్ష పెంచుకున్న ఐఎస్‌ఐ , నిజ్జర్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. దీనికోసం ఇద్దరు ఏజెంట్లకు ఈ బాధ్యతను అప్పగించినట్టు నిఘా వర్గాల సమాచారం. ఇక కెనడాలో నిజ్జర్ ఉంటున్న ప్రాంతానికి చుట్టుపక్కల ఐఎస్‌ఐ మాజీ అధికారులు నివసిస్తున్నట్టు తెలిసింది. వీరి ద్వారానే నిజ్జర్ కదలికలను తెలుసుకున్నట్టు సమాచారం. బ్రిటిష్ కొలంబియా లోని సర్రే స్రాంతంలో ఓ గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఏడాది జూన్‌లో నిజ్జర్‌ను కాల్చి చంపారు.