Thursday, November 14, 2024

భుట్టో.. ఖబడ్దార్!

- Advertisement -
- Advertisement -

మోడీపై పాక్ మంత్రి బిలావల్ వ్యాఖ్యలపట్ల మండిపడిన భారత్
నేడు దేశవ్యాప్త నిరసనలకు బిజెపి పిలుపు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసిన పాకిస్థాన్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టోజర్దారీపై భారత ప్రభుత్వం శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడింది. బిలావల్ వ్యాఖ్యలు ఆ దేశం దిగజారుడు తనానికి అద్దం పడుతున్నాయని దుయ్యబట్టింది. పాక్ విదేశాంగమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన విదేశాంగ శాఖ ప్రతినిధి అరవింద్ బాగ్చీ ఆయన తన అసహనాన్ని తమ సొంత దేశంలోని ఉగ్రవాద సంసల్థపై చూపించి ఉంటే బాగుండేదని వాఖ్యానించారు. ‘అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు అమరవీరుడిగా కీర్తించిన దేశం పాక్. జకీవుర్ రెహమాన్ లఖ్వీ, హఫీజ్ సయీద్, మసూద్ అజర్, సాజిద్ మిర్, దావూద్ ఇబ్రహీంలాంటి ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన దేశం. ఐరాస ఉగ్రవాదులుగా ప్రకటించిన 126 మందిని, 27 ఉగ్రవాద సంస్థలను కలిగి ఉన్నామని మరే దేశం కూడా గొప్పలు చెప్పుకోదు’ అని బాగ్చీ ఆ ప్రకటనలో అన్నారు. ఉగ్రవాదులను, వారి ప్రాక్సీలను ఉపయోగించుకోలేక పోవడం కారణంగానే పాక్ ఈ విధంగా నోరు పారేసుకుంటున్నట్లు కనిసిస్తోందని ఆయన అన్నారు.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత విదేశాంగమంత్రి జైశంకర్ ఉగ్రవాద సంస్థలకు పాక్ మద్దతు ఇస్తున్న విషయాన్ని ఎత్తి చూపుతూ, ఆ దేశాన్ని ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా అభివర్ణించిన తర్వాత పాక్ విదేశాంగ మంత్రి ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు.‘ పాకిస్థాన్ ఇంతగా దిగజారి ఎప్పుడూ మాట్లాడలేదు. పాక్ విదేశాంగ మంత్రి 1971నాటి ఈ రోజును మరిచిపోయారు. బెంగాలీలు, హిందువుల పట్ల పాక్ పాలకుల మారణకాండకు ఇది ప్రత్యక్ష ఫలితం’ అంటూ బంగ్లాదేశ్ ఆవిర్భావాన్ని గుర్తు చేస్తూ బాగ్చీ అన్నారు. న్యూయార్క్,ముంబయి, పుల్వామా, పఠాన్‌కోట్, లండన్ ఇలా ఎన్నో నగరాలు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద మచ్చలు కలిగి ఉన్నాయి. ఈ హింస.. పాక్ ఉగ్రవాద ప్రత్యేక జోన్లనుంచి పుట్టకొచ్చింది. ప్రపంచంలోని అన్నిప్రాంతాలకు వ్యాపించింది.‘ మేక్ ఇన్ పాకిస్థాన్’ ఉగ్రవాదాన్ని అరికట్టాల్సి ఉంది’ అని బాగ్చీ వ్యాఖ్యానించారు. ‘

పాక్ ఎంబసీ వద్ద బిజెపి నిరసనలు…

ప్రధాని నరేంద్ర మోడీపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో వ్యక్తిగతంగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో స్పందించింది. ఢిల్లీలోని పాక్ దౌత్య కార్యాలయం ముందు శుక్రవారం బిజెపి కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన చేపట్టి పాకిస్థాన్‌కు , బిలావల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పీఆటు బిలావల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు . ఆందోళనకారులు పాక్ ఎంబసీ వైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేవారు. అయితే ఆందోళనకారులు వాటిని తొలి రౌండ్ బారికేడ్లను ఛేదించి ముందుకు వెళ్లారు.

అయితే చాణక్యపురి వద్ద ఏర్పాటు చేసిన రెండో లైన్ బారికేడ్లవద్ద పోలీసులు వారిని ఆపేశారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు వాటర్ క్యానన్లను కూడా సిద్ధంగా ఉంచారు. పోలీసులు కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కాగా పాక్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్త నిరసనలకు బిజెపి పిలుపు ఇచ్చింది. అన్ని రాష్ట్ర రాజధానుల్లో శనివారం పాక్, పాక్ విదేశాంగ మంత్రి దిష్టిబొమ్మలను తగులబెట్టాలని పిలుపునిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News