అదే రోజు అవిశ్వాసంపై ఓటింగ్?
ఇస్లామాబాద్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ( పార్లమెంటు) ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా పడింది. అవిశ్వాస తీర్మానంపై గురువారం చర్చ విషయమై సభలోతీవ్ర గందరగోళం నెలకొనడంతో డిప్యూటీ స్పీకర్ కాసిమ్ సురి సభను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేశారు. తొలుత సభ ప్రారంభం కాగానే డిప్యూటీ స్పీకర్ అజెండాలో ఉన్న అంశాలను చర్చించాలని సభ్యులను కోరారు. అయితే ప్రతిపక్ష సభ్యులు మాత్రం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై తక్షణం చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంతకు ముందు అసెంబ్లీ సెక్రటేరియట్ గురువారం చర్చించాల్సిన 24 అంశాల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో అవిశ్వాస తీర్మానం నాలుగో అంశంగా ఉంది.
అయితే దీనిపై తక్షణం చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ సభను ఆదివారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. అదే రోజు తీర్మానంపై ఓటింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. 342మంది సభ్యులున్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం వీగి పోవాలంటే 172 మంది సభ్యులు ఇమ్రాన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సభలో ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్‌ఎఇన్సాఫ్ (పిటిఐ)కు 155 మంది సభ్యులున్నారు. పిఎంక్యు సహా ఇతరుల మద్దతుతో కలిపి ఆయనకు మద్దతు ఇస్తున్న వారి సంఖ్య 164కు చేరింది. అయితే ప్రతిపక్షాలకు 177 మంది మద్దతు ఉందని పరిశీలకుల అంచనా.