Thursday, January 23, 2025

పాక్ కొత్త ప్రధాని

- Advertisement -
- Advertisement -

People from different states should speak in hindi, not english పాకిస్తాన్‌లో పరిణామాలు చకచకా జరిగిపోయాయి. పిఎంఎల్ ఎన్ (పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్) పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్ మాజీ ప్రధాని అయిపోయారు. కత్తి మీద నడక వంటి ఈ రాజకీయ క్రీడలో తాను ప్రకటించినట్టే ఇమ్రాన్ ఖాన్ చివరి బంతి వరకు ఆడి ఓడిపోయారు. నేషనల్ అసెంబ్లీలోని మెజారిటీ సభ్యులు ప్రతిపాదించిన, అధికార కూటమిలోని కొన్ని పార్టీలు, తన సొంత పార్టీలోని పలువురు సభ్యులు మద్దతు ఇచ్చిన బలమైన అవిశ్వాస తీర్మాన ఉప్పెనను తిప్పికొట్టడానికి ఆయన ప్రయోగించిన యార్కర్ సుప్రీంకోర్టులో పార్లమెంటరీ సత్సంప్రదాయం ముందు వీగిపోక తప్పలేదు. ఇమ్రాన్ ఖాన్ ఓటమి రాజ్యాంగ బద్ధంగా జరిగిపోయింది. పూర్తి స్థాయి పదవీ కాలాన్ని అనుభవించకుండా అర్థంతరంగా దిగిపోయిన అనేక మంది మాజీ ప్రధానుల కోవలో ఇమ్రాన్ కూడా చేరిపోయారు. ఆ విధంగా అది పాక్ ప్రజాస్వామ్యానికి జరిగిన మరో అవమానంగానే భావించాలి. అయితే ఇమ్రాన్ నిశ్శబ్దంగా నిష్క్రమించలేదు. పాకిస్తాన్ విదేశాంగ విధానాన్ని ఉన్నపళంగా అబౌట్‌టర్న్‌తో పూర్తిగా మార్చివేయాలని సాహసించి ఆయన దెబ్బతిన్నారు.

ఇంత కాలంగా సైన్యం కనుసన్నల్లో దాని ఇష్టానిష్టాల మేరకు సాగుతూ వచ్చిన విదేశీ సంబంధాల నావను కొత్త దిశకు తిప్పబోయి ఇమ్రాన్ చతికిలబడ్డారు. పాకిస్తాన్ ఆది నుంచి అమెరికా అడ్డాలలోని బిడ్డగానే పెరుగుతూ వచ్చింది. అందుకు విరుద్ధంగా దానికి రష్యా అనుకూల చుక్కానిని అమర్చాలని ఇమ్రాన్ సంకల్పించారు. భారత వ్యతిరేకతలో తలపండిన ఆయన ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా చెప్పుచేతల్లో నడవకుండా ఇండియా తీసుకున్న తటస్థ వైఖరిని అనేక సార్లు మెచ్చుకోడం ద్వారానే తన అంతరంగాన్ని బయటపెట్టారు. ఇది పాక్ సైన్యానికి బొత్తిగా గిట్టలేదు. సైన్యాధ్యక్షుడు జనరల్ జావెద్ బజ్వా ఆగ్రహానికి ఇమ్రాన్ గురయ్యారు. ఈ ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ చేయాల్సి వుండిన బజ్వాను కూడా సైన్యాధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి ఇమ్రాన్ ఖాన్ విఫలయత్నం చేసినట్టు సమాచారం.

అయితే గతంలో అనేక మంది పాక్ ప్రధానుల విషయంలో జరిగినట్టు సైనిక కుట్ర ద్వారా కాకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతుల మేరకు ఇమ్రాన్ ఖాన్ దిగిపోడం గమనించవలసిన విషయం. ఇమ్రాన్ నిష్క్రమణతో అమెరికా, చైనా అనుకూల పాక్ విదేశాంగ విధానానికి ముప్పు తప్పింది. కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సోదరుడు. విశేష పరిపాలనానుభవం వున్నవారు. అనేకసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా చేశారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోయిన వెంటనే షెహబాజ్ షరీఫ్ చేసిన ఒక వ్యాఖ్య గుర్తు పెట్టుకోదగినది. భారత దేశంలో శాంతి, సత్సంబంధాలను తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. అయితే కశ్మీర్ సమస్య పరిష్కారం కానంత వరకు అది సాధ్యం కాదని అన్నారు.

పాక్ సైన్యం కూడా కశ్మీర్ సహా భారత దేశంతో గల అన్ని పేచీలకు పరిష్కారం కోరుకుంటున్నట్టు వార్తలు చెబుతున్నాయి. అలాగే భారత దేశంతో వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించుకోవాలని కూడా సైన్యం కోరుతున్నట్టు తెలుస్తున్నది. ఇరుగుపొరుగునున్న భారత, పాకిస్తాన్‌ల మధ్య వాణిజ్యం పుంజుకోడానికి ఎన్నో అవకాశాలున్నాయి. మన దేశం నుంచి పాక్‌కు జరుగుతున్న మొత్తం ఎగుమతుల విలువలో 15 శాతం వరకు చక్కెర ఎగుమతులే వుంటాయి. 202021 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం 280 మిలియన్ డాలర్లకు చేరుకున్నది. ఇందులో 278 మిలియన్ డాలర్ల మేరకు ఇండియా పాకిస్తాన్‌కు చేసిన ఎగుమతులే వున్నాయి. మిగతా 2 మిలియన్ డాలర్ల కిమ్మత్తు అక్కడ నుంచి మనం చేసుకున్న దిగుమతులున్నాయి.

పాకిస్తాన్‌కు భారత దేశం 357 ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నది. అక్కడి నుంచి 25 ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నది. పాకిస్తాన్‌కు అంత వరకు గల అత్యంత సఖ్యదేశం హోదాను మనం ఉపసంహరించుకున్నప్పటికీ రెండు దేశాల మధ్య వాణిజ్యం నిరాటంకంగా సాగుతూనే వుంది. పాక్ మామూలు సంబంధాలు నెలకొంటే రెండు దేశాల రక్షణ వ్యయం కూడా తగ్గుతుంది. ఆ మేరకు ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. అక్కడ ఏ ప్రధాని వచ్చినా సైన్యానిదే పైచేయి తరతమ స్థాయిల్లో వారిలో భారత వ్యతిరేకత కొనసాగుతూనే వుంటుంది. అయితే మన పట్ల శత్రుభావంతో మెలిగిన ఇమ్రాన్ ఖాన్ దిగిపోయి ఆయనతో పోల్చుకుంటే మనతో సఖ్యంగా వుండే అవకాశమున్న షెహబాజ్ షరీఫ్ ప్రధాని కావడం సంతోషించవలసిన విషయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News