Sunday, December 22, 2024

పాక్ ఎన్నికల్లో పిపిపి ప్రధాని అభ్యర్థిగా బిలావల్ భుట్టో

- Advertisement -
- Advertisement -

లాహోర్: పాకిస్థాన్‌లో వచ్చే నెల 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ( పిపిపి) పార్టీ చైర్మన్, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారిని తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. బుధవారం సాయంత్రం బిలావల్ నివాసంలో జరిగిన పిపిపి కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ముగిసిన వెంటనే పిపిపి అధికార ఎక్స్ ఖాతాలో సమావేశానికి సంబంధించిన ఫోటోలతో ఒక వీడియోను ఉంచారు. పార్టీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వం పట్ల సిఇసి సభ్యులు తమ విశ్వాసాన్ని తెలియజేసినట్లు ఆ పోస్టులో తెలియజేశారు. పాకిస్థాన్ పీపుల్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా బిలావల్ భుట్టో జర్దారీ పేరును పార్టీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ప్రతిపాదించారని,

సిఇసి దానికి మద్దతు తెలియజేసిందని పార్టీ ఎక్స్‌లో పోస్టు చేసిన ట్వీట్‌లో తెలిపింది. ప్రధానమంత్రి పదవికి పార్టీ తనను నామినేట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, దానికి వినమ్రంగా అంగీకరిస్తున్నట్లు బిలావల్ జర్దారీ భుట్టో తన అధికారిక ఎక్స్ ఖాతాలో తెలియజేశారు. ఫిబ్రవరి 8 మనం విద్వేషం, విభజనతో కూడిన పాతతరం రాజకీయాలకు ముగింపు పలకాలని, పేవలతో కూడిన కొత్త రాజకీయం కోసం దేశాన్ని సంఘటితం చేయాలని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. దివంగత మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడయిన బిలావల్ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో లాహోర్ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్నారు. సిఇసి సమావేశం రాబోయే ఎన్నికలకోసం చేపట్టాల్సిన ఎన్నికల ప్రచారం, పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చించినట్లు ది న్యూస్ ఇంటర్నేషనల్ పత్రిక తెలియజేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News