Thursday, January 23, 2025

యుద్ధాలకు డబ్బులిస్తారు.. కష్టాల్లో ఉన్న మాకు ఇవ్వరా..?

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో నగదు నిల్వలు అడుగంటిపోయి ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఐఎంఎఫ్ నుంచి రావాల్సిన నగదు సకాలంలో అందకపోవడంతో ఆ దేశం పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీనిపై తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్యారిస్ వేదికగా స్పందించారు. ‘యుద్ధాలకు ఇవ్వడానికి ప్రపంచ రుణదాతల దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌కు ఇవ్వడానికి మాత్రం ఉండవు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యారిస్‌లో రెండు రోజులపాటు జరుగుతున్న గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్‌లో ఈ మేరకు ఆయన మాట్లాడారు. యుద్ధం జరుగుతున్న దేశానికి ఏమైనా ఇవ్వడానికి ముందుకు వస్తారని, ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలకు కూడా కావాల్సినవన్నీ సమకూర్చుతారని, అదే సమయంలో వేల మంది ప్రాణాలను రక్షించడానికి మాత్రం నిధులను ఇవ్వడానికి వెనకంజ వేస్తారని దుయ్యబట్టారు.

పాకిస్థాన్ విషయానికి వచ్చే సరికి సంపన్న దేశాలు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయని, తమ దేశంలో ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది వరదలతో నష్టపోయిన పాక్‌ను రక్షించడానికి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి వేల కోట్లు సొంత జేబు నుంచి ఖర్చు చేశామని షెహబాజ్ షరీఫ్ గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్ చర్చలు జరుపుతుంది. ప్రధానంగా వాతావరణ విపత్తుల కారణంగా చితికిపోయిన దేశాలకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుంటుంది. జూన్ చివరి నాటికి ఐఎంఎఫ్ నుంచి పాక్‌కు రావాల్సిన 6.5 బిలియన్ డాలర్ల రుణ కార్యక్రమం గడువు ముగుస్తుంది.

గత సంవత్సరం నవంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న 1.1 బిలియన్ డాలర్ల రుణాన్నైనా విడుదల చేయాలని ఐఎంఎఫ్‌కు షరీఫ్ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి నిలిచిపోయిన నిధులపై ప్రశ్నించగా తనను పాక్ ఆర్థిక మంత్రి చెంపపై కొట్టాడని ఓ విలేఖరి ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News