పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ ( పిఎంఎల్ ఎన్) అధ్యక్ష పదవికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (72) సోమవారం రాజీనామా చేశారు. పార్టీ అంతర్గత కలహాల మధ్య తన పెద్దన్నయ్య, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అధికార పార్టీకి చుక్కానిలా తిరిగి బాధ్యతలు చేపట్టడానికి వీలుగా మార్గం సుగమం చేశారు. పిఎంఎల్‌ఎన్ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశిస్తూ తన రాజీనామా లేఖలో 2017 నాటి అల్లకల్లో ల సంఘటనలను గుర్తు చేశారు. ఈ సంఘటనల ఫలితంగానే ప్రధాని పదవిని, పార్టీ అధ్యక్ష పదవిని నవాజ్ అన్యాయంగా కోల్పోవలసి వచ్చిందని వివరించారు. అందుకనే తిరిగి ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం తన బాధ్యతగా పేర్కొన్నారు.74 ఏళ్ల నవాజ్ తనకు తానే స్వయం
బహిష్కరణ విధించుకుని లండన్‌లో ఉండిపోయారు. గత ఏడాది అక్టోబర్‌లో లండన్ నుంచి పాకిస్థాన్‌కు వచ్చారు. అవెన్‌ఫీల్డ్ కేసు నుంచి నిర్దోషిగా ఇస్లామాబాద్ హైకోర్టు గత నవంబర్ 29న విడుదల చేసింది. తరువాత నెల డిసెంబర్ 12 న అల్ అజిజియా కేసు నుంచి హైకోర్టు విముక్తి చేసింది. నవాజ్‌పై ఉన్న అవినీతి వ్యవహారాలు పనామా పేపర్లు బయటపెట్టడంతో 2017లో సుప్రీం కోర్టు నవాజ్‌ను ప్రధాని పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి అనర్హునిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కేసుల నుంచి విముక్తి పొందడంతో నాలుగోసారి ప్రధాని పదవితోపాటు పార్టీ అధ్యక్షపగ్గాలు చేపట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.