పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారతదేశంతో శాంతియుత సహజీవనాన్ని కోరుకొంటున్నామని, అందుకోసం చిత్తశుద్ధి, నిజాయితీతో కూడిన చర్చలను ఆశిస్తున్నామని ప్రకటించడం రెండు దేశాలమధ్య సఖ్యత సామరస్యాలను, నిర్యుద్ధ వాతావరణాన్ని కోరుకొనేవారెవరికయినా సంతోషాన్ని కలిగిస్తుంది. యుద్ధాలు రెండు దేశాల ప్రజలకు మరింత దుఃఖాన్ని, దారి ద్య్రాన్ని నిరుద్యోగాన్నే యిచ్చాయని వాటి నుంచి తగిన గుణపాఠాన్ని నేర్చు కొన్నామని షెహబాజ్ అనడమూ బాగుంది. అది వాస్తవం కూడా. అయితే శాంతి చర్చలకు ఆయన విధించిన షరతు భారత దేశ బిజెపి పాలకులకు బొత్తిగా మింగుడు పడనిది,2019లో కశ్మీర్ స్వయంప్రతిపత్తి (ఆర్టికల్ 370)ని రద్దు చేస్తూ ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొన్న చర్యను ఉపసంహరించుకోవాలని షెహబాజ్ షరతు విధించారు.
అది జరిగితేనే ఇండియాతో చర్చలు సాధ్యమవుతాయని తెగేసి చెప్పారు. మోడీ ప్రభుత్వం గాని పాలక బిజెపి గాని యిందుకు అంగీకరించే అవకాశమే లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను విడిచిపెట్టడానికే భారత్ సిద్ధంగా లేదన్న వాస్తవం షెహబాజ్ షరీఫ్‌కు తెలియనిది కాదు. పొసగని అంశాలను ముందుకు తేవడం ద్వారా ఆయన నిజంగానే శాంతిని కోరుకొంటున్నారా అనే గాఢమైన సందేహానికి వీలు కల్పించారు. కేవలం ప్రచారం కోసమే శాంతి ప్రస్తావన తెచ్చారు అనే అభిప్రాయానికి తావిచ్చారు. దుబాయికి చెందిన అల్ అరేబియా అనే టెలివిజన్‌కు యిచ్చిన ఇంటర్వ్యూ లో పాక్ ప్రధాని యీ అభిప్రాయాలు వెలిబుచ్చారు. భారత పాకిస్తాన్లు చర్చల ద్వారా శాంతియుతంగా తమ మధ్య గల సమస్యలను పరిష్కరించుకోవాలని అందుకు కశ్మీర్ స్వయంప్రతిపత్తిని పునరద్దరించడం అవసరమని ఐక్య రాజ్య సమితి తీర్మానాలు జమ్ము కశ్మీర్ ప్రజల ఆకాంక్షల ప్రాతిపదికగా కశ్మీర్ సమస్య పరిష్కారం కావాలని ప్రధాని షెహబాజ్ అదే పనిగా నొక్కి చెబుతున్నారని పాక్ ప్రధాని కార్యాలయం వివరణ యిచ్చింది.
బాంబులు, మండుగుండు మీద వనరులను దుర్వినియోగం చేయాలని పాకిస్తాన్ కోరుకోడం లేదని, రెండు దేశాలూ అణ్వస్త్రాలను, అమిత ఆయుధ సంపత్తిని కలిగినవని యుద్ధమే సంభవిస్తే యేమి జరిగిందో చెప్పడానికికూడా ఎవరూ మిగలరని షెహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్, పాక్‌ల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు గతంలో చాలా జరిగాయి. 2014లో మోడీ ప్రధానిగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ నాయకులందరితో బాటు అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కూడా ఆహ్వానించారు. శాంతి సందేశంతో భారత్ కు వెళుతున్నానని షరీఫ్ ప్రకటించారు. 2015 డిసెంబర్ లో ప్రధాని మోడీ లాహోర్ ఆకస్మిక పర్యటనకు వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలిశారు. 2016 లో అధీనరేఖ దగ్గర యూరి వద్ద భారత సైనిక స్థావరంపై టెర్రరిస్టులు దాడి చేసి 18 మంది సైనికులను చంపివేశారు. 2019 ఫిబ్రవరిలో కశ్మీర్మలోని పుల్వామా వద్ద మన సిఆర్‌పిఎఫ్ వాహనంపై టెర్రరిస్టుల దాడిలో 40 మంది జవాన్లు మరణించారు.
ఆ తర్వాత పాక్ లోని టెర్రరిస్ట్ స్థావరాలపై మన వైమానిక దళం మెరుపు దాడి జరిపింది. పాక్ నుంచి వస్తున్న టెర్రరిస్టులే తీవ్రమైన సమస్యగా వున్నారని వారికి పాకిస్తాన్ ఆశ్రయమిస్తున్నదని భారత్ అంతర్జాతీయ వేదికల మీద కూడా ఫిర్యాదు చేస్తున్నది. రెండు దేశాలు చర్చలకు చేరువవుతున్నాయనిపించిన ప్రతి సందర్భం లోనూ టెర్రరిస్టుల దాడులు జరిగి అవి ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నాయి. అయినా అడపా దడపా శాంతి సంకల్పాలు చెప్పుకొంటున్నారు గాని ఆ శాంతి ఆచరణలో గట్టిగా ప్రతిఫలించడం లేదు. కశ్మీర్ సమస్యపై 1947లో, 1965లో రెండు యుద్ధాలు జరిగాయి. 1971లో బంగ్లాదేశ్ విమోచన కోసం భారత దేశం సహాయపడినప్పుడు పాకిస్తాన్‌తో యుద్ధం సంభవించింది. 1999లో కార్గిల్ వద్ద జరిగిన యుద్ధం తెలిసిందే. ఈ అశాంతి రెండు దేశాల సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది.
వాణిజ్యాన్ని అమితంగా నష్టపరిచింది. ఆర్థికంగా రెండు దేశాలు అసాధారణంగా కుంగిపోయాయి. పాక్‌తో వొక్క రోజు యుద్దానికే ఇండియా రూ.5000కోట్లు నష్టపోతుందని నిపుణులు చెబుతున్నారు. 2019 ఫిబ్రవరినాటి పుల్వామా టెర్రరిస్ట్ దాడి తర్వాత వాణిజ్య సంబంధాలు బంద్ అయిపోయాయి. పాకిస్తాన్‌కు మన ఎగుమతులు 60 శాతం, దిగుమతులు 97 శాతం తగ్గిపోయాయి. ఆర్థికంగా దాదాపు దివాళా స్థితిలోని పాకిస్థాన్ భారత్‌తో శాంతిని కోరుకోడం హర్షించదగిన విషయమే. అలాగే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ ప్రజలలో మోడీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగింది. భద్రతా దళాల సాయంతో తప్ప కశ్మీర్ లోయలో పరిపాలన సులభ సాధ్యం కాని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో భారత పాకిస్తాన్ ల మధ్య చర్చలు అభిలషణీయమే. కాని పాక్ ప్రధాని చర్చలకు పెట్టిన షరతు, ముఖ్యంగా కశ్మీర్ ప్రజలు నానా వేధింపులకు గురి అవుతున్నారనే కోణం నుంచి చర్చల ప్రతిపాదన చేయడం కరచాలనానికి మొండిచేయి చాచడం వంటిదే.