లాహోర్ : పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కుమారుడు హమ్‌జా షెహబాజ్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా శనివారం ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు రోజు కేవలం మూడు ఓట్ల ఆధిక్యత తోనే తిరిగి ఎన్నికల్లో నాటకీయంగా గెలుపు సాధించిన తరువాత ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. దీనిపై దేశం మొత్తం మీద ఆందోళనలు చెలరేగడం ప్రత్యర్థి సుప్రీం కోర్టుకు వెళ్లడానికి అవకాశం కల్పిస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాలపై పంజాబ్ అసెంబ్లీ ముఖ్యమంత్రి పదవికి శుక్రవారం తిరిగి ఎన్నికలు జరగ్గా కేవలం మూడు ఓట్ల ఆధిక్యత మాత్రమే హమ్‌జాకు లభించాయి. దీంతో పంజాబ్ గవర్నర్ బలిఘుర్ రెహ్మాన్ ఎన్నికైన హమ్‌జా (47) చే శనివారం ప్రమాణ స్వీకారం చేయించారు. 368 మంది సభ్యులున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు జులై 17న ఎన్నికలు జరిగాయి. హమ్‌జాకు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పిఎంఎల్‌ఎన్ )పార్టీకి 179 ఓట్లు రాగా, ఇలాహీకి చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ క్యూ (పిఎంఎల్‌క్యూ) పార్టీకి 176 ఓట్లు వచ్చాయి. ఈ పార్టీ చీఫ్ చౌదరి షుజాత్ హుస్సేన్ ఉత్తర్వులను ఉల్లంఘించారన్న కారణంపై ఇలాహీకి చెందిన పది ఓట్లు లెక్కలోకి రాలేదు.