ఇస్లామాబాద్: మానవతా దృష్టితో 200 మంది భారతీయ జాలర్లు, మరో ముగ్గురు పౌర ఖైదీలను విడుదల చేస్తున్నట్లు పాకిస్థాన్ విదేశాంగమంత్రి బిల్వాల్ భుట్టో జర్దారీ శుక్రవారం ప్రకటించారు. గత నెల పాకిస్థాన్ కరాచీ జైల్లో మగ్గుతున్న 198మంది భారతీయ జాలర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. పాక్ సముద్ర జలాల్లో చేపలు పడుతున్నారన్న ఆరోపణపై వీరిని అరెస్టు చేశారు.
వారిని వాఘా సరిహద్దు వద్ద భారత అధికారల్కు అప్పగించారు.‘ ఈ రోజు 200 మంది భారత జాలర్లు, మరో ముగ్గురు పౌర ఖైదీలను పాక్ విడుదల చేస్తోంది. ఇంతకు ముందు మే 12న 198 మంది భారత జాలర్లను భారత్‌కు అప్పగించడం జరిగింది’ అని భుట్టో జర్దారీ ఒక ట్వీట్‌లో తెలిపారు. మానవతా అంశాలను రాజకీయం చేయరాదన్న పాక్ విధానానికి అనుగుణంగా వీరిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కాగా భారత ఖైదీలను విడుదల చేయడాన్ని కరాచీనుంచి లాహోర్‌కు వారి ప్రయాణ ఖర్చుల కోసం నిధులను అందజేస్తున్న ఈది ఫౌండేషన్ సైతం ధ్రువీకరించింది. వాఘా సరిహద్దు వద్ద భారతీయ అధికారులకు ఈ ఖైదీలను అప్పగిస్తామని ఓ అధికారి చెప్పారు. కాగా జులై నెలలో పాక్ మరో విడత భారత జాలర్లను విడుదల చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. భారత్, పాక్ మధ్య సముద్ర జలాల సరిహద్దులను సరిగా గుర్తించకపోవడం వల్ల తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించినందుకు తరచూ ఇరు దేశాల జాలర్లను పరస్పరం అరెస్టు చేయడం జరుగుతుండడం తెలిసిందే.