వాషింగ్టన్ /ఇస్లామాబాద్: ఆర్థికంగా సతమతమవుతున్న తమ దేశానికి ఆరు నుంచి ఎనిమిది బిలియన్ల డాలర్ల మేరకు క్లైమేట్ ఫైనాన్సింగ్ ద్వారా మరో రుణ ఒప్పందం కల్పించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)కి పాకిస్థాన్ అభ్యర్థించింది. ఈమేరకు శనివారం మీడియా సమాచారం వెల్లడించింది. ఈమేరకు వచ్చే వారం పాక్ లోని పరిస్థితులను సమీక్షించడానికి సమీక్ష బృందాన్ని పంపవలసిందిగా ఐఎంఎఫ్‌ను అభ్యర్థించింది.
నిధుల విస్తరణ వెసులుబాటు కింద మరో మూడేళ్ల పాటు తదుపరి ఒప్పందం వర్తించేలా వీలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. అయితే మరో రుణ ఒప్పందం కింద ఎంత పరిమాణంలో రుణం ఇవ్వాలో ఎంతవరకు గడువు విధించాలో వచ్చే మే నెలలో ఏకాభిప్రాయం కుదిరిన తరువాతనే నిర్ణయం వెలువడుతుంది. పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ నాయకత్వంలో పాక్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఐఎంఎఫ్ / ప్రపంచ బ్యాంకు వార్షిక వసంత సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రస్తుతం వాషింగ్టన్ పర్యటనలో ఉంది.
పాకిస్థాన్‌లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని పాక్ అధికార వర్గాలు చిత్రీకరిస్తున్నప్పటికీ, పాక్ విదేశీ రుణ లావాదేవీలు క్షీణదశలో ఉన్నాయని ఐఎంఎఫ్ ఇటీవల తన నివేదికలో వెల్లడించింది. 2023లో ఒప్పందం కుదిరిన తరువాత పాక్‌లో అభివృద్ధి 2024 నాటికి 2 శాతం వరకు పెరిగింది. అది వ్యవసాయ, వస్త్ర పరిశ్రమ రంగాల్లో సానుకూల కార్యాచరణ ప్రభావాలను కొనసాగించడం వల్లనే సాధ్యమైంది. కీలక ప్రాంతాల్లో సంస్కరణల ఎజెండా పూర్తిగా అమలు చేయడమైందని ఆర్థిక మంత్రి ఔరంగజేబ్ వాషింగ్టన్‌లోని ప్రపంచ బ్యాంకుకు వివరించారు.
అయితే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వరకు ఆర్థిక ప్రగతిని సాధించే అవకాశం బాగా ఉందని పేర్కొన్నారు. గతంలో ఐఎంఎఫ్‌తో 3 బిలియన్ డాలర్ల వరకు పాక్ కుదుర్చుకున్న ఒప్పందం గడువు ఈ ఏప్రిల్ నెలతో ముగుస్తుంది. అందుకనే పాక్ ప్రభుత్వం స్థూల ఆర్థిక సుస్థిరత సాధించడానికి సుదీర్ఘకాల, భారీ రుణ సౌకర్యం కల్పించాలని , దీనికోసం వ్యవస్థాపరమైన సంస్కరణలు తప్పనిసరి అని చెబుతోంది. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిని పునరుజ్జీవింప చేయడానికి సంస్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఐఎంఎఫ్ సూచిస్తోంది. దీనిపై కొత్త రుణ ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి.