ఇస్లామాబాద్ : పాకిస్థాన్ సైనిక పాలకుడు, దివంగత నేత జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు 2019లో విధించిన మరణదండన సరైనదే అని పాకిస్థాన్ సుప్రీంకోర్టు సమర్థించింది. అత్యంత తీవ్రస్థాయి దేశద్రోహ కేసులో అప్పట్లో ప్రత్యేక న్యాయస్థానం ముషారఫ్‌కు మరణశిక్షను ఖరారు చేసింది. శిక్ష ఖరారు దశలో ఆయన ప్రవాసంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన దుబాయ్‌లో గత ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన సుదీర్ఘ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. క్రిమినల్ కేసులు దాఖలు అయిననాటి నుంచి ఆయన స్వీయ ప్రవాసంలో గడుపుతూ వచ్చారు. ఆయన మరణశిక్ష కేసును ప్రధాన నాయమూర్తి ఖ్వాజీ ఫేయీజ్ ఇసాతో కూడిన ధర్మాసనం విచారించింది. తరువాత ఇప్పుడు తీర్పు వెలువరించింది.
దేశంలో 2007 నవంబర్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ ఆయనపై దేశద్రోహ కేసు దాఖలు అయింది. విచారణల తరువాత రిజర్వ్ చేసిన తీర్పును ఇప్పుడు వెలువరించారు. తనకు విధించిన మరణశిక్ష చెల్లనేరదని ప్రకటించాలని మాజీ సైనిక పాలకుడు తన జీవిత సమయంలో సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ముషారఫ్ వారసులు ఎవరూ కూడా ఎన్నిసార్లు తెలియచేసినా పట్టించుకోలేదని, నోటీసులను స్వీకరించలేదని, ఇప్పుడు ఈ వాదనను తోసిపుచ్చడానికి ఇది కూడా ఓ కారణం అని తమ తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ప్రత్యేక న్యాయస్థానం వెలువరించిన తీర్పు అనుచితం అని లాహోర్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ముషారఫ్‌కు మరణదండన సబబే అని తేల్చిచెప్పింది.