జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో టెర్రరిస్ట్ దాడి తర్వాత ఉద్రిక్తతల నడుమ భారత గూఢచారి డ్రోన్ ను కూల్చివేసినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. మంగళవారం భారత్ కు చెందిన మానవరహిత డ్రోన్ సరిహద్దురేఖను దాడి తమ గగన తలంలో ప్రవేశించగా దానిని పాక్ సైనికులు కూల్చివేశారని పాక్ టీవీ చానల్ ప్రకటించింది. సరిహద్దులలో నిఘాకోసం ఉభయ దేశాలు చిన్నచిన్న డ్రోన్ లను ఉపయోగించడం సాధారణమే. గతంలో తమ గగన తలంలోకి చొరబడిన అలాంటి డ్రోన్ లనూ కూల్చిన సంఘటనలు ఉన్నాయి. కానీ, రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఈ ప్రకటనతో ప్రాముఖ్యత సంతరించుకుంది.
అంతకు కొద్ది గంటలముందే భారతదేశంతో యుద్ధం జరిగే అవకాశం ఉందని పాక్ రక్షణ శాఖ ఉన్నతాధికారి హెచ్చరించారు. అయితే, దానిని నివారించవచ్చని కూడా పేర్కొన్నారు. కాగా, పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ రానున్న రెండు, మూడు రోజులు కీలకమైనవని పేర్కొన్నారు. ప్రస్తుతం ముప్పు ముంగిట ఉన్నామని, యుద్ధాన్ని తప్పించేందుకు ,చైనా, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత సైనిక దలాలు మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. కాగా, వరుసగా ఐదు రోజులనుంచి పాకిస్తాన్ సరిహద్దులలో కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోందని బీఎస్ ఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి.