అబుదాబి: ప్రతిష్టాత్మకమైన పాకిస్థాన్ సూపర్ లీగ్ ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టు ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్లో ముల్తాన్ జట్టు 47 పరుగుల తేడాతో పెషావర్ జల్మి జట్టును ఓడించి తొలి పిఎస్ ట్రోఫీని దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్లు మసూద్ (37), రిజ్వాన్ (30) తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించి శుభారంభం అందించారు. తర్వాత వచ్చిన షోయబ్ మక్సూద్ 35 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
రొసొ కూడా విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న రొసా 21 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 50 పరుగులు సాధించాడు. దీంతో ముల్తాన్ స్కోరు 206 పరుగులకు చేరింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పెషావర్ జల్మి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. షోయబ్ మాలిక్ (48), కమ్రాన్ అక్మల్ (36) మాత్రమే కాస్త రాణించగా మిగతా వారు విఫలమయ్యారు. ముల్తాన్ జట్టు బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి తమ జట్టుకు ట్రోఫీని సాధించి పెట్టారు.