Friday, January 17, 2025

పాక్ పర్యటన బహుళపక్ష కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

దౌత్య సంబంధాలపై చర్చకు కాదు
విదేశాంగ మంత్రి జైశంకర్
ఎస్‌సిఒ సమ్మిట్ కోసం పాక్‌కు వెళ్లనున్న మంత్రి

న్యూఢిల్లీ : షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) శిఖరాగ్ర సదస్సు కోసం ఈ నెల రెండవ వారంలో పాకిస్తాన్‌కు వెళ్లనున్న విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పొరుగు దేశానికి తన పర్యటన బహుళపక్ష కార్యక్రమం కోసమని, భారత్‌పాక్ సంబంధాలపై చర్చల కోసం కాదని శనివారం స్పష్టం చేశారు. ‘అది (పర్యటన) బహుళ పక్ష కార్యక్రమం కోసం. భారత్ పాకిస్తాన్ సంబంధాలపై చర్చించేందుకు అక్కడికి నేను వెళ్లడం లేదు. ఎస్‌సిఒలో మంచి సభ్యుడు అయ్యేందుకు నేను అక్కడికి వెళుతున్నాను. అయితే, నేను మర్యాదస్థుడిని, పౌరుడిని, తదనుగుణంగానే వ్యవహరిస్తాను’ అని విదేశాంగ శాఖ మంత్రి చెప్పారు.

సాధారణంగా ప్రధాని ప్రభుత్వాధినేతలతో అటువంటి ఉన్నత స్థాయి సమావేశాలకు హాజరవుతుంటారు, అయితే, కొన్ని సార్లు ‘అది మారుతుంటుంది’ అని జైశంకర్ అన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఇస్లామాబాద్‌లో ఎస్‌సిఒ శిఖరాగ్ర సదస్సుకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్నది. రానున్న సదస్సు కోసం పాకిస్తాన్ నుంచి ఆహ్వానం అందిందని భారత్ ఆగస్టు 30న ధ్రువీకరించింది.

కాగా, ఇస్లామాబాద్‌కు జైశంకర్ ప్రయాణం సుమారు ఒక దశాబ్దంలో ఆ దేశానికి ఒక ఉన్నత స్థాయి భారత మంత్రి జరిపే తొలి పర్యటన కానున్నది. పాకిస్తాన్‌ను సందర్శించిన చివరి భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. ఆఫ్ఘనిస్తాన్‌పై ఒక మహాసభ కోసం ఆమె 2015 డిసెంబర్‌లో ఇస్లామాబాద్‌కు వెళ్లారు. ఇది ఇలా ఉండగా, మధ్య ప్రాచ్యంలో ఘర్షణ పరిస్థితి ‘అత్యంత ఆందోళనకరం’ అని విదేశాంగ శాఖ మంత్రి చెప్పారు. లెబనాన్‌పై తన దాడులను ఉద్ధృతంచేస్తున్న ఇజ్రాయెల్‌కు ఇరాన్‌తో సంఘర్షణ తప్పకపోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News