Saturday, November 16, 2024

కదం తొక్కిన రూట్, బ్రూక్

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్ 492/3
పాక్‌తో తొలి టెస్టు
ముల్తాన్: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ దీటైనా జవాబిస్తోంది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోరును సాధించింది. జవాబుగా మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ బుధవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 492 పరుగులు చేసింది. ఓపెనర్ జాక్ క్రాలి 13 ఫోర్లతో 78 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను జో రూట్, బెన్ డుకెట్ తమపై వేసుకున్నారు. ఇద్దరు పాకిస్థాన్ బౌలర్లను దీటుగా ఎదురకొంటూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు.

రూట్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, డుకెట్ దూకుడును ప్రదర్శించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు పాక్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ధాటిగా ఆడిన డుకెట్ 75 బంతుల్లోనే 11 ఫోర్లతో 84 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇదే క్రమంలో రూట్‌తో కలిసి మూడో వికెట్ 136 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన హారి బ్రూక్ అండతో రూట్ జోరును కొనసాగించాడు. ఇద్దరు పాక్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. వీరిని ఔట్ చేసేందుకు ప్రత్యర్థి కెప్టెన్ తరచూ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. రూట్ తన మార్క్ బ్యాటింగ్‌తో అలరించాడు. బ్రూక్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రూట్ 277 బంతుల్లో 12 ఫోర్లతో 176 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.

బ్రూక్ 173 బంతుల్లో 12 బౌండరీలు, ఒక ఫోర్‌తో 141 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా 243 పరుగులు జోడించారు. కాగా, పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే ఇంగ్లండ్ మరో 64 పరుగులు చేయాలి. కీలక ఆటగాళ్లు ఇంకా బరిలోకి దిగాల్సి ఉండడంతో ఇంగ్లండ్ భారీ ఆధిక్యాన్ని సాధించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కాగా, పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు శతకాలతో అలరించారు. ఓపెనర్ అబ్దుల్లా షఫిక్ (102), కెప్టెన్ షాన్ మసూద్ (151), ఆఘా సల్మాన్ 104 (నాటౌట్) సెంచరీలు సాధించారు. దీంతో పాక్ స్కోరు 556 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News