Friday, December 20, 2024

నెదర్లాండ్స్‌ పై పాకిస్థాన్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ శుభారంభం చేసింది. శుక్రవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 41 ఓవర్లలో కేవలం 205 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. పాక్ బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌కు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. ఓపెనర్ మాక్స్ డౌడ్ ఐదు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కొలిన్ అకర్‌మన్ కూడా 17 పరుగులకే పెవిలియన్ చేరాడు.

అయితే ఈ దశలో ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్, బాస్ డి లీడ్ సమన్వయంతో ఆడుతూ నెదర్లాండ్స్ ఆశలను చిగురింప చేశారు. ఇద్దరు పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన విక్రమ్‌జీత్ సింగ్ 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత పాక్ బౌలర్లు విజృంభించారు. వరుసగా వికెట్లను తీస్తూ నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన లీడ్ ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. చివర్లో లొగాన్ వాన్ బీక్ 28 (నాటౌట్) కాస్త పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ప్రత్యర్థి టీమ్ బౌలర్లలో హారిస్ రవూఫ్ మూడు, హసన్ అలీ రెండు వికెట్లు తీశారు.

ఆదుకున్న రిజ్వాన్, షకిల్
అంకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు ఫకర్ జమాన్ (12), ఇమామ్ ఉల్ హక్ (15) నిరాశ పరిచారు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా ఐదు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో పాకిస్థాన్ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వికెట్ కీపర్ రిజ్వాన్, సౌద్ షకిల్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేసి స్కోరును ముందుకు నడిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన సౌద్ షకిల్ 52 బంతుల్లోనే 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 68 పరుగులు చేశాడు. రిజ్వాన్ 8 బౌండరీలతో 68 పరుగులు సాధించాడు. మహ్మద్ నవాజ్ (39), షాదాబ్ ఖాన్ (32) కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడంతో పాక్ స్కోరు 286 పరుగులకు చేరింది. నెదర్లాండ్స్ బౌలర్లలో లీడ్ నాలుగు, అకర్‌మన్ రెండు వికెట్లు తీశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News