ముల్తాన్: ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది. పాక్‌పై ఇన్నింగ్స్ మీద 47 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ జట్టు 54.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేయడంతో ఓటమిని చవిచూసింది. అఘా సల్మాన్, అమర్ జామల్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు విఫలం కావడంతో పాక్ జట్టు ఓడింది. పాక్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 149 ఓవర్లలో 556 పరుగులు చేసి ఆలౌటైంది. పాక్ బ్యాట్స్‌మెన్లలో షఫీక్, మసూద్, అఘా సల్మాన్ సెంచరీలతో చెలరేగారు.
కాని ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 150 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 823 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. ఇంగ్లాండ్ జట్టులో హరీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కగా జోయ్ రూట్ డబుల్ సెంచరీతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తరువాత ఇంగ్లాండ్ జట్టు 267 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ జట్టు 220 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ మీద 47 పరుగుల తేడాతో గెలిచింది. 317 పరుగులు చేసిన హరీ బ్రూక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కే అవకాశం ఉంది. తొలి టెస్టులో జాక్ లీచ్ ఏడు వికెట్లు తీసి పాక్ నడ్డివిరిచాడు.