Monday, November 25, 2024

చైనా కవ్వింపుపై చర్చకు భయమెందుకు!

- Advertisement -
- Advertisement -

భద్రతా మండలిలో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అసహనంతో ప్రధాని మోడీపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడటంతో వెంటనే భారత ప్రభుత్వం, దేశ వ్యాప్తంగా బిజెపి శ్రేణులు నిప్పులు కక్కుతున్నారు. నిరసనలకు దిగుతున్నారు. కానీ, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) దాటి భారత భూభాగంలోకి చొరబడి మన సైనికులపై దాడికి పాల్పడితే మాత్రం కనీసం మాట్లాడడానికి వెనకడుగు వేస్తున్నారు. సరిహద్దుల్లో చైనా కొంత కాలంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, తన దురాక్రమణ పన్నాగాలను బహిరంగంగా అమలు జరిపే ప్రయత్నం చేస్తున్నా, చివరకు మన భూభాగాలపై అక్రమాలకు పాల్పడుతున్నా ఆ విషయం గురించి కనీసం పార్లమెంట్‌లో చర్చించడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడటం లేదు. చైనాపై కఠినంగా మాట్లాడడానికి మన నేతలు సంకోచం వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.
తవాంగ్ సెక్టార్‌లో చైనా సేనలు వ్యూహాత్మకంగా కీలకమైన ఆ ఎత్తైన ప్రాంతంలో తమ స్థావరం ఏర్పాటు చేసుకోవడానికే దాడి చేశారన్నది స్పష్టం అవుతుంది.ఈ సంఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో చేసిన ప్రకటన నిస్సారంగా అనిపిస్తుంది. మన సైనికులు ఎవ్వరూ చనిపోలేదని, ఎవరికీ పెద్దగా గాయాలు తగలలేదని అంటూ ‘ఆత్మరక్షణ’ ధోరణిలో మాట్లాడినట్లు భావించవలసి వస్తుంది. చైనా దురాక్రమణ ధోరణిని పదునైన మాటలతో ఖండించే ప్రయత్నం, అటువంటి దుస్సాహసాలకు పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించే ప్రయత్నం చేయకపోవడం విస్మయం కలిగిస్తుంది. రోజూ ట్విట్టర్ వేదికగా అనేక అంశాలపై సందేశాలను పంపుతూ ఉండే ప్రధాని మోడీ సహితం ఈ దుర్ఘటనపై స్పందించనే లేదు.
గతంలో గాల్వాన్ వద్ద గాని, ఇప్పుడు తవాంగ్ సెక్టార్‌లో గాని మన సైనికులు కొద్ది మందే ఉన్నప్పటికీ వీరోచితంగా పోరాడి, చైనీయులకు తగు గుణపాఠం చెప్పినందుకు మనమంతా గర్వించాలి. కానీ ప్రభుత్వ ధోరణిలో అంతటి వీరోచితం వ్యక్తం కావడం లేదు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మాటలపై నిప్పులు కక్కుతూ ప్రకటన విడుదల చేసిన విదేశాంగ శాఖ మన భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే అంత ఘాటుగా ఎందుకు స్పందించ లేదు? ఆధునిక సాంకేతికతతో ఏ మూల ఎటువంటి సంఘటన జరిగినా నిముషాలలో ప్రపంచం అంతా తెలుస్తుంది. కానీ తవాంగ్ సెక్టార్‌లో మన సైనికులపై చైనా సైనికులు దాడి జరిపితే మూడు రోజుల వరకు బయట ప్రపంచానికి తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. చివరకు గాయాలకు గురైన ఓ సైనికుడి గురించి మరో సైనికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే బయటకు వచ్చింది. ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలు కథనాలు వస్తుండడంతో తప్పని సరిగ్గా ప్రభుత్వం అంగీకరింప వలసి వచ్చింది.
లేని పక్షంలో ఈ చైనా దురాక్రమణ యత్నం బయటకు వచ్చెడిది కాదా? లేదా కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నట్లు గుజరాత్‌లోని ఎన్నికల విజయాల సంబరాల నుండి ప్రజల దృష్టి మళ్లించకుండా చేయడం కోసం ఆ కథనం వెంటనే బయటకు రాకుండా చేశారా? ఏదేమైనా దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన అంశాలపై ఇటువంటి సంకుచిత ధోరణులు ప్రమాదకరమైనవని భావించాలి. చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్‌తో ప్రధాని మోడీకి వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయి. ఆయనను ఇప్పటికి 28 సార్లు కలిశారు. భారత ప్రధానులు ఎవ్వరూ చైనా అధ్యక్షులను అన్ని సార్లు కలవలేదు. ఒకరిద్దరు తప్ప ప్రపంచ దేశాధినేతలు ఎవ్వరూ మరో దేశాధినేతను అన్ని సార్లు కలసిన ఉదంతాలు కూడా లేకపోవచ్చు. అందుకనే మోడీ గురించి జింగ్ పింగ్‌కు తెలిసినంతగా మరే ప్రపంచ నేతకు తెలిసే అవకాశం లేదు.
చైనా ప్రభుత్వం అంతర్జాతీయ వ్యవహారాలలో చాలా సునిశితంగా, లోతుగా పరిశీలనలు చేస్తుంటుంది. మోడీ విషయంలో సహితం ఆయన బలాలు, బలహీనతలు జింగ్ పింగ్‌కు తెలిసినంతగా మన దేశంలో మరెవ్వరికీ తెలియకపోవచ్చని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. అందుకనే చైనా గురించి నేరుగా, కఠినంగా మాట్లాడడానికి భారత ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నదనే అభిప్రాయలు కలుగుతున్నాయి. నవంబర్, 1971లో వైట్ హౌస్ లో పాకిస్థాన్ విషయంలో భారత్ జోక్యం చేసుకుంటే అమెరికా గుణపాఠం చెబుతుందని అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అహంకారంతో హెచ్చరిస్తే, భారతదేశం అమెరికాను స్నేహితుడిగా పరిగణిస్తుంది. బాస్‌గా కాదు. భారతదేశం తన విధిని తానే రాసుకోగలదు. పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు. మాకు అవగాహన ఉంది అంటూ ఎంతో సాహసంతో, ధీటుగా జవాబు చెప్పిన భారత ప్రధాని ఇందిరా గాంధీని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయకుండా, మరో నెల రోజులకే పాకిస్థాన్‌ను ముక్కలు చేసి, సగం మందికి పైగా జనాభాను ఆ దేశానికి దూరం చేసి, మూడొంతుల మంది సైనికులను ఖైదీలుగా భారత్ పట్టుకోవడం గమనార్హం. సైనికంగా, ఆర్ధికంగా, సాంకేతికంగా ఎంతో వెనుకబడి ఉన్న రోజులలోనే అంతటి ధైర్యాన్ని ప్రదర్శించిన భారత దేశం, నేడు చైనా విషయంలో గట్టిగా హెచ్చరిక కూడా చేయలేకపోతున్నది. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా, విస్తరణ కాంక్షతో అన్ని సరిహద్దు దేశాలతోనూ కయ్యానికి కాలు దువ్వుతున్నది. అయితే చిన్న చిన్న దేశాలు సహితం చైనాను దీటుగా ఎదిరిస్తుండగా, భారత దేశం మాత్రం ఒక విధంగా ఉదాసీనత వ్యక్తం చేస్తుండటం 1962 నుండి కొనసాగుతున్నది. అమెరికా సైనిక వర్గాలు మన భూభాగాలలో చైనా గ్రామాలు నిర్మిస్తున్నట్లు శాటిలైట్ చిత్రాలను విడుదల చేసుంటే, ఆ భూభాగాలు చైనా ఆధీనంలో ఉన్నవే అంటూ నిస్సత్తువుగా భారత్ నుండి జవాబు వస్తున్నది.
చైనా ఆర్ధికంగా, సైనికంగా భారత్ కన్నా ఎంతో బలవంతంగా ఉండవచ్చు. కానీ సరిహద్దులో నేరుగా భారత సైనికులతో తలపడగలిగే సత్తువలేదని మాత్రం గాల్వాన్ లోయ, తాజాగా తవాంగ్ సెక్టార్‌లలో విఫల ఆక్రమణ ప్రయత్నాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకటి మంచు ప్రాంతం లో, పర్వత ప్రాంతాలలో పోరాట పటిమ మన సైనికులతో పోల్చుకొంటే చైనా సేనలకు తక్కువగా ఉండటం కారణం కాగా, మరో ప్రధాన కారణం వారి సేనలు చైనా కమ్యూనిస్ట్ పార్టీ పర్యవేక్షణలో పనిచేస్తాయి. అందుకనే వృత్తిపరంగా వ్యవహరింప లేవు. 1962లో సహితం భారత్ కన్నా చైనా సైనికులు బలంగా ఉండడంతో గెలుపొందలేదు. మన సైనికాధికారులు హెచ్చరిస్తున్నా అజాగ్రత్తగా ప్రభుత్వం వ్యవహరించడం, మరో కీలక అంశం వైమానిక దళాన్ని యుద్ధంలోకి దింపడానికి ప్రభుత్వం నిరాకరించడం. లేని పక్షంలో చరిత్ర మరో రకంగా ఉండెడిది. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యములలో ఒకటైన చైనా సైనికులు ఇప్పటి వరకు విజయం సాధించింది 1962లో మాత్రమే కావడం గమనార్హం. ఆ తర్వాత, అంతకు ముందు ఏ యుద్ధంలో కూడా, ఏ దేశంపై కూడా విజయం సాధించలేదు. అందుకనే భారత్‌తో నేరుగా యుద్ధం చేసే సత్తువ చైనాకు లేదు. కానీ మన రాజకీయ నాయకత్వం ప్రదర్శిస్తున్న ఉదాసీనతను ఆసరాగా చేసుకొని సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాలను క్రమంగా ఆక్రమించుకొని ప్రయత్నం చేస్తున్నది. తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడటం ద్వారా మన సేనల మనోస్థైర్యాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తున్నది.
గత ఐదారేళ్లలో చైనా సుమారు 1,000 కి.మీ భారత్ భూభాగాన్ని ఆక్రమించుకున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తరచూ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై చర్చకు ప్రభుత్వం ఎందుకు సిద్ధపడటం లేదు? రాజకీయ విమర్శలు చేసిన వారిని కూడా దేశద్రోహం కేసుల కింద అరెస్ట్ చేస్తున్న ప్రభుత్వం రాహుల్ చేసిన ఈ ప్రకటన అవాస్తవమైతే దేశద్రోహ చట్టం క్రింద అరెస్టు చేయవచ్చు గదా? కనీసం ఓ కేసు నమోదు చేసి, న్యాయస్థానం ముందు నిలబెట్టవచ్చు గదా? ప్రభుత్వ మౌనం, సమగ్ర చర్చకు సిద్ధం కాకపోవడం అనేక అనుమానాలకు ఆస్కారం కల్పిస్తున్నది. చైనా అంశాలపై నిపుణుడిగా భావించే డా. సుబ్రమణ్య స్వామి వంటి వారు రాజ్యసభలో వేసిన ప్రశ్నలకు సహితం ‘దేశ భద్రత’ సాకుతో అనుమతించకుండా ప్రభుత్వం దాటవేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై పారదర్శకత లోపిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News