ఇస్లామాబాద్: స్విస్ బ్యాంకు నుంచి వెల్లడైన డేటా ప్రకారం 1400 మంది పాకిస్థానీల 600 ఖాతాల సమాచారం వెల్లడయింది. ఈ వివరాలు ఆదివారం మీడియా రిపోర్టుల్లో వచ్చాయి. స్విస్ బ్యాంకు ఖాతాలున్న వారిలో మాజీ ఐఎస్‌ఐ చీఫ్ జనరల్ అఖ్‌తర్ అబ్దుర్ రహ్మాన్ ఖాన్ సహా చాలా మంది పాకిస్థానీ కీలక రాజకీయవేత్తలు, జనరల్స్ ఉన్నారు. స్విట్జర్లాండ్‌లో నమోదైన ‘క్రెడిట్ సూయిస్సే’ అనే ఇన్వెస్టింగ్ ఫర్మ్ ఈ వివరాలు లీక్ చేసింది. జనరల్ అఖ్‌తర్ ఖాన్ సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు అమెరికా, ఇతర దేశాల నుంచి ముజాహిదీన్లకు రొక్కం, ఇతర సాయం అందించారని ‘ద న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించింది. స్విస్ బ్యాంకులో ఖాతాలున్న పాకిస్థానీలు అత్యధికంగా 4.42 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ కలిగి ఉన్నారని ‘ద న్యూస్’ అంతర్జాతీయ వార్తా పత్రిక రాసింది. రాబోయే రోజుల్లో మరిన్ని సంగతులు వెల్లడికానున్నట్లు భావిస్తున్నారు.