దేశాల మధ్య సరిహద్దులు ఉంటాయేమో గానీ, ప్రేమకు మాత్రం ఎలాంటి హద్దులూ, సరిహద్దులూ ఉండవు. రెండు హృదయాలు కలిస్తే, ఆ ప్రేమికులు తమ ప్రేమను పండించుకునేందుకు ఎన్ని సరిహద్దులైనా దాటుతారు. ఈ మధ్యకాలంలో ఇండియా-పాకిస్తాన్ ల మధ్య వెలుగుచూస్తున్న ప్రేమకథలే ఇందుకు ఉదాహరణ.
తాజాగా ఇలాంటి మరొక ప్రేమ జంట ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ లోని షేకూర్ పురాకు చెందిన మరియా బీబీ, పంజాబ్ (ఇండియా) లోని గుర్దాస్ పూర్ జిల్లా సత్యాలీ డక్కఖానా నానోకోట్ గ్రామానికి చెందిన సోనూ మసీహ్ నాలుగేళ్లుగా ఫేస్ బుక్ ఫ్రెండ్స్. ఆ పరిచయం వారిని ప్రేమలోకి దింపింది. ఇద్దరి తల్లిదండ్రులూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ ప్రేమ జంట పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటోంది.
మరియా బీబీ ఇండియా వచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే తెలియక చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఆమె వీసా దరఖాస్తును అధికారులు రిజెక్ట్ చేశారు. దాంతో మళ్లీ భారత వీసాకోసం దరఖాస్తు చేసుకుంది. తన ప్రేమికురాలు మరియాకు భారత ప్రభుత్వం వీసా మంజూరు చేయాలని సోనూ మసీహ్ కోరుతున్నాడు.
తమ జంటను ఒకటి చేయాల్సిందిగా ప్రేమికులు ఇద్దరూ మక్బూల్ అహ్మద్ అనే జర్నలిస్టును ఆశ్రయించారు. గతంలో ఎన్నో ప్రేమ జంటలను కలిపిన అనుభవం మక్బూల్ కి ఉంది.