ఈ నెల 30 లోపు వాఘా సరిహద్దు దాటాలి:డిజిపి జితేందర్
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలతో డీజీపీ జితేందర్ అప్రమత్తం అయ్యారు. తెలంగాణకు వచ్చిన పాకిస్థానీయులకు డిజిపి కీలక ఆదేశాలు జారీ చేశారు. పాకిస్థానీయులకు వీసాలను కేంద్రం నిలిపివేసిందని, ఇప్పటికే వీసాలు పొందిన వారికి ఈ నెల 27 వరకు గడువు ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో దాదాపు 200 పైచిలుకు పాకిస్తానీలు ఉన్నారని సమాచారం అందడంతో హైఅలర్ట్ ప్రకటించారు. తక్షణమే తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే భారత్‌ను వదిలి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ తర్వాత వీసాలు రద్దు చేస్తామని, ఆలోపే వెళ్లిపోవాలని ఆదేశించారు. మెడికల్ వీసా దారులకు ఈనెల 29వ తేదీ వరకూ అవకాశం ఇస్తామని, ఆ తర్వాత క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీళ్లేదని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
అక్రమంగా తెలంగాణలో ఉండాలనుకుంటే ఊరుకునేది లేదని.. జల్లెడ పట్టి బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనెల 30 వరకు అటారి వాఘ బార్డర్ ఓపెన్ ఉంటుంది. హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీయులు ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్న పాకిస్తానీయులపై నిఘా పెట్టామని తెలిపారు. అంతకుముందు.. పాకిస్తానీయులు 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.
ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో భారత్ సార్క్ వీసా పొడిగింపు పథకం కింద చాలా మంది పాకిస్తానీయులకు భారత్‌లో పర్యటించే అవకాశాలు కల్పించారు. ఈ ప్రోగ్రామ్ కింద భారత్‌లో ఉన్న ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
వీసా రద్దు విధానం
హోం మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం,అమిత్ షా ముఖ్యమంత్రులను వారి రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరుల జాబితా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. పాకిస్తాన్ పౌరుల ప్రస్తుత వీసాలన్నీ 2025 ఏప్రిల్ 27 నుంచి రద్దు అవుతాయి. అయితే వైద్య వీసాలు 2025 ఏప్రిల్ 29 వరకు చెల్లుబాటులో ఉంటాయి. దీనితోపాటు పాకిస్థాన్‌లో ఉన్న భారతీయ పౌరులు వీలైనంత త్వరగా పాకిస్తాన్ నుంచి తిరిగి రావాలని ప్రభుత్వం సూచించారు. అధిక ప్రాధాన్యతాక్రమంలో దీన్ని తీసుకోవాలని ఆయా రాష్ట్రాల్లో శాంతిభద్రతలను కాపాడాలని అమిత్‌షా ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ పౌరులను గుర్తించి వారి వీసాలను రద్దు చేసే ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం చేయకూడదని కూడా ఆయన అన్నారు. ఈ ప్రక్రియ సజావుగా పూర్తి కావడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి మరింత క్లోజ్‌గా పనిచేస్తోందని సమాచారం.
పాకిస్తాన్‌తో దౌత్యపరమైన ఉద్రిక్తతలు
పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారతదేశం న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు సైనిక సలహాదారులను బహిష్కరించింది. ఇస్లామాబాద్‌లోని తన హైకమిషన్‌లో సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి కుదించింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ తన గగనతలంలోకి భారత్ విమానాలను నిషేధించింది. భారతదేశంతో అన్ని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసింది. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని పాకిస్తాన్ ‘యుద్ధ చర్య‘గా అభివర్ణించింది.