ఎకె 47, మందుగుండు స్వాధీనం.. భారీ ఉగ్రదాడుల కుట్ర భగ్నం
న్యూఢిల్లీ: భారత జాతీయుడిగా నకిలీ గుర్తింపు కార్డుతో చెలామణి అవుతున్న పాకిస్థాన్ ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ మంగళవారం అరెస్టు చేసింది. తూర్పు ఢిల్లీ లక్ష్మీనగర్ రమేష్ పార్కు ప్రాంతంలో మహమ్మద్ అష్రఫ్ అనే ఈ ఉగ్రవాది ఉంటున్నాడు. అతని వద్దనుంచి పోలీసులు ఎకె 47తో పాటుగా అదనంగా ఉన్న మ్యాగజైన్, 60 రౌండ్ల బులెట్లు, ఒక హ్యాండ్ గ్రెనేడ్, 2 పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఉగ్రవాదిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టంతో పాటుగా ఇతర సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు నమోదు చేసినట్లు స్పెషల్ సెల్ డిసిపి ప్రమోద్ సింగ్ కుష్వాహా చెప్పారు.అతను తనను మౌలానా(మత బోధకుడు)గా చెప్పుకుని తిరుగుతున్నాడని, సోమవారం రాత్రి అతడ్ని అరెస్టు చేసినట్లు డిసిపి తెలిపారు.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన అష్రఫ్ బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి వచ్చాడని, ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ల ద్వారా నకిలీ భారతీయ గుర్తింపు కార్డు సంపాదించి పదేళ్లుగా దేశంలో ఉంటున్నాడని ఆయన చెప్పారు. అష్రఫ్ స్కూలు చదువు పూర్తయిన తర్వాత అతడ్ని పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ నేరుగా రిక్రూట్ చేసుకుని ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చిందని కూడా ఆయన తెలిపారు. నసీర్ అనే ఐఎస్‌ఐ ఏజంట్‌తో అష్రఫ్ కాంటాక్ట్‌తో ఉన్నాడని, దసరా పండగల సందర్భంగా ఉగ్రదాడి జరపడానికి సంబంధించిన సమాచారం అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. అతని అరెస్టుతో ఓ పెద్ద ఉగ్రదాడి జరగకుండా స్పెషల్ సెల్ బృందం విఫలం చేసిందని వారు తెలిపారు.