జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్ర దాడి ఘటనకు సంబంధించి మరొక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. దాడి జరిగిన బైసరన్ లోయకు కొన్ని రోజుల ముందు సమీపంలోని మరొక పర్యాటక ప్రాంతమైన బేతాబ్ వ్యాలీలో ఒక పర్యాటకుడు తీసిన వీడియోలో ఇద్దరు అనుమానిత వ్యక్తులు కనిపించడం కలకలం రేపుతోంది. వారు బైసరన్ దాడి నిందితుల ఊహాచిత్రాలతో సరిపోలుతున్నట్లు గుర్తించడంతో, ఉగ్రవాదులు దాడికి ముందు కీలక పర్యాటక ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి ఉండవచ్చుననే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కీలక వీడియో క్లిప్‌ను పర్యాటకుడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు అందజేశారు. పుణెలో స్థిరపడిన మలయాళీ సామాజిక కార్యకర్త శ్రేజిత్ రమేశన్ ఈ నెలలో తన కుటుంబంతో కలసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 18న భార్య, ఇద్దరు కుమార్తెలతో కలసి పహల్గాంకు సుమారు 7.5 కిలోమీటర్ల దూరంలోని బేతాబ్ వ్యాలీని ఆయన సందర్శించారు. అక్కడ తన పిల్లలతో సరదాగా గడుపుతున్న దృశ్యాలను వీడియో తీశారు. అనంతరం వారి కుటుంబం శ్రీనగర్, గుల్మార్గ్‌లలో పర్యటించి తిరుగు ప్రయాణం అయ్యారు.
అయితే, 22న పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దాడి గురించి తెలుసుకున్న రమేశన్ బంధువులు, స్నేహితులు ఆయన క్షేమ సమాచారం కోసం ఫోన్లు చేశారు. అదే సమయంలో దాడికి పాల్పడిన నిందితుల ఊహాచిత్రాలను అధికారులు విడుదల చేశారు. ఆ చిత్రాలను చూసిన రమేశన్‌కు అనుమానం కలిగింది. వెంటనే తన కాశ్మీర్ పర్యటనలో తీసిన వీడియోలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో బేతాబ్ వ్యాలీలో తీసిన వీడియోలో కనిపించిన ఇద్దరు వ్యక్తులు విడుదల అయిన ఊహాచిత్రాల్లోని వారితో పోలి ఉన్నట్లు ఆయన గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన రమేశన్ ఎన్‌ఐఎ అధికారులను సంప్రదించి, తన వద్ద ఉన్న వీడియో క్లిప్‌ను వారికి అందజేశారు. ప్రస్తుతం ఎన్‌ఐఎ అధికారులు ఆ వీడియోను విశ్లేషిస్తున్నారు. వీడియోలోని వ్యక్తులు, దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఒకరేనా కాదా అనేది ఫోరెన్సిక్ దర్యాప్తు ద్వారా నిర్ధారించవలసిఉంది. కాగా, బేతాబ్ వ్యాలీకి, దాడి జరిగిన బైసరన్ వ్యాలీకి మధ్య దాదాపు పది కిమీ దూరం ఉంటుంది. అవసరమైనప్పుడు విచారణకు హాజరు కావాలని ఎన్‌ఐఎ అధికారులు తనకు సూచించారని, అలాగే ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడవద్దని కూడా చెప్పారని రమేశన్ స్థానిక పత్రికలకు తెలిపినట్లు సమాచారం.