Friday, November 15, 2024

పాకిస్తానీయులే మన అతి పెద్ద ఆస్తులు

- Advertisement -
- Advertisement -

మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పాకిస్తానీయులు భారత్‌కు అతి పెద్ద ఆస్తులని అభివర్ణించి కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి మణి శంకర్ అయ్యర్ కొత్త వివాదానికి తెరలేపారు. రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ అయ్యర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన అనుభవం మేరకు పాకిస్తానీ ప్రజలలో స్పందించే తత్వం అధికమని, నిజానికి వారు అతిగా స్పందిస్తారని చెప్పారు. మనం స్నేహంగా ఉంటే వారు అతిగా స్నేహం చేస్తారు..మనం శత్రువుగా చూస్తే వారు మితిమీరిన శత్రుత్వం ప్రదర్శిస్తారు అని అయ్యర్ వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్‌లో చూపినట్లుగా తనకు మరే దేశంలోను ఇంటటి స్నేహపూర్వక స్వాగతం లభించలేదని ఆయన చెప్పారు. గతంలో లాహోర్‌లో తాను భారత కాన్సల్ జనరల్‌గా పనిచేసిన రోజులను అయ్యర్ గుర్తు చేస్తూ తనను, తన భార్యను పాకిస్తానీ ప్రజలు ఎంతో ఆదరంగా చూసుకున్నారని ఆయన తెలిపారు. భారతీయుల ఊహలకు భిన్నంగా ఉండే పాకిస్తాన్ ఉంటుందని వివరిస్తూ తాను రాసిన మెమోయర్స్ ఆఫ్ ఎ మావెరిక్ అనే పుస్తకాన్ని ఆయన ప్రస్తావించారు. పాక్, భారత్‌కు చెందిన పౌర సమాజం చర్చలు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రభుత్వాలకు అతీతంగా రెండు దేశాల వెలుపల ఉభయ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, విద్యార్థులు, విద్యావేత్తలు సమావేశం కావాలని ఆయన సూచించారు. ఇలా ఉండగా.. రెండు వారాల క్రితమే అయ్యర్ కుమార్తె సురణ్యా అయ్యర్ అయోధ్యలో రామ మందిరంపై వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. జనవరి 22న అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రాణప్రతిష్టను ఖండిస్తూ ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. భారతదేశంలోని ముస్లింలకు మద్దతుగా తాను జనవరి 22 నుంచి మూడు రోజులపాటు ఉపవాస దీక్ష చేయనున్నానని ఆమె జనవరి 19న ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. హిందూత్వం, జాతీయవాదం పేరిట అయోధ్యలో జరుగుతున్న దాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News