మన తెలంగాణ/హైదరాబాద్ : నాటి రోజుల్లో కమ్యూనిస్టు ఉద్యమానికి కోటలుగా పేరొందిన ప్రాంతాల్లో ఒకటైన గన్నవరం తాలుకా పెద్దవుటుపల్లి గ్రామంలో జన్మించిన వెంకట్రామమ్మ ఆదివారం సి.ఆర్.ఫౌండేషన్ వృద్దాశ్రమంలో కన్నుమూశారు. ఆమె సుదీర్ఘకాలంగా సి.ఆర్. ఫౌండేషన్ వృద్దాశ్రమంలో నివసిస్తున్నారు. యార్లగడ్డ కోటయ్య, నానమ్మ దంపతుల సంతానమయిన వెంకట్రామమ్మ పాలడుగు సూర్యనారాయణ సతీమణి. సిపిఐ సీనియర్ నాయకుడైన వై.వి. కృష్ణారావుకు స్వయానా సోదరి. తన ఆరుగురి సంతానాన్ని అభ్యుదయ భావాలతో పెంచి పెద్ద చేశారు .వామపక్ష ఉద్యమ బాటలో పయనించిన వారి చిన్నకొడుకు పాలడుగు రామకృష్ణ అతి చిన్న వయసులోనే అమరుడయ్యాడు. నిండు నూరేళ్లు జీవిస్తానన్న తన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, తన తరువాత నాలుగు తరాల వారిని చూసి ఇటీవలే ( మొన్న 10 వ తేదీన) తన వందవ పుట్టినరోజు జరుపుకున్నారు.
సి ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పల్లా వెంకటరెడ్ది, కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వర రావు, కోశాధికారి చెన్నకేశవరావు, ప్రముఖ హృద్రోగ వైద్యులు డా. డి.యన్.కుమార్, ప్రముఖ గైనకాలజిస్ట్ డా. ప్రతిభ తదితరులు పార్థివదేహాన్ని దర్శించి శ్రద్దాంజలి ఘటించారు. సి ఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు, సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సి ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు, సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెంకటరామమ్మ మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆమె కళ్ళు యల్వి ప్రసాద్ ఐ ఇంస్టిట్యూట్ కు సమర్పించారు. పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజ్ కు అప్పగిస్తున్నారు.