Friday, January 3, 2025

పాలమూరు అంటే లేబర్ జిల్లా కాదు..

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: పాలమూరు అంటే లేబర్ జిల్లా కాదని… ఐటీ ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
2014 కు ఇప్పటికి మహబూబ్ నగర్ అభివృద్ధిలో తేడాను గమనించాలని ఆయన కోరారు. ఆదివారం అయన మహబూబ్ నగర్ సమీపంలోని దివిటిపల్లి ఐటి కారిడార్ లో ముల్లర్ డాట్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో యూఎస్ అకౌంటింగ్ లో శిక్షణ పొందిన 140 మంది అభ్యర్థులకు ధ్రువపత్రాలను అందజేశారు.

అనంతరం మంత్రి ప్రసంగించారు… ఒకప్పుడు పాలమూరు అంటే లేబర్ జిల్లాగా ప్రపంచవ్యాప్తంగా పేరు ఉండేదని… పంటలు పండని జిల్లాగా, తాగునీరు లేని అందని ప్రాంతంగా పేరొందిందని అన్నారు. ఇప్పుడు పాలమూరును అభివృద్ధి పథంలో ఊహించని స్థాయిలో ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు.

ఒకప్పుడు మహబూబ్ నగర్ లో పంటలు పండేవి కాదని, 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని, పాలమూరు లేబర్ అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిందని, అలాంటిది తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మహబూబ్ నగర్ పైనే దృష్టి ఉంచి దినదినాభివృద్ధి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇంకా మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని రంగాలలో మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే కెసిఆర్ అర్బన్ ఎకో పార్కులో జంగిల్ సఫారిని, బర్డ్స్ ఎన్ క్లోజర్ ను ప్రారంభించనున్నామని అన్నారు.

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించిన సమయంలో సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను మహబూబ్ నగర్ కు మంజూరు చేశారని… అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యాపరంగా, వైద్య పరంగా జిల్లాను ఎంతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు .

దివిటిపల్లి లో 400 ఎకరాలలో ఐటీ పార్కు ఏర్పాటు చేశామని, ఇక్కడ యువతకు ఇక్కడే ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పంతో గట్టి కృషి చేస్తున్నామని, గతంలో జిల్లాను పాలించిన వారు దత్తత తీసుకున్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారు. విద్యాసంస్థలు, పరిశ్రమలతో పాటు, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కర్వేన, ఉదండాపూర్ రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించనున్నామని తెలిపారు.

అకౌంటెన్సీలో ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు ఉన్న ముల్లర్ డాట్ కనెక్ట్ సంస్థ మన ఐటి కారిడార్ లో ఇక్కడి నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం సంతోషకరమన్నారు. అమెరికాకు చెందిన ముల్లర్ డాట్ కనెక్ట్ ప్రెసిడెంట్ ఇలపకుర్తి ఫణి అడిగిన వెంటనే ఐటీ కారిడార్ లో తమ సంస్థను ఏర్పాటు చేసి అకౌంటెన్సీలో శిక్షణ ఇస్తున్నందుకు అభినందించారు. భవిష్యత్తులో వారి సంస్థకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను ఒక స్థాయికి తీసుకొస్తారని, తల్లిదండ్రుల కృషిని మరువకుండా పిల్లలు బాగా పనిచేసి మంచి పేరు సంపాదించాలని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా యువతకు అమెరికాలో సైతం ఉద్యోగాలు ఇచ్చేలా అమెరికాకు తీసుకెళ్లాలని ఆయన ముల్లర్ డాట్ కనెక్ట్ అధ్యక్ష్యునితో విజ్ఞప్తి చేశారు. వచ్చే సంవత్సరం వరకు చెంతనే ఉన్న అమర్ రాజా లిథియం అయాన్ పరిశ్రమ ద్వారా 10,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ఐటి కారిడార్ నుండి మహబూబ్ నగర్ టౌన్ వరకు 100 ఫీట్ల రహదారిని నిర్మిస్తున్నామని, షాద్ నగర్ నుండి మహబూబ్ నగర్ వరకు భవిష్యత్తులో మెట్రో రైలు సైతం వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇక్కడ నైపుణ్యం ఉన్న యువత అందుబాటులో ఉన్నారు: ముల్లర్ డాట్ కనెక్ట్ ప్రెసిడెంట్ ఇలపకుర్తి ఫణి

మహబూబ్ నగర్ లో మంచి నైపుణ్యం ఉన్న యువత అందుబాటులో ఉన్నారని ముల్లర్ డాట్ కనెక్ట్ ప్రెసిడెంట్ ఇలపకుర్తి ఫణి తెలిపారు. దీనిని గుర్తించే అమెరికా నుండి ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు వస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం హైదరాబాదులో తమ కంపెనీలో 150 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వచ్చే సంవత్సరం నాటికి 1500 మందిని తయారు చేస్తామన్నారు. ఇది మొదటి బ్యాచ్ అని, సేవ, సంక్షేమమే ధ్యేయంగా తాము మహబూబ్ నగర్ కు వచ్చినట్లు ఆయన తెలిపారు.

ముల్లర్ డాట్ కనెక్ట్ సంస్థకు చెందిన సీఎంఏ భాను ప్రకాష్, సుశాంత్, సందీప్, శరత్, వైస్ ఎంపీపీ అనిత పాండురంగారెడ్డి, దివిటిపల్లి సర్పంచ్ జరీన, రైతుబంధు డైరెక్టర్ కొండా లక్ష్మయ్య, నాయకులు హనుమంతు, రమణారెడ్డి, చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News