Monday, December 23, 2024

ముగ్గురు ముగ్గురే..

- Advertisement -
- Advertisement -

మహబూబ్ : పాలమూరు జిల్లాలో ఒకప్పుడు హీరోలు.. రాజకీయాల్లో అందవేసిన చేతులు..వారు ఏది చెబితే అదే శాసనం.. రాజకీయాల్లో తలపండిన నేతలు..తమ తమ వాగ్దాటిలో మించిన వారు లేరని చెప్పాలి.. రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాజకీయ నేతలు.. నాటి తెలుగుదేశం పార్టీ నేతలు.. అప్పటి టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడికి కుడిభుజాలుగా ఉంటూ చక్రం తిప్పిన నేతలు. వారే నాగం జనార్దన్ రెడ్డి. రావుల చంద్రశేఖర్, మందా జగన్నాథంలు. ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో వీరి పేర్లు తెలియని వారు ఉండరు. కానీ కాలం కలిసిరాకపోతే ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయంటే ఇదే మరి..ఒకప్పుడు రాజకీయాల్లో తమదైన శైలిలో రాజకీయ చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు వయస్సు మీదపడడంలో రాజకీయాల్లో వస్తున్న మార్పులను అందుకోలేక పోవడమో కాని ప్రస్తుత రాజకీయాల్లో వారు జీరోలుగా మారారు. ఒకప్పుడు టిడిపిలో సీనియర్ నేతలుగా ఉన్న ఈ నేతలందరూ ఇప్పుడు బిఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు.

నాగం జనార్దన్ రెడ్డి
ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి. ఈయన నాగర్ కర్నూలు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి 1985,1994,1999,2004, 2009, 2012 వరుసగా ఆరు సార్లు విజయ ఢంకా మోగించిన నేత. ఎన్‌టిఆర్‌తోనూ, ఆయన మరణాంతరం చంద్రబాబుకు కుడిభుజంగా ఉన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగానూ, ఎక్సైజ్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ వంటి ముఖ్యమైన శాఖలకు మంత్రిగా పని చేశారు. నియోజకవర్గ అభివృద్ధ్దిలోనూ తనదైన ముద్ర వేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని 120 గ్రామాలకు రూ.65 కోట్ల నిధులతో అప్పట్లోనే రామన్ పాడు నుంచి ప్రత్యేక పైపులైన్ల ద్వారా తాగునీటిని అందించారు. చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో భవనాలు ఎలా కట్టరో అలాగే నాగర్‌కర్నూల్లోని పాత కలెక్టరేట్, పంచాయతీ భవనాలను నాగం నిర్మించారు. కెఎల్‌ఐ ప్రాజెక్టును తీసుకురావడంలో ఈయన పాత్ర కీలకం.

టిడిపిలో మంచి వాగ్దాటి నేతగా ఉంటూ కర్నాటకలోని ఒబులాపురం ఘనుల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీయించారు. ఘనుల నేత గాలి జనార్దన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు గుప్పించి ఆయన జైలుకు వెళ్లడంలో నాగం పాత్ర ఉన్నదనే చర్చ అప్పట్లో జరిగింది. ఇలా ఆయన నాగర్ కర్నూలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తనకుంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నేపథ్యంలో రాజకీయాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆయన టిడిపి పార్టీని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన బిజెపి పార్టీలోనూ కొనసాగారు. అక్కడ నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇటీవల టికెట్ కోసం ప్రయత్నించారు. టికెట్ దక్కక పోవడంతో ఇటీవలనే సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌లోకి చేరారు. ఒకప్పుడు హీరోగా వెలిగిన నేత ఇప్పుడు తనకంటూ ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎన్నికల తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది చూడాల్సి ఉంది.

రావుల చంద్రశేఖర్ రెడ్డి
వనపర్తి జిల్లాలో పేరున్న నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. రాజకీయ మేధావి. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా విశ్లేషించగల నేత.. సౌమ్యుడు అనే పేరుంది. ఈయన వనపర్తి నియోజకవర్గం నుంచి 1994. 2009లో రెండు సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. టిడిపిలో సీనియర్ నేత. అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. తెలంగాణాలో టిడిపి నుంచి అందరూ వెళ్లిపోయినా రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాత్రం పార్టీనే నమ్ముకొని ఉన్నారు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగారు. చంద్రబాబు నాయుడుకు అంత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. ఇటీవలనే ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు.

మందా జగన్నాథం
మంద జగన్నాథం కూడా టిడిపిలో సీనియర్ నేతగా ఉంటూ వచ్చారు. సీనియర్ పొలిటిషియన్. నాగర్ కర్నూలు పార్లెమెంట్ నుంచి 1996, 1999, 2004, 2009 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ నుంచి లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఈయన కూడా మంచి వాగ్దాటి. టిడిపిలో నాగం, మందా, రావుల చంద్రశేఖర్ రెడ్డిలు సమకాలికులు. మందా జగన్నాథం కూడా పార్లెమంట్ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. తెలంగాణా ఉద్యమంలో కీలకంగా పని చేశారు. ఈ సమయంలోనే టిఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత నంది యల్లయ్య చేతిలో ఓటమి చెందారు. అప్పటి నుంచి రాజకీయాల్లో చురుకుగా లేకున్నా బిఆర్‌ఎస్‌లో కొనసాగారు. 2014లో తమ కుమారునికి అలంపూర్ టికెట్ ఇప్పించుకున్నా కుమారుడిని గెలిపించుకోలేక పోయారు. అయినప్పటికి ముఖ్యమంత్రి కెసిఆర్ మందా జగన్నాథంకు రాష్ట్రం నుంచి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ప్రస్తుతం అదే పోస్టులో కొన సాగుతున్నారు. ఇలా ముగ్గురు నేతలు వారి వారి రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూడాల్సి వచ్చింది. మారిన రాజకీయాల్లో వారు సీనియర్ నేతలుగా ఉన్నా వారికి రాజకీయ పదవులు కలిసి రావడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News