Monday, December 23, 2024

పాలమూరు రంగారెడ్డి డ్రై రన్ సక్సెస్

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్ వద్ద మొదటి పంప్ డ్రై రన్ సక్సెస్ అయ్యింది. ఆదివారం ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్‌సి మురళీధర్, రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల ముఖ్య సలహాదారు పెంటారెడ్డి, చీఫ్ ఇంజనీర్ హమీద్ ఖాన్‌ల పర్యవేక్షణలో ఇంజనీరింగ్ అధికారులు డ్రై రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. 12.3 లక్షల ఆయకట్టుకు కృష్ణా నది ద్వారా నీరు అందించే భారీ సాగునీటి ప్రాజెక్టును రికార్డు సమయంలో సాంకేతిక అనుమతులు పొందుతూ నీటిని ఎత్తిపోసే దిశగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.

ఆసియా ఖండంలోనే అతి పెద్ద మోటర్లను ఏర్పాటు చేసి భూగర్భంలోనే మోటర్లను అమర్చే అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కృష్ణా నది పరివాహక ప్రాంతమైన నార్లాపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఒక్కో లిఫ్ట్ వద్ద 8 మోటర్ల ద్వారా రోజు 2 టిఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా మోటర్లను ఏర్పాటు చేశారు. మొదటి లిఫ్ట్ వద్ద ఆదివారం ఒక మోటర్‌కు డ్రై రన్ పూర్తి చేయగా మరో 15 రోజుల్లో రెండవ మోటర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ప్రాజెక్టు సలహాదారులు పెంటారెడ్డి తెలిపారు. ఈనెల 15వ తేదిన నీటిని ఎత్తిపోయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

140 మెగా వాట్ల భారీ విద్యుత్‌తో ఒక్కో మోటర్ నడుస్తుంది. ప్రతి మోటర్‌కు యూనిట్ల వారిగా విద్యుత్ సౌకర్యం కల్పించారు. భూగర్భంలో మోటర్లు అమర్చగా భూ ఉపరితలంపై ప్యానెల్ బోర్డులు, విద్యుత్ ఇతర నిర్వహణ ఏర్పాట్లను చేశారు. భూగర్భంలో ఉండే మోటర్ల వద్ద కేవలం సిసి కెమెరాల పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని పెంటారెడ్డి తెలిపారు. కృష్ణా నది నుంచి నీరు నేరుగా హెడ్ రెగ్యులేటర్ గేట్ల వద్దకు రాగా అక్కడి నుంచి ఫోర్‌వే ద్వారా నీరు టన్నెళ్లకు, ఆ తర్వాత సర్జిపుల్‌కు, డ్రాఫ్ట్ గేట్ల ద్వారా నీటిని నేరుగా నీటిని ఎత్తిపోసే పంపులకు అందించడం జరుగుతుంది. ఒక్కో మోటర్ 3 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే విధంగా డిజైన్ రూపొందించారు.

= పాలమూరు రంగారెడ్డి మొదటి పంపు డ్రై రన్ విజయవంతం : రజత్ కుమార్
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మొదటి లిఫ్ట్ వద్ద ఒక మోటర్ డ్రై రన్ విజయవంతం అయినట్లు రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్‌సి మురళీధర్, రాష్ట్ర ప్రాజెక్టుల సలహాదారు పెంటారెడ్డి, సిఈ హమీద్ ఖాన్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డ్రైరన్ విజయవంతం కావడం పట్ల ఆయన ఇంజనీరింగ్ అధికారులను రాత్రి పగలు కష్టపడిన అధికారులు, సిబ్బంది, కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

త్రాగు, సాగు నీటి రంగంలో ఈ ప్రాజెక్టు కీలకమన్నారు. ఈ రంగాలతో పాటు పరిశ్రమలకు నీటిని వినియోగించుకోవడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు. దక్షిణ తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వరప్రదాయని అన్నారు. ఈ నెల 15వ తేదిన నీటిని ఎత్తిపోసే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. 25వ తేది నాటిని మరో పంపును అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోయడం జరుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News