హాజరైన వేలాదిమంది కార్యకర్తలు
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారకం ‘ఫీనిక్స్’ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇకె పళనిస్వామి ప్రారంభించారు. మెరీనా బీచ్‌లో ఏర్పాటు చేసిన స్మారకం ప్రారంభోత్సవానికి ఉపముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం కూడా హాజరయ్యారు. బుధవారం ఓవైపు బెంగళూర్‌లోని జైలు నుంచి శశికళ విడుదలకు ఉత్తర్వులు జారీ కాగా, అదేరోజు పళనిస్వామి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్టు పలువురు భావిస్తున్నారు. ఎఐఎడిఎంకె కార్యకర్తలు బెంగళూర్ వెళ్లకుండా కట్టడి చేయడానికే ఈ కార్యక్రమాన్ని సరీగ్గా అదే రోజు నిర్వహించారని అంటున్నారు. రిపబ్లిక్‌డే ఉత్సవాలకు కూడా అంతగా హాజరుకాని జనం, స్మారకం వద్దకు వేలాదిగా చేరుకోవడం గమనార్హం.
జయలలిత మరణానంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ 2017 ఫిబ్రవరిలో జైలుపాలయ్యారు. దాంతో, ఎఐఎడిఎంకెలోని రెండు వర్గాలు ఏకమై శశికళను పార్టీ నుంచి బహిష్కరించాయి. ఆమె విడుదల నేపథ్యంలో తిరిగి పార్టీలో చేర్చుకోబోమని ఇప్పటికే పలుమార్లు పళనిస్వామి స్పష్టం చేశారు. ఓ తల్లి తన పిల్లల కోసం ఎలా ఆరాటపడ్తారో అలాగే తమిళనాడు ప్రజల కోసం జయలలిత అమ్మలా వ్యవహరించారని పళనిస్వామి అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అమ్మ కోసం ఎఐఎడిఎంకెను గెలిపించాలని కోరారు.