Friday, January 17, 2025

తాత్కాలిక విరామమైనా మేలేగాని…

- Advertisement -
- Advertisement -

42 రోజుల తాత్కాలిక విరమణ దీర్ఘకాలికమో లేక శాశ్వతమో కాగలదా? అంతటికీ మూలమైన స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు, పాలస్తీనా, ఇజ్రాయెల్ అనే రెండు స్వతంత్ర దేశాల పరిష్కారం వంటివి నెరవేరగలవా అన్న ప్రశ్నలున్నాయి. ప్రస్తుత ఒప్పందంలోని 8 క్లాజులు, 15 సబ్ క్లాజుల పాఠాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఈ తాత్కాలిక విరమణ అంశాలు సక్రమంగా ఉభయులకు సంతృప్తికరంగా, రెండు వైపుల నుంచి కూడా అమలైన పక్షంలో, విరమణ గడువు 42 రోజులనుంచి మరింత పొడిగింపు అయే అవకాశం ఉంది. అట్లా చర్చలు అమలు పొడిగింపులన్నవి ఎంతకాలమైనా సాగవచ్చు. ఇటు వంటిది అనేక అంతర్జాతీయ ఒప్పందాలలో జరగ టం మామూలే. అదే సమయంలో ఎవరు దానిని ఉల్లంఘించినా లేక ఉల్లంఘించకపోయినా ఆ పని చేసినట్లు ఆరోపిస్తూ తిరిగి ఎవరు యుద్ధానికి దిగి నా, ఒప్పందాలు భంగ పడటం కూడా తెలిసిందే

హమాస్ ఇజ్రాయెల్ మధ్య పదిహేను మాసాలుగా సాగుతున్న యుద్ధ విరమణకు ఎట్టకేలకు ఒక అంగీకారం కుదిరింది. దోహాలో సాగిన విరమణ చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ బుధవారం నాడు ఈ విషయం ప్రకటించగా హమాస్ ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా మౌలికంగా ధ్రువీకరిస్తూనే, కొన్ని చిన్నచిన్న అంశాలకు ఇంకా తుదిరూపం రావలసి ఉందన్నారు. కాని అవి పెద్ద చిక్కులేమీ కాదన్నది మధ్యవర్తుల అభిప్రాయం. అది కూడా పూర్తియిన తర్వాత గురువారం (16 జనవరి) రోజున ఆ ఒప్పందానికి ఇజ్రాయెలీ పార్లమెంటు ఆమోద ముద్ర వేయవలసి ఉంటుంది.

నెతన్యాహూ నాయకత్వం వహిస్తున్న కూటమి ప్రభుత్వంలో తీవ్ర మితవాద జియోనిస్టు పార్టీలు కొన్నున్నాయి. వాటిది ఆయనకు చెందిన లికుడ్ పార్టీకన్న తీవ్ర జాతీయ వాద వైఖరి. మామూలుగానైతే వాటి ధోరణి కారణంగా ఈ ఆమోదం తేలిక కాకూడదు. కాని, యుద్ధం విషయమై స్వయంగా ఇజ్రాయెల్‌లోనే గాక అమెరికా సహా అంతర్జాతీయంగా ఒత్తిడులు ఉన్నందున అక్కడి పార్లమెంట్ ఆమోదానికి సమస్య ఉండకపోవచ్చు. కనుక, అన్నీ సవ్యంగా సాగితే ఈ వ్యాసం వెలువడే సమయానికి యుద్ధ విరమణ ఒప్పందం సాకారమవుతుంది.

అయితే ఇది యుద్ధ విరమణే తప్ప అందుకు శాశ్వతమైన ముగింపు కాదు. విరమణ అయినా కేవలం 42 రోజుల గడువు గల తాత్కాలిక చర్య. ఈ కాలంలో ఇజ్రాయెల్ కోరుకునేది హమాస్ నిర్బంధంలో గల తమ బందీల విడుదల. హమాస్‌కు కావలసింది నిరంతర యుద్ధం నుంచి కొంత విరామం. ఆ మేరకు ఉభయుల లక్షాలు నెరవేరే పక్షంలో ఈ విరామమంతా తాత్కాలికమైనదయినా స్వాగతించవలసి ఉంటుంది. 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి జరపటంతో మొదలైన యుద్ధంలో ఇప్పటికి గాజాలో 46,700 మంది చనిపోయినట్లు అంచనా. ఆస్తుల విధ్వంసానికి లెక్కేలేదు. ఒకవేళ యుద్ధం శాశ్వతంగా నిలిచిపోయినా, అక్కడ పునర్ నిర్మాణానికి 40 బిలియన్ల అమెరికాన్ డాలర్లు, 16 సంవత్సరాల కాలం అవసరమన్నది ఐక్యరాజ్యసమితి నిరుడు మే నెలలో వేసిన అంచనా. తర్వాత ఏడు నెలలుగా ఈ మారణకాండ కొనసాగుతూనే ఉన్నందున అప్పటి అంచనాలు ఇంకా పెరిగిపోయి ఉంటాయి.

ఇది గాక, యుద్ధం వల్ల హమాస్ తీవ్రంగా నష్టపోయింది. మిలిటెంట్ల సంఖ్య బాగా తగ్గింది. తమకు పూర్తి మద్దతుదార్లు అయిన ఇరాన్, హెజ్బొల్లా, హూతీలు కూడా నష్టాలను ఎదుర్కొన్నాయి. అరబ్ దేశాలకు సంబంధించి ఈజిప్టు మహా నాయకుడు గమాల్ అబ్దుల్ నాసర్ మరణం తర్వాత ప్యాన్ అరబిజం అన్నది ముగిసిపోగా ఈ తర్వాతి తరం అరబ్ దేశాల నాయకులందరికీ స్వప్రయోజనాలు, అమెరికా, ఇజ్రాయెల్‌లతో మైత్రి ప్రధానమయ్యాయి. దానితో ప్రస్తుత యుద్ధంలో ఇజ్రాయెల్ ఎన్ని దారుణాలు సాగిస్తున్నా నోటిమాటలు తప్ప ఆచరణలో పాలస్తీనియన్లకు ఏ సహాయం చేయలేదు. చివరకు గాజా మారణకాండపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసింది దక్షిణాఫ్రికా, దానికి జత కలిసింది ఐర్లండ్, మరో ఎనిమిది దేశాలు కాగా, పశ్చిమాసియా నుంచి ఒక్క అరబ్ దేశం కూడా కలియకపోవటం పరిస్థితికి అద్దం పడుతుంది. ఇంతకన్న హీనం ఏమంటే, గాజా, వెస్ట్ బ్యాంక్‌కు కలిపి పాలస్తీనా దేశం కాగా, వెస్ట్ బ్యాంక్‌లో అమెరికా, ఇజ్రాయెల్ ఆశీర్వాదాలతో అధికారం నెరపుతున్న అధ్యక్షులు మహమూద్ అబ్బాస్ సైతం నోరు విప్పలేదు. సరికదా, హమాస్ అంతమైతే తాము గాజాలోనూ పాలించవచ్చునన్న కోరికతో ఉన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ పథకం కూడా అదే. ఆ మాటను అబ్బాస్ ప్రధాని మహమ్మద్ ముస్తఫా, గాజా యుద్ధ విరమణ ఒప్పందం జరిగిన ఈ 15న బయటకే అనటం గమనించదగ్గది.

మొత్తం మీద ఇటువంటి పరిస్థితుల మధ్య హమాస్‌కు ఒక విరామం అవసరమైనట్లే, నెతన్యా హూకు కూడా అవసరముంది. ఆయన గాజాపై ఎంత విధ్వంసమైనా సృష్టించవచ్చుగాక. కాని, అక్కడి ప్రజలకు సంబంధించి హమాస్ నుంచి బందీల విడుదల ఒక పెద్ద ఉద్వేగపూరితమైన అంశంగా మారింది. బందీలు కొన్ని వందల మంది కాగా, గాజా వంటి ఒక చిన్న ప్రాంతం నుంచి ఇంతటి సైనిక బలం, టెక్నాలజీ నైపుణ్యం ఉండి కూడా వారిని నెతన్యా హూ కనిపెట్టి బయటకు తేలేకపోయారు. బందీలలో కొందరు ఇప్పటికే మరణించారు కూడా. తక్కిన వారిని సజీవంగా విడిపించగల ఆశలు సన్నగిల్లుతున్నాయి. అన్నింటికన్న ఎక్కువగా ఈ అంశం ఆందోళనకరంగా మారి నిరసనలు కూడా సాగుతున్నాయి. ఇదిగాక, అమెరికా నుంచి ఆయుధాలు, నిధులు ఎంతగా అందుతున్నా ఇజ్రాయెల్ భారీగా నష్టపోతూ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్నది. ఇవన్నీ చాలవన్నట్లు, అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ నుంచి హమాస్‌తో పాటు నెతన్యాహూకు సైతం హెచ్చరికలు మొదలయ్యాయి. ఆయన లోగడ ఇచ్చిన ఒక ఇంటర్వూలో నెతన్యాహూను ‘లం… కొడుకు’ అని దూషించగా, ఆ వీడియోను ఇపుడు తానే తిరిగి విడుదల చేయటం ఇజ్రాయెల్ ప్రధానిని దిగ్భ్రాంతికి గురి చేసింది.

దానితో ఆయన ట్రంప్ ప్రయాణ స్వీకారానికి వెళ్లే ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కాని, వీడియో విడుదలతో నెతన్యాహూకు పరిస్థితి అర్థమైంది. గాజాలో యుద్ధ విరమణకు అంగీకరించని పక్షంలో తమకు అమెరికా సహాయం ఆగకున్నా తగ్గుతుందన్న భయం పని చేసింది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్నపుడు, హమాస్, ఇజ్రాయెల్ రెండింటికీ ప్రస్తుత యుద్ధ విరమణ విరామం ఎందుకు అవసరమో బోధపడుతుంది.

ఈ 42 రోజుల తాత్కాలిక విరమణ దీర్ఘకాలికమో లేక శాశ్వతమో కాగలదా? అంతటికీ మూలమైన స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు, పాలస్తీనా, ఇజ్రాయెల్ అనే రెండు స్వతంత్ర దేశాల పరిష్కారం వంటివి నెరవేరగలవా అన్న ప్రశ్నలున్నాయి. ప్రస్తుత ఒప్పందంలోని 8 క్లాజులు, 15 సబ్ క్లాజుల పాఠాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఈ తాత్కాలిక విరమణ అంశాలు సక్రమంగా ఉభయులకు సంతృప్తికరంగా, రెండు వైపుల నుంచి కూడా అమలైన పక్షంలో, విరమణ గడువు 42 రోజులనుంచి మరింత పొడిగింపు అయే అవకాశం ఉంది. అట్లా చర్చలు అమలు పొడిగింపులన్నవి ఎంతకాలమైనా సాగవచ్చు. ఇటువంటిది అనేక అంతర్జాతీయ ఒప్పందాలలో జరగటం మామూలే. అదే సమయంలో ఎవరు దానిని ఉల్లంఘించినా లేక ఉల్లంఘించకపోయినా ఆ పని చేసినట్లు ఆరోపిస్తూ తిరిగి ఎవరు యుద్ధానికి దిగినా, ఒప్పందాలు భంగ పడటం కూడా తెలిసిందే.

అందువల్ల, ఈ ఒప్పందంపై కూడా గ్యారంటీలు ఎవరూ ఇవ్వలేరు. ఇందులోని మొత్తం 8 అంశాలు కూడా దశల వారీగా ఇజ్రాయెలీ బందీలు, పాలస్తీనా ఖైదీల విడుదల, ఇజ్రాయెలీ సేనల ఉపసంహరణ, రాకపోకల కారిడార్లను తెరవటం, నిర్వాసితులు తిరిగి తమ ప్రదేశాలకు రావటం, మానవతా సహాయాలకు వీలు కల్పించటం, చర్చల కొనసాగింపు క్రమాలకు సంబంధించినది.
పైన చెప్పుకున్నట్లు, రెండు స్వతంత్ర దేశాల ఏర్పాటు అన్నదే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుంది. ఆ పని జరగనిదే హమాస్ విశ్రమించదు. కాని అందుకు ఇజ్రాయెల్ పూర్తి వ్యతిరేకం. ఆ మాట బాహాటంగా పదేపదే ప్రకటించటమే కాదు. గాజాను, వెస్టబ్యాంక్‌ను కూడా తమ అధీనంలోకి తెచ్చుకోగలమంటున్నారు. వెస్ట్‌బ్యాంక్‌లో ఇప్పటికే అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు విరుద్ధంగా సుమారు 70వేల మంది యూదులను స్థిరపరచారు. గాజాలోనూ అందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్వప్రయోజనాల కోసం పశ్చిమాసియాలో తన వ్యూహాలను అమలు పరుస్తూ అందుకు ఇజ్రాయెల్‌ను సాధనం చేసుకుంటున్న అమెరికా, రెండు దేశాల సూత్రాన్ని నోటితో సమర్థిస్తూ నొసటితో వెక్కిరిస్తూ వస్తున్నది. స్వయంగా తమ చొరవతో జరిగిన ఓస్లో ఒప్పందాలు భంగపడటానికి ఇజ్రాయెల్‌తో పాటు తానూ కారణంగా మారింది. ఇపుడు, తమ కీలుబొమ్మ అబ్బాస్ నాయకత్వాన, బాగా కుదిరించిన అధికారాలతో, ఇజ్రాయెల్ పర్యవేక్షణ కింద సోకాల్డ్ స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నది.

టంకశాల అశోక్

దూరదృష్టి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News