పాలస్తీనా విషయమై ఐక్యరాజ్యసమితి ఈ నెల 3వ తేదీన ఒక చిత్రమైన తీర్మానం చేసింది. దాని ప్రకారం పాలస్తీనా, ఇజ్రాయెల్ అనే రెండు స్వతంత్ర దేశాల ఏర్పాటు గురించి చర్చించేందుకు దేశాధినేతల సమావేశం ఒకటి వచ్చే జూన్ నెలలో జరుగుతుంది. అందుకు ఆతిథ్య దేశాలుగా సౌదీ అరేబియా, ఫ్రాన్స్ వ్యవహరిస్తాయి. ఈ తీర్మానం స్థూలం గా చూసేందుకు ఎంతో ఆహ్వానించ దగినదిగా తోస్తుంది. కాని కొంత విశ్లేషించినపుడుగాని అందులోని వంచన ఏమిటో బోధపడదు. పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడాలనే తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి చేయటం ఇది మొదటి సారి కాదన్నది ఒకటి.
దేశాధినేతల సమావేశం అవసరమని భావిస్తే ఆ కార్యక్రమాన్ని మరో ఆరు మాసాలకు గాని జరపకపోవటమన్నది రెండవది. దాని నిర్వహణా బాధ్యతను పాలస్తీనా పట్ల నిజాయితీ చూపని సౌదీ అరేబియా, ఫ్రాన్స్‌లకు అప్పగించటమన్నది మూడవది. ఈ మూడు కోణాల వివరాలను చూస్తూ పోయినపుడు అంతా తేటతెల్లమవుతుంది. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల సంఖ్య 193 కాగా, అందులో 146 పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించి దౌత్యసంబంధాలు కూడా ఏర్పాటు చేసుకున్నాయి. వాటిలో ఫ్రాన్స్ లేదు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇటీవల ఈ విషయమై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, తాము పాలస్తీనాను గుర్తించిగలమని, “కాని ఉపయోగకరమైన సమయంలో మాత్రమే” (ఓన్లీ ఎట్ ఏ యూజ్ ఫుల్ మొమెంట్). అన్నారు.
ఉపయోగకరం అంటే ఏమిటి, ఎవరికి ఉపయోగకరం, అది ఎటువంటి పరిస్థితులలో ఏర్పడుతుంది అనే వివరణ లేవీ ఆయన ఇవ్వలేదు. కనుక ఎవరి నిర్వచనాలు వారు చెప్పుకోవచ్చు. పోతే పాలస్తీనాలో తీవ్రమైన అణచివేత సాగిస్తున్న ఇజ్రాయెల్‌కు మొదటి నుంచి ఆయుధ సరఫరాలు చేసిన నాటో రాజ్యాలలో ఫ్రాన్స్ ఒకటి. ఆ సరఫరాలనైతే ఇటీవల ఆపివేసింది గాని, ఆయుధాల విడి భాగాలును నేటికీ రవాణా చేస్తూనే ఉంది. పాలస్తీనాను గుర్తించటపై మాక్రాన్ వైఖరిని, తన ఆయుధ వ్యాపార విధానాన్ని గమనించినపుడు, ఈ విషయమై ఫ్రాన్స్ నిజాయితీ గురించి ఏమనిపిస్తుంది? ఇటువంటి విషయాలపై చర్చకు ఆతిథ్యమిచ్చే దేశానికి బాధిత పక్షం పట్ల సానుభూతి, అనుకూలత ఉండాలి. లేదా కనీసం తటస్థత ఉండాలి. పై వివరాలను చూసినపుడు ఫ్రాన్స్ తటస్థమని అనగలమా? అటువంటపుడు, చర్చలలో ఎవరి ప్రయోజనాల కోసం వారు పని చేయవచ్చుననే ప్రశ్నపై ఎవరి అభిప్రాయాలకు వారు రావచ్చు.
సౌదీ అరేబియా విషయానికి వస్తే ఆ దేశం పాలస్తీనాను గుర్తించటం వరకు బాగున్నది. కాని తక్కిన వేవీ బాగా లేవు. అరబ్ ప్రపంచంలో ఈజిప్టుతోపాటు సౌదీ అరేబియా అగ్రదేశం. ఆర్థికంగా తనదే మొదటి స్థానం. కాని ఎప్పుడో 1967లో పాలస్తీనా కోసం ఇతర అరబ్ దేశాలతో కలిసి ఇజ్రాయెల్‌పై ఆరు రోజులపాటు జరిపిన యుద్ధం తర్వాత నుంచి సౌదీ నాయకత్వపు వైఖరి క్రమంగా మారుతూ వస్తున్నది. పాలస్తీనా పట్ల శ్రద్ధ తగ్గటం మొదలైంది. ముఖ్యంగా, అరబ్ ప్రపంచపు నాయకునిగా ఉండిన ఈజిప్టు అధ్యక్షుడు గమాల్ అబ్దుల్ నాజర్ మరణం తర్వాత పలు మార్పులు చోటుచేసుకున్నాయి. అరబ్ దేశాల నాయకత్వాలకు ప్యాన్ అరబిజం అనే అరబ్ సంఘీభావం తగ్గటం మొదలైంది. వారిలో పలువురు తమ ప్రయోజనాల కోసం అమెరికా వైపు, ఇజ్రాయెల్ వైపు చూడటం మొదటుపెట్టారు. పశ్చిమాసియాలో తన సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం, అక్కడి చమురు నిక్షేపాల కోసం, భౌగోళికంగా కీలకమైన ఆ ప్రాంతాంలో తన వ్యూహాల అమలు కోసం ఎల్లప్పుడూ ప్రయత్నించే అమెరికా, ఈ కొత్త పరిణామాలను అనువుగా చేసుకుంటూ అరబ్ దేశాలను చీల్చటం మొదలుపెట్టింది.
ఇందుకు గురైన వాటిలో లేదా స్వయంగా సిద్ధపడిన అరబ్ దేశాలలో సౌదీ అరేబియా ఒకటి.
వారికి ఇజ్రాయెల్‌తో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాలనే కోరిక బలంగా ఉంది. అందుకోసం అమెరికా ప్రోత్సహిస్తున్నది. కాని ప్రస్తుతం ఇజ్రాయెల్ గాజాపై సాగిస్తున్న మారణకాండ ఇబ్బందికర పరిస్థితిగా మారింది. ఇది ఎంత త్వరగా తొలిగిపోతే అంత త్వరగా ఇజ్రాయెల్‌తో సంబంధాలన్నది వారు వేచిచూస్తున్న విషయం. ఈ సంకట స్థితి వల్లనే వారు ప్రస్తుత మారణకాండపై ఇజ్రాయెల్‌ను స్పష్టమైన రీతిలో వ్యతిరేకించటం లేదు. పాలస్తీనా బాధితులకు మానవత్వ సహాయం పట్ల కూడా చూపగలిగినంత శ్రద్ధ చూపక అరకొరగా వ్యవహరిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతుగా నిలిచిన అమెరికా అక్కడకు ఆయుధాలు, నిధులు నిరంతరం సరఫరా చేస్తూ, ఐక్యరాజ్య సమితిలో వ్యతిరేకిస్తూ, భద్రతా మండలి తీర్మానాలను వీటో చేస్తున్నా తన నిరసనను గట్టిగా తెలపటం లేదు. తక్కిన అరబ్ దేశాలను కలుపుకొని ప్యాన్ అరబిజం స్ఫూర్తితో ఇజ్రాయెల్‌తో అన్ని సంబంధాలను సస్పెండ్ చేసుకోవచ్చు. కాని ఇంతింత దారుణాలు జరుగుతున్నా అటువంటి కదలికలేమీ కనిపించటం లేదు. ఇటువంటి సౌదీ అరేబియా చర్చలకు ఆతిథ్యం వహించటం ఎంత విశ్వసనీయంగా తోచేదీ చెప్పనక్కరలేదు.
పైగా ఈ చర్చలు మరొక ఆరు మాసాల తర్వాత వచ్చే జూన్‌లోనట. అప్పటికి పాలస్తీనాలో ఇంకా ఏమేమి జరిగేది ఎవరైనా ఊహించగలరా? ఇప్పటకే గాజాలో 40,000కు పైగా మృతి చెందారు. వారిలో అధికుల స్త్రీలు, పిల్లలు. కొన్ని లక్షల మంది నిర్వాసితులయారు. సహాయచర్యలకు ఇజ్రాయెల్ కలిగిస్తున్న ఆటంకాల వల్ల ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు ప్రజలకు సరిగా చేరటం లేదు. నిర్మాణాలు, మౌలిక వసతులు సగానికి పైగా ధ్వంసమయాయి. మరొకవైపు వెస్ట్ బ్యాంక్‌లో యూదుల అక్రమ సెటిల్‌మెంట్లు ఇప్పటకే 70,000కు చేరి ఇంకా పెరుగుతున్నాయి. అక్కడి పాలస్తీనియన్లపై ఇజ్రాయెలీ సైనికులు, సెటిలర్ల అణచివేత, భూభాగాల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. దీనంతటికీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ పూర్తి మద్దతు ఉండగా, కొత్త అధ్యక్షుడు ట్రంప్ విధానం కూడా ఇదే. ఇటువంటి పరిస్థితుల మధ్య జూన్ చర్చలనేవి నిజంగా జరిగినా, అప్పటికి పాలస్తీనా, వెస్ట్ బ్యాంక్‌ల పరిస్థితి ఏవిధంగా ఉండవచ్చునన్నది ఊహించటం కూడా కష్టమే.
దానినట్లుంచి, ఆ చర్చలలో కొత్తగా చెప్పేదేమిటి? రెండు స్వతంత్ర దేశాలనే తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి 2002లోనే మరొక మారు చేసింది. అమెరికా చొరవతో ఓస్లో ఒప్పందాలనేవి అంతకన్న ముందే (1993, 1995) జరిగాయి. ఇన్నేళ్లు గడిచినాక ఈ రెండు చిత్తశుద్ధి లేని దేశాల ఆతిథ్యం ద్వారా జూన్ చర్చలలో ఏదైనా తేలవచ్చునా? అప్పటికి పాలస్తీనాలో మిగిలే మనుషులెందరు? ఇజ్రాయెల్ మారణకాండకు వీలైనంత సమయం ఇవ్వటం కోసమేనా సమితి ఇటువంటి తీర్మానం చేసి ఇంత సమయం ఇస్తున్నది. నిర్మొహమాటంగా చెప్పాలంటే ఈ తీర్మానమే వృథా. పాలస్తీనీ పట్ల వంచన. నిజంగా ఏమైనా చేయదలిస్తే ఆ తీర్మానాలు చాలవా? అయినా, రెండు దేశాల విషయమై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ బాహాటంగా ప్రకటిస్తున్నదేమిటి? తాము రెండు దేశాల సూత్రాన్ని అంగీకరించబోము. వెస్ట్ బ్యాంక్ అనేది విడిగా ఏమీ లేదు గనుక ఆ ప్రాంతం ఇజ్రాయెల్‌లో భాగమే. గాజాకు పూర్తి స్వాతంత్య్రం ఉండదు. అక్కడ హమాస్‌ను అంతం చేసిన తర్వాత కొత్త పరిపాలనా వ్యవస్థ తమ పర్యవేక్షణలోనే ఉంటుంది. భద్రతాపరమైన సైనిక నియంత్రణ కూడా తమదే. నెతన్యాహూ వైఖరి ఇంత స్పష్టంగా కనిపిస్తూ, ఆరుమాసాల గడిచినాక పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియనపుడు, ఈ తీర్మానానికి, చర్చలకు అర్థం ఏమైనా ఉంటుందా?
టంకశాల అశోక్
దూరదృష్టి