అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 4వ తేదీన చేసిన ఒక ప్రకటన ప్రపంచం అంతటా పెద్ద సంచలనం రేపుతున్నది. అదేమిటో ముందుగా చూసి తర్వాత వివరాలలోకి వెళదాము. ఆయన ఆ రోజున మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నది ఈ విధంగా ఉంది. గాజా నుంచి పాలస్తీనా ప్రజలను పూర్తిగా ఇతర దేశాలకు తరలిస్తారు. వారిని వీలైతే ఒకే ప్రాంతంలో, వీలుకానట్లయితే వేర్వేరు ప్రాంతాలకు. ఆ తరలింపు శాశ్వత ప్రాతిపదికపై జరుగుతుంది. అందుకోసం అవసరమైతే అమెరికన్ సేనలను నియోగిస్తారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధ కారణంగా ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లి, కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇప్పుడిప్పుడే తిరిగి వస్తున్న గాజా ప్రజలను ఇక రానివ్వరు.
ఆ ప్రాంతాన్ని అమెరికా శాశ్వత లేదా దీర్ఘకాలిక ప్రాతిపదికపై స్వాధీనం చేసుకుంటుంది. అక్కడ ప్రస్తుతం గల శిథిలాలను, మందు పాతరలను, ఆయుధాలను తొలగిస్తుంది. తర్వాత గాజాను ఒక మంచి బీచ్ రిసార్టుగా తయారు చేస్తుంది. అక్కడ మంచి వినోద విహారాలతోపాటు చాలా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. పాలస్తీనియన్లు కోరుకున్న పక్షంలో ఇతరులతోపాటు వారు కూడా కొందరుండి పనులు చేసుకోవచ్చు. ఆ విధంగా అందరికీ అది ఒక టూరిజం మక్కా వంటిదవుతుంది. ఉద్యోగాల మక్కాగా మారుతుంది.
ఇదంతా ఎవరికైనా నమ్మశక్యంగా తోచకపోతే మరొకసారి చదవండి. ప్రతి మాట ట్రంప్ అన్నదే. అంతా రికార్డు అయిందే. దీనికిదే ఒక విశేషం కాగా, ట్రంప్ ఈ ప్రకటనలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తన సరసన కూర్చుని ఉండగా మరీ చేసారు. ఆయన ట్రంప్ చెప్తున్నది వింటూ చిరునవ్వులు చిందించినట్లు మీడియా రిపోర్టు చేసింది. ట్రంప్ తర్వాత నెతన్యాహూ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుని పథకం “చరిత్ర గతినే మార్చివేయగల” దన్నారు. ఆ దిశలో ప్రయత్నాలు జరగాలన్నారు. ట్రంప్ జనవరి 20న బాధ్యత స్వీకరించిన తర్వాత అమెరికాకు వెళ్లి తనను కలిసిన మొదటి విదేశ నాయకుడు నెతన్యాహూ. మీడియా సమావేశానికి ముందేవారి మధ్య గాజా భవిష్యత్తుపై చర్చలు జరిగి ఇటువంటి ఏకాభిప్రాయానికి వచ్చి ఉంటారనుకుంటే పొరపాటు ఉండకపోవచ్చు. ఇందుకు సంబంధించి రంగాన్ని సిద్ధం చేసేందుకు కావచ్చు నెతన్యాహూ తన తిరిగి రాకను వాయిదా వేసుకున్నారు.
గాజా పట్ల, పాలస్తీనా విషయమై ట్రంప్ వైఖరి క్రమంగా మారుతూ రావటం గురించి కొంత చెప్పుకోవాలి. రిపబ్లికన్లు, డెమోక్రాట్లలో ఎవరు పాలించినా అమెరికా విధానం పాలస్తీనా, ఇజ్రాయెల్ అనే రెండు స్వతంత్ర దేశాల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటూ వచ్చింది. ఈ విషయమై మాట్లాడటం తప్ప అమెరికా ఎప్పుడూ చిత్తశుద్ధి చూపకపోవటం నిజమే అయినప్పటికీ కనీసం ఒక విధానంగా ఆ మాట చెప్తూ వస్తున్నది. గాజా, ఇజ్రాయెల్ మధ్య ఇటీవలి కాల్పుల విరమణ ఒప్పందం అమెరికా జోక్యంతోనే జరిగి, గాజా పౌరులు అక్కడకు తిరిగి వెళ్లటం మొదలైంది. బందీల విడుదల సాగుతున్నది. ఒప్పందం జరిగినపుడు రిపబ్లికన్లు అధికారంలో లేకపోయినా, బైడెన్ తీసుకున్న చొరవను ట్రంప్ కూడా బలపరచారు. ఒప్పందంలో మొదటి దశ అమలు సజావుగా జరిగిపోయి, ఇక రెండవ దశ గురించి చర్చలు జరగనుండగా అందుకోసం పాలస్తీనియన్లతోపాటు ప్రపంచమంతా ఎదురుచూస్తున్నది. సరిగా ఆ స్థితిలో ట్రంప్ ఈ విపరీతమైన ప్రకటన చేసారు.
అయితే కొని విషయాలు చెప్పుకోవాలి. ఒక విపత్తు సంభవించటానికి ముందు ఒకోసారి కొన్ని ముందస్తు సూచనలు కనిపిస్తాయంటారు. అవి ఒకోసారి నిజంకావచ్చు లేదా కాకపోవచ్చు. అదే పద్ధతిలో గాజా విషయమై ట్రంప్ నుంచి అనుమానించదగిన సూచనలు కొన్ని కనిపిస్తూ వచ్చాయి. యుద్ధం వల్ల గాజా అంతటా శిధిలాలు, ఆయుధాలు నిండిపోయాయని, వాటిని తొలగించి, అవసరమైన నిర్మాణాలు చేపట్టి, తిరిగి నివాసయోగ్యం చేసేందుకు అక్కడి ప్రజలు “తాత్కాలికంగా” ఈజిప్టు, జోర్డాన్ వంటి దేశాలకు తరలివెళ్లటం అవసరం కావచ్చునని మొదట అన్నారు. పునర్నిర్మాణానికి ఎన్ని నిధులు, ఎంత కాలం కావచ్చునో అంచనాలు సంపాదించారు. అందుకోసం తాము సహాయం చేయగలమని, అరబ్ దేశాలు కూడా చేయాలని అన్నారు. ఆ మాట నెతన్యాహూ తోనూ అన్నారో లేదో తెలియదు గాని, ఆయన విడిగా మాట్లాడుతూ తమకు అందులో ఆసక్తి లేదన్నారు.
ఆ తర్వాత నుంచి ట్రంప్ వైఖరి క్రమంగా మారటం మొదలైంది. గాజా ప్రజలు స్వల్ప కాలానికి గాక దీర్ఘ కాలానికి వెళ్లటం అని, ఇపుడు 4వ తేదీన శాశ్వతంగా అని వాదించారు. గాజా శరణార్థులు ఇప్పటికే లక్షలాది మంది ఈజిప్టు, జోర్డాన్‌లలో ఉండగా, వారు మరింత మందిని తీసుకోవాలన్నారు. అందుకు వారు నిరాకరించగా, తీసుకు తీరవలసిందేనని, తీసుకోగలరన్న నమ్మకం తమకుందని, అందుకు ఒప్పించగలనని ఇపుడు మాట్లాడుతున్నారు. గాజా పునర్నిర్మాణానికి అరబ్ రాజ్యాలు నిధులివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర దేశాలలో గాజా ప్రజలు స్థిరపడేందుకు కూడా ఈ దేశాలు నిధులివ్వాలంటున్నారు. మరొక వైపు, ఇజ్రాయెల్ హత్యాకాండకు నిరసనగా అమెరికాలో ప్రదర్శనలు చేసిన విద్యార్థులను, ఇతరులను స్వదేశాలకు పంపివేయటం మొదలు పెట్టారు. ఈ చర్య వాక్ స్వాతంత్య్ర చట్టాలకు విరుద్ధమనే విమర్శలను లెక్కచేయటం లేదు. గాజాపై ప్రయోగానికి రెండు వేల పౌండ్ల భారీ ఉక్కు గోళాల సరఫరాను బైడెన్ చివరి దశలో నిలిపివేయగా, ఆ చర్యను ట్రంప్ చేసారు. మరొక బిలియన్ డాలర్ల ఆయుధాల అమ్మకానికి ఉత్తర్వు చేసారు. గాజాలో చెక్ పోస్టుల నిర్వహణకు అమెరికన్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించారు. ఇవన్నీ ఇంతగా పేర్కొనటం ఎందుకంటే, పూర్తిగా ఇజ్రాయెల్ అనుకూలుడు, పాలస్తీనా వ్యతిరేకి అనే పేరు గతం నుంచీ ఉండి, ప్రస్తుత యుద్ధకాలమంతా అదే వైఖరి చూసిన ఆయన, ఆ సమస్యను పరిష్కరించ గలనంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో కొంత నటించారు. రెండు దేశాల సూత్రమంటూ కూడా మాట్లాడారు.
అటువంటిది, బాధ్యతలు స్వీకరించిన సరిగా రెండు వారాలకు అంతా తలకిందులు చేసారు. ఆయన చెప్పినవన్నీ స్వయంగా అమెరికా విధానాలతో పాటు, ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు, జెనీవా కన్వెన్షన్ (ఏ పౌరులను కూడా బలవంతంగా మరొక చోటికి తరలించరాదన్నది) తో సహా అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైనవి. ట్రంప్ ప్రకటన తర్వాత అమెరికన్ పత్రికలలో వెలువడుతున్న కథనాలను బట్టి చూడగా, స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ఆయన, మరికొందరు వ్యాపారులతో కలిసి ఈ పథకం వేసినట్టు అర్థమవుతున్నది. పాలస్తీనాలో రెండవ భాగమైన వెస్ట్ బ్యాంక్ పరిస్థితిని కూడా ఇక్కడ చూడాలి. రెండు భాగాలనూ ఆక్రమించుకుని ఇజ్రాయెల్‌లో విలీనం చేయాలన్నది నెతన్యాహూతో పాటు ఇజ్రాయెల్‌లోని తీవ్ర జాతీయవాద జియోనిస్టు పార్టీల ఆలోచన. ఆ ప్రకారం ప్రస్తుత యుద్ధాన్ని అనువుగా చేసుకుంటూ గాజాలో వీలైనంత మందిని హతమార్చి తక్కిన వారిని అక్కడి నుంచి తరిమివేయగలమంటూ ఈ వర్గాలు గతం నుంచే చెప్తున్నాయి. ఇక వెస్ట్ బ్యాంక్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదని, అది ఇజ్రాయెల్‌లో అంతర్భాగమని కూడా వాదిస్తున్నారు.
ఇందుకు ట్రంప్ మద్దతు తన మొదటిపాలనా కాలం నుంచి ఉంది. అందుకే, ఇజ్రాయెల్ తన రాజధానిని టెల్‌అవీల్ నుంచి వెస్ట్ బ్యాంక్‌లోని జెరూసలేంకు మార్చగా, ఐక్యరాజ్య సమితితో సహా తక్కిన ప్రపంచమంతా తిరస్కరించినా ట్రంప్ ప్రభుత్వం అపుడు గుర్తించింది. ఇపుడు తాజాగా ట్రంప్ తన సమితి రాయబారిగా నియమించిన ఎలీజ్ స్టెఫానిక్, ఇజ్రాయెల్‌కు వెస్ట్‌బ్యాంక్‌పై బైబిల్ కాలం నుంచి హక్కులున్నాయంటూ వాదించింది. ఈ 4వ తేదీ నాటి మీడియా సమావేశంలో వెస్ట్‌బ్యాంక్ గురించి ప్రస్తావించక పోవటానికి అర్ధం ఏమై ఉంటుంది? గాజాను అమెరికా, వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించటమే వారి ఉమ్మడి వ్యూహమని భావించకుండా ఉండగలమా? పైగా, వెస్ట్ బ్యాంక్‌లో అంతర్జాతీయ చట్టాలకు, సమితి తీర్మానాలకు విరుద్ధంగా ఇప్పటికే 70,000 మందికి పైగా యూదు సెటిలర్లును స్థిరపరచారు. వారి కాలనీలు ఇంకా విస్తరిస్తున్నాయి. అక్కడి సెటిలర్లు ఇజ్రాయెలీ సేనల మద్దతుతో సాగించని అత్యాచారాలు లేవు. పాలస్తీనియన్లకు ఎవరి నుంచి ఏ రక్షణా లేదు.
పాలస్తీనియన్లతో నామమాత్రంగా నడిచే పాలస్తీనా అధారిటీ ప్రభుత్వం (అరాఫాత్ స్థాపించిన పిఎల్‌ఒ పార్టీ ప్రభుత్వపు అవశేషం), అమెరికా, ఇజ్రాయెల్‌ల కీలుబొమ్మగా మారింది. పూర్తి అసమర్థత, అవినీతితో కనీసం గాజా మారణకాండను ఖండించలేని దుస్థితిలో మిగిలి ఉంది. అయినప్పటికీ, గాజాలో హమాస్ అంతమైతే అక్కడ కూడా పాలించాలనే ఉత్సాహం చూపుతున్నది. ఆ మేరకు అమెరికా, యూరప్‌తో పాటు, హమాస్ మిలిటెన్సీ అంటే సరిపడని అరబ్ దేశాల మద్దతు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. ఈ పరిస్థితుల మధ్య ఇపుడు ఉన్నట్లుండి ట్రంప్ తన కొత్త పథకాన్ని ముందుకు తెచ్చారు. అది చతురోపాయాల ద్వారా అమలుకు వచ్చిన పక్షంలో అందుకు పర్యవసానంగా ఇక గాజా, వెస్ట్ బ్యాంక్‌లతో సహా అసలు పాలస్తీనా అనేదీ ఉండదు. ఇటువంటి ప్రతిపాదనను ఇంత బాహాటంగా అమెరికన్ అధ్యక్షులెవరూ చేయలేదు. ట్రంప్ వ్యూహంలో ఒక భాగం, మధ్యధరా సముద్ర తీరాన గల గాజాలో తమ సైనిక, వైమానిక స్థావరాలను ఏర్పాటు చేయటం కూడానని అర్థమవుతూనే ఉన్నది.
ఆయన ఆలోచనను హమాస్, పాలస్తీనా అథారిటీ, హెజ్బొల్లాతోపాటు అరబ్ దేశాలు, రష్యా, చైనాలే గాక జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, టర్కీ వంటి నాటో దేశాలు కూడా వెంటనే తిరస్కరించాయి. అమెరికన్ సెనేటరలో డెమోక్రాట్లతో పాటు కొందరు రిపబ్లికన్లు సైతం ఖండించటం విశేషం. ఐక్యరాజ్య సమితి ఇది ఎంతమాత్రం తగని ఆలోచన అన్నది. పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఏర్పడనంత వరకు తాము ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు నెలకొల్పు కొనబోమని సౌదీ అరేబియా మరొక మారు స్పష్టం చేసింది. అయినా అరబ్ దేశాలకు తాను నచ్చజెప్పగలనంటూ ఒక విలేఖరికి సమాధానమిచ్చారు ట్రంప్. వివిధ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నపుడు, ఆయన ఆలోచనలు నెరవేరే అవకాశం కనిపించటం లేదు. అయినప్పటికీ అటువంటి పథకం వేయటమన్నదే ఎంత దుర్మార్గమైనదో చెప్పనక్కరలేదు. తమ దేశం కోసం 76 సంవత్సరాలుగా రక్త తర్పణలు చేస్తున్న పాలస్తీనీయన్లు ఇందుకు ఎట్టి పరిస్థితులలోను అంగీకరించరు.
టంకశాల అశోక్
దూరదృష్టికి