డీర్‌అల్ బలా(గాజా): ఉత్తర గాజాను ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయెల్ ఆదేశించడంతో ఈ ప్రాంతంలోని పాలస్తీనియన్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 24 గంటల్లోగా ఉత్తర గాజా ప్రాంతాన్ని కాళీ చేసి దక్షిణ ప్రాంతానికి వెళ్లిపోవలసిందిగా శుక్రవారం హెచ్చరించిన ఇజ్రాయెల్ శనివారం మరోసారి సోషల్ మీడియా, కరపత్రాల ద్వారా పిలుపునిచ్చింది. అయితే హమాస్ మాత్రం ఇళ్లలోనే ఉండిపోవాలని, ఎక్కడికీ వెళ్లవద్దని వారిని కోరుతుండడంతో దిక్కుతోచని స్థితిలో స్థానికులు ఉన్నారు. మరో వైపు ఇజ్రాయెల్ పూర్తిస్థాయి గ్రౌండ్ ఆపరేషన్‌కు ముందు శుక్రవారం రాత్రి పరిమిత స్థాయిలో ఉత్తర గాజా ప్రాంతంపై దాడులు చేసింది. దీంతో ఏ క్షణంలోనైనా పూర్తిస్థాయి దాడులు మొదలు కావచ్చన్న భయంతో వేలాది పాలస్తీనియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కార్లు, ట్రక్కులు, గాడిద బండ్లు ..ఇలా ఏ వాహనం దొరికితే ఆ వాహనంపై గాజా సిటీని వీడి వెళుతున్నారు. మరి కొందరు పిల్లా పాపలతో కాలినడకనే నగరం వీడి వెళుతున్నారు.
అయితే ఒక్కసారిగా పది లక్షల మంది ఇప్పటికే కిక్కిరిసి ఉన్న దక్షిణ గాజా ప్రాంతానికి తరలివెళ్లడం వల్ల మానవతా సంక్షోభం తలెత్తుతుందని ఐక్యరాజ్య సమితి అంటోంది. లక్షలాది మందిని బలవంతంగా తరలించడం మానవ విపత్తు అవుతుందని పేర్కొంది.జనాన్ని ఖాళీ చేయించే ఆలోచన మానుకోవాలని ఐరాస ప్రతినిధి స్టెఫానీ డుజారిక్ ఇజ్రాయెల్‌కు సూచించారు. అయితే వైమానిక దాడుల కారణంగా తరలి వెళ్తున్న పాలస్తీనియన్లు క్షేమంగా తరలి వెళ్లడం కోసం శనివారం ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు సేఫ్ పాసేజిలను ఏర్పాటు చేశామని, ఆ సమయంలో ఎలాంటి భయం లేకుండా ఈ రెండు మార్గాల్లో వారు వెళ్లవచ్చని ఇజ్రాయెల్ తెలిపింది. మరో వైపు రఫా సరిహద్దుగుండా విదేశీయులు తమ దేశంలోకి ప్రవేశించేందుకు ఈజిప్టు అనుమతించింది. ఈ మేరకు ఇజ్రాయెల్, అమెరికా, ఈజిప్టు మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
గాజా అతలాకుతలం
గాజాలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఎటు చూసినా శిధిలమైన భవనాలు, వాటికింద చిక్కుకున్న మృతదేహాలే కనిపిస్తున్నాయి.కరెంటు, తాగునీరు,నిత్యావసరాల కొరతతో పాలస్తీనియన్ల్లు అల్లాడి పోతున్నారు. డీర్‌అల్ బలాలో శరణార్థి శిబిరంగా మారిన ఐరాస పాఠశాల భవనంలో దాదాపు లక్షమంది శరణార్థులు తలదాచుకుని ఉన్నారు. ఆకలి తీర్చుకోవడం, ప్రాణాలు కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా మారింది. చాలా మంది భవనం బయట ఎముకలు కొరికే చలిలోనే కటిక నేలమీద నిద్రపోతూ కనిపించారు. మృత్యువు ఎటునుంచి దాడి చేస్తుందో, రాకెట్లు, డ్రోన్లు ఎప్పుడు వచ్చిపడుతాయో, ఎవరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయోనన్న భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.
హమాస్ వైమానిక దళ చీఫ్ హతం!
మరోవైపు గత ఏడు రోజలుగా గాజాపై రాకెట్ దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ తాజాగా గ్రౌండ్ ఆపరేషన్ దాడులను మొదలుపెట్టింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మాట్లాడుతూ తమ దేశం ఇప్పుడే ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టిందన్నారు. ఇజ్రాయెల్ సేనలు సింహాల్లా పోరాడుతున్నాయని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అన్నారు. కాగా శుక్రవారం రాత్రి తాము జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ వైమానిక దళానికి విభాగానికి అధిపతిగా పని చేసిన అలీ ఖాది మురాద్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ శనివారం ప్రకటించింది. శుక్రవారం రాత్రంతా హమాస్ కమాండో దళాలకు చెందిన పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ పదుల సంఖ్యలో వైమానిక దాడులు జరిపినట్లు ఐడిఎఫ్ వర్గాలనుటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పత్రిక తెలిపింది. ఈ క్రమంలోనే హమాస్ ఏరియల్ ఆపరేషన్స్ నిర్వహించే హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో దాడి చేసింది. ఈ ఘటనలో హమాస్ ఏరియల్ ఫోర్స్ హెడ్ అలీ ఖాది మృతి చెందినట్లు ఎడిఎఫ్ తెలిపిందని ఆ పత్రిక పేర్కొంది.
గతవారం(అక్టోబర్ 7న)కొందరు హమాస్ మిలిటెంట్ల్లు వాయుమార్గంలో ఇజ్రాయెల్‌లోకి చొరబడిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్‌ను అలీ ఖాది దగ్గరుండి పర్యవేక్షించినట్లు సమాచారం.అయితే అతడి మృతిని హమాస్ ఇంకా ధ్రువీకరించలేదు. కాగా గత వారం రోజలుగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో గాజా ప్రాంతంలో 1300కు పైగా భవనాలు నేలమట్టమయ్యాయని ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థ (ఒసిహెచ్‌ఎ) తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా ఇప్పటివరకు 2,200 మంది పాలస్తీనియన్లు మరణించారని, వీరిలో 724 మంది పిల్లలు, 458 మంది మహిళలు ఉన్నారని హమాస్ నియంత్రణ లోని ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే హమాస్ దాడుల్లో 1300 మందికి పైగా ఇజ్రాయెలీలు మృతి చెందగా, వీరిలో ఎక్కువ మంది పౌరులు ఉన్నట్లు ఇజ్రాయెల ప్రభుత్వం తెలిపింది. తమ సైన్యం దాడుల్లో దాదాపు 1500 మంది హమాస్ మిలిటెంట్లు హతమైనట్లు కూడా పేర్కొంది.
తగిన సమయంలో హమాస్‌తో చేతులు కలుపుతాం: హిజ్బుల్లా
మరోవైపు ఇజ్రాయెల్‌తో జరుగుతున్న పోరులో హమాస్‌తో చేతులు కలపడానికి తాము సిద్ధంగా ఉన్నామని , అందుకు సరయిన సమయం కోసం ఎదురు చూస్తున్నామని లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా ప్రకటించింది.‘జరుగుతున్న పోరులో భాగమయ్యేందుకు హిజ్బుల్లా సిద్ధంగా ఉంది.సరైన సమయం వచ్చినప్పుడు మేము రంగంలోకి దిగుతాం. ఇజ్రాయెల్ వ్యతిరేకపోరులో హమాస్‌తో చేతులు కలుపుతాం. మా ప్రణాళిక ప్రకారమే మేము ముందుకు వెళతాం’ అని హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ ఖాసిం బీరూట్‌లో జరిగిన ఓ ర్యాలీలో ప్రకటించారు.
తప్పుడు వార్తల బెడద
కాగా ఇజ్రాయెల్‌హమాస్ పోరుకు సంబంధించి తప్పుడు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతుండడంతో ఏది నిజమైందో, ఏది కాదో తెలుసుకోవడం జర్నలిస్టులకు సైతం కష్టంగా మారింది. సోషల్ మీడియా ప్రాధాన్యత పెరిగిపోయిన సమాజంలో తప్పుడు వీడియోలు, వార్తలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో వెల్లువెత్తడం సర్వ సాధారణంగా మారింది.. అయితే వీటిలో చాలావరకు తప్పుడు వార్తలేనని బిబిసిలాంటి ప్రముఖ మీడియా సంస్థల పరిశీలనల్లో వెల్లడవుతూ ఉంండంతో వార్తలను చెక్ చేసుకోవలసిన అవసరం ఎంతయినా ఉందని నిపుణులు అంటున్నారు. రష్యాఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా ఇలాంటి సమస్యే తలెత్తిందని వారంటున్నారు.