Thursday, November 21, 2024

ఈటలా.. నీ కమ్యూనిజం యాడ పోయింది

- Advertisement -
- Advertisement -

కాషాయనేతల కాళ్లముందు బహుజన వాదం తాకట్టు
నీ సమాధి నువ్వే కట్టుకున్నావ్, సిఎం కెసిఆర్ ఆయనకు కీలక పదవులు
కట్టబెట్టారు, ఏనాడైనా పదవి లేకుండా టిఆర్‌ఎస్‌లో రాజేందర్ ఉన్నారా
ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్: తనది బహుజన వాదం అని చెప్పుకునే ఈటల రా జేందర్, తన వాదాన్ని బిజెపి నాయకుల కాళ్ల ముందు తాకట్టు పెట్టారని రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బహుజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వారితో పాటే కలిసి ఉండేవాడివి కదా..? అంటూ ఈటలను ప్రశ్నించారు.బహజనులంతా ఇవాళ ఈటలను ఛీకొడుతున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఛీఫ్ విప్ బోడకుంట వెంకటేశ్వర్లుతో కలిసి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా ఈటల ఆయన సమాధి ఆయనే కట్టుకుంటున్నారని పేర్కొన్నారు. 20 ఏళ్లుగా కెసిఆర్ ఎందరో నాయకులను తయారు చేశారని చెప్పారు. ఇప్పుడు ఈటల రాజేందర్ కమ్యూనిజం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. బిజెపి నాయకుల దగ్గర తాకట్టు పెట్టారా..? అని పల్లా వ్యాఖ్యానించారు. మంత్రిగా ఉండి చట్టపరమైన పనులు చేయాల్సిన ఆయన.. చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములను, దేవాదాయ భూములను కొన్నారని చెప్పారు. ఈటల మాటలకు.. చేతలకు పొంతన లేదని ఎద్దేవా చేశారు. ఈటలను సిఎం కెసిఆర్ సొంత తమ్ముడిలా చూసుకున్నారని, ఆయనకు కీలక పదవులను కట్టబెట్టారని తెలిపారు. ఏనాడైనా పదవి లేకుండా ఈటల ఉన్నారా..? అని ప్రశ్నించారు. పార్టీ నాయకత్వం, నేతలను కించపర్చే విధంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
ఈటలపై పల్లా ప్రశ్నల వర్షం
అసైన్డ్ భూములు ఎలా తీసుకున్నావని ఈటలను పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ఎక్కువ పదవులు మీరే అనుభవించారు… పదవి లేకుండా ఎప్పుడు ఉన్నావు..? అని అడిగారు. మీ ఆత్మగౌరవం ఎక్కడ ఉంది..? మిమ్మల్ని గౌరవించినట్లు సిఎం కెసిఆర్ ఇంకెవరినీ గౌరవించలేదని అన్నారు. సొంత ప్రభుత్వ పథకాలను అవహేళన చేశావు, పార్టీ మీద, నాయకుడి మీద నమ్మకం లేదని క్షమించరాని నేరం చేశావని మండిపడ్డారు. మీరు చేసిన దానికి పార్టీపరంగా తప్పక చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమయం చూసి అధినేత కెసిఆర్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. నీ సమాధి నువ్వే కట్టుకున్నావు ఈటల రాజేందర్ అని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
విపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
ఏడేళ్ల పాలనపై విపక్ష నేతలు అవగాహన లేమితో మాట్లాడుతున్నారని, ఏడేళ్లుగా దేశంలో ఎక్కడా లేని విదంగా తెలంగాణలో సంక్షేమం జరుగుతోందని అన్నారు. ప్రతి ఎన్నికల్లో తాము చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడిగి అద్భుతమైన విజయం సాధిస్తున్నామని చెప్పారు. రైతులకు సాగు నీరు,కరెంటు ఇవ్వడంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉన్నామని, రైతులు పండించిన పంటను కొంటున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు గుడ్డు మీద ఈకలు పికుతున్నారని విమర్శించారు. రైతులు బిజెపి, కాంగ్రెస్ నాయకులను తిడుతున్నారని అన్నారు.నీళ్లపై సిగ్గు లేకుండా మాట్లాడ్తున్నారని మండిపడ్డారు. బిజెపికి పాలన చేతగాకా దేశ జిడిపి పడిపోయిందని, ఇది సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. నియమాకాలపై అబద్దాలు మాట్లాడితే గ్రాడ్యుయేట్లు బిజెపి నాయకులకు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. అబద్దాలు మాట్లాడటానికి బండి సంజయ్‌కి సిగ్గు అనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తమ ముఖ్యమంత్రి కెసిఆర్ వెనక్కి పోలేదని, చెప్పింది చేశారని స్పష్టం చేశారు.

 Palla Rajeshwar fire on Etela Rajender

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News