హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ తమిళిసైతో ముప్ఫై మోసాలు అరవై అబద్ధాలు చెప్పించారని, అరచేతిలో కాంగ్రెస్ ప్రభుత్వం వైకుంఠం చూపించిందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా పల్లా మాట్లాడారు. ప్రగతి భవన్ గతంలో కూడా ప్రజా భవన్ అని, కానీ ప్రజా భవన్‌కు వచ్చేవారి ఫిర్యాదులు తీసుకునేందుకు ఎవరూ లేరని విమర్శలు గుప్పించారు. రెండు నెలల్లో ఎవరి సమస్యలనైనా పరిష్కరించారా? అని ఎద్దేవా చేశారు. చట్టసభల్లో అబద్ధాలు చెప్పడం తీవ్రమైన నేరమని, ఆరోగ్య శ్రీ ద్వారా ఎవరికైనా రూ.10 లక్షలు ఇస్తున్నారా? అని అడిగారు.
13 హామీలిచ్చి రెండు పూర్తి చేశారని, ప్రచారం చేయడం తగదని చురకలంటించారు. బస్సులు సరిపడా లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, మహాలక్ష్మి పథకం ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టం చేయాలని పల్లా డిమాండ్ చేశారు. నిర్దిష్ట గడువు చెప్పి గ్యారంటీలు అమలు చేయాలని అడుగుతున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన తేదీ ముగిసిపోయినా హామీలు ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో తెలంగాణలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని, వరికి ఇస్తామన్న రూ.500 బోనస్ యాసంగిలోనైనా ఇస్తారా? లేదా? అని ప్రశ్నించారు. కెసిఆర్ ప్రభుత్వంలో వ్యవసాయాన్ని నంబర్ వన్ స్థానంలో ఉంచామని పల్లా స్పష్టం చేశారు.