Friday, November 22, 2024

ఎపి ముఖ్యమంత్రి జగన్ చర్యలను అడ్డుకుంటాం

- Advertisement -
- Advertisement -

Palla Rajeshwar Reddy Fires on AP Government

నీటిని ఎపి దొంగిలిస్తే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు
నీటి వాటాలపై టిఆర్‌ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రికి పూర్తి పరిజ్ఞానం ఉంది
టిఆర్‌ఎస్ సభ్యత్వాల సంఖ్య 61 లక్షలకు చేరుకుంది
ఈనెల 20 నాటికి సభ్యత్వ నమోదు పూర్తి
ఎమ్మెల్సీ, టిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్: ఎపి ముఖ్యమంత్రి జగన్ చర్యలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఎమ్మెల్సీ, టిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కెటిఆర్ అధ్యక్షతన జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పల్లా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ టిఆర్‌ఎస్ సభ్యత్వాల సంఖ్య 61 లక్షలకు చేరుకుందని, ఇప్పటి వరకు 48 లక్షల వరకు డిజిటలైజేషన్ పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈనెల 20 నాటికి సభ్యత్వ నమోదు పూర్తవుతుందని ఆయన తెలిపారు. భారతదేశంలో ప్రాంతీయ పార్టీలకు 61లక్షల మెంబర్‌షిప్ లేదన్నారు. ఏడేళ్లుగా సభ్యత్వం తీసుకున్నవారికి ప్రమాద బీమా కూడా ఇస్తున్నామన్న పల్లా పేర్కొన్నారు. కొత్తగా చేరిన వారికి బీమా వర్తింపచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

అన్ని నియోజకవర్గాల్లో సామాజిక మాధ్యమాల విభాగం ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. 31జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణం మొదలయ్యిందని, 24 జిల్లాలో పూర్తయ్యాయని, 7 జిల్లాలో 95శాతం పూర్తి అయ్యాయని ఆయన తెలిపారు. ప్రతి జిల్లా కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభిస్తారన్నారు. వచ్చే రెండు నెలల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేస్తామని, ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటామన్నారు. సోషల్ మీడియాలో కూడా పార్టీ యాక్టివ్‌గా ఉందన్నారు. దళిత సాధికారత పథకం దళిత వర్గాల్లో ఉత్తేజం కల్పించిందన్నారు. లక్షా 30 వేల ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేశామని, మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్న సిఎం కెసిఆర్‌ను సమావేశం అభినందించిందన్నారు. నిరుద్యోగుల సమస్యలు తొలగిపోయాయని, ఉచిత కరెంట్ రైతుబంధుతో వ్యవసాయ సమస్యలు దూరమయ్యాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందన్నారు.

ప్రధాన కార్యదర్శులకు మంత్రి కెటిఆర్ దిశానిర్ధేశం

నీటి వాటాలపై తమకు పూర్తి అవగాహన ఉందన్నారు. కృష్ణా జలాల మీద హక్కు లేనివాళ్లు ఇవాళ ప్రాజెక్టులు కడుతున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. హక్కు లేని నీటిని ఆంధ్రప్రదేశ్ దొంగిలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ చర్యలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని పల్లా పునరుద్ఘాటించారు. న్యాయబద్ధంగా పోరాటం చేస్తూనే ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. తాజా పరిస్థితులపై ఎలా స్పందించాలన్న దానిపై మంత్రి కెటిఆర్ ప్రధాన కార్యదర్శులకు దిశానిర్ధేశం చేశారని పల్లా తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక, కృష్ణానదిపై ఎపి ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్రంలోని రాజకీయ పక్షాల వైఖరి, విపక్షాల విమర్శలకు ధీటుగా స్పందించడం, వాటిని ఎదుర్కొనే వ్యూహాలపై మంత్రి కెటిఆర్ కీలక సూచనలు చేసినట్టు పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. నా ఇష్టమొ చ్చినట్లు ప్రాజెక్టులు కడతా, కృష్ణా పరీవాహక ప్రాంతానికి నష్టం చేస్తా, లేని నీటిని దొంగిలించుకుపోతా అంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఈ రాష్ట్రంలో నీటి వాటాలపై టిఆర్‌ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రికి పూర్తి పరిజ్ఞానం ఉందన్నారు. న్యాయబద్ధంగా పోరాటం చేస్తామని, అదే విధంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తామని, నీటి మీద హక్కుని, ఒక్క చుక్క నీటిని వదులుకోమని -పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News