భూభారతి చీకటి చట్టమని, తెలంగాణ భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం పడుతున్న కర్పూర హారతి అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం ఆయన మాట్లాడారు. మాన్యూవల్ పహాణిలతో అక్రమాలకు అవకాశం ఉందని, మ్యూటేషన్ ఆలస్యంతో మళ్ళీ అవినీతికి ఆస్కారం ఉందని, ధరణి పై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు. కోటి 52లక్షల ఎకరాల భూమి ధరణిలో రైతుల పేరు మీద ఉందని తెలిపారు. ధరణి రిజిస్ట్రేషన్ పక్రియను సులభతరం చేసిందని, అధికారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు. గ్రామాల్లోకి మళ్లీ అక్రమార్కులను తీసుకుని రాబోతున్నారని, గ్రామాల్లో మళ్లీ గొడవలు మొదలవుతాయని ఆరోపించారు.
12కోట్ల మంది ధరణి వెబ్ సైట్ ను విజిట్ చేశారని, కోటి 52లక్షల ఎకరాలు భూమి 70లక్షల మంది రైతుల పేరుతో భద్రంగా ఉందని తెలిపారు. 90శాతం భూమి చిన్నకారు రైతుల చేతుల్లో ఉందని, 86సంవత్సరాల తర్వాత కెసిఆర్ భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన చేశారని తెలిపారు. వంద రోజులు క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి రికార్డులు ఖరారు చేశారని, పైసా ఖర్చు లేకుండా 7లక్షల ఎకరాల సాదా బైనామాల ద్వారా రెగ్యులరైజ్ చేసిన మహనీయుడు కెసిఆర్ అన్నారు. ధరణి లోపాలను సరిదిద్దకుండా దళారుల ప్రమేయం ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ భూములు ఎవరికీ తాకట్టు పెట్టలేదని, ధరణి సాఫ్ట్ వేర్‌నే భూభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వం వాడబోతున్నది అన్నారు. అనుభవదారు కాలామ్ పెట్టి మళ్ళీ రైతులకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.
అసెంబ్లీ పద్దతి లేకుండా నడుస్తున్నాయి : కెపి వివేకానంద, ఎమ్మెల్యే
అసెంబ్లీ సమావేశాలు పద్దతి లేకుండా నడుస్తున్నాయని ఎమ్మెల్యే కెపి వివేకానంద అన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయని విమర్శించారు. నియమాలు, నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారం సభను నడుపుతున్నారు అన్నారు. ముఖ్యమంత్రి అనుభవరాహిత్యంతో సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఆరు గ్యారంటీలు ,420 హామీల నుంచి దృష్టి మరల్చడానికే సిఎం రేవంత్, కెటిఆర్‌పై కేసు పెట్టారి ఆరోపించారు. ఫార్ములా ఈ రేసింగ్ తో రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందని, దానిని కుంభ కోణంగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చర్చ కోసం పట్టుబడితే కాంగ్రెస్ సభ్యులు తమపై చెప్పులు,బాటిళ్లతో దాడి చేశారని తెలిపారు. సిఎం ప్రోద్బలంతోనే కాంగ్రెస్ సభ్యులు రెచ్చిపోతున్నారని, సిఎంకు దమ్ము లేకనే ఫార్ములా ఈ రేసింగ్ పై చర్చకు ఒప్పుకోలేదని, చర్చ జరిగితే నిజాలు బయట పడుతాయని ఒప్పుకోలేదని ఆరోపించారు. ప్రజా కోర్టులో రేవంత్‌ను దోషిగా నిలబెడతామని హెచ్చరించారు.
వ్యక్తి కోసం కొట్లాడలేదు : పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే
అసెంబ్లీలో ఒక వ్యక్తి కోసం కొట్లాడలేదని, నాలుగు కోట్ల మంది ప్రజల కోసం కొట్లాడామని, తెలంగాణ పరువు అంతర్జాతీయంగా పోయిందని ఆరోపించారు. లండన్‌లో ఫార్ములా ఈ తెలంగాణ ప్రభుత్వంపై కేసు వేసిందని, కాంట్రాక్టు ఉల్లంఘనపై ప్రభుత్వంపై కేసు పెట్టడం రాష్ట్రానికి అవమానమని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసమే స్పీకర్ పోడియం లోకి వెళ్లామని స్పష్టం చేశారు. కెటిఆర్‌పై అక్రమ కేసు పెట్టిందని, సిఎం రేవంత్ చిప్పకూడు తిని, అందరికి చిప్పకూడు తినిపించాలని అనుకుంటున్నారని అన్నారు