హైదరాబాద్: ఉత్తర భారత దేశానికో నీతి, దక్షిణ భారతానికి మరో నీతి అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో పల్లా మాట్లాడుతూ.. ”డబుల్ ఇంజిన్ గురించి మాట్లాడే బీజేపీ నేతలు ధాన్యం కొనుగోలుపై ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. పీయూష్ గోయల్ అహంకార పూరితంగా తెలంగాణ ప్రజలను అవమానించారు. సిఎం కెసిఆర్ ను తెలంగాణ రైతు వ్యతిరేకి అంటావా?… కెసిఆర్ రైతు వ్యతిరేకి అయితే 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణలో ఎందుకు పండింది?. చరిత్ర తెలుసుకో పీయూష్ గోయల్. తెలంగాణ ప్రజలు నూకలు తినాలన్న పీయూష్ గోయల్ క్షమాపణ చెప్పాలి అని తెలంగాణ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేయాలి. తెలంగాణ ధాన్యం కొనాల్సిందే.. దీనికోసం ఎంతకైనా తెగిస్తాం. మెడలు వంచుతాం. తెలంగాణ బీజేపీ ఎంపీలే కేంద్రాన్ని ధాన్యం కొనొద్దని చెబుతూ రైతులకు ద్రోహం చేస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కార్యదర్శి అనిల్ కుమార్ పాల్గొని రాష్ట్రం వైఖరి చెప్పారు. ఏమీ చెప్పలేదని పీయూష్ గోయల్ బొంకుతున్నారు. గోధుమలు సేకరించినట్టే ధాన్యాన్ని సేకరించాలని మా డిమాండ్. గోధుమలు కాకుండా గోధుమ పిండి సేకరిస్తున్నారా.. బియ్యం కాకుండా ధాన్యం ఎందుకు సేకరించరు?. పీయూష్ గోయల్ కేంద్ర మంత్రిననే విషయం మరచిపోయి అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి కేంద్ర మంత్రిని గతంలో ఎపుడూ చూడలేదు. బీజేపీ ఎంపీలు పీయూష్ దగ్గరికి వెళ్లి తెలంగాణ ధాన్యం కొనాలని డిమాండ్ చేయాలి. వ్యవసాయ చట్టాల ఆందోళనలో 750 మంది రైతుల ప్రాణాలను తీసుకున్న చరిత్ర కేంద్ర ప్రభుత్వానిది. మమ్మల్ని రైతు వ్యతిరేక ప్రభుత్వం అనడానికి సిగ్గుండాలి. సీఎం కేసీఆర్ ధాన్యం సేకరణపై మొదటినుంచి రైతులకు వాస్తవాలే చెప్పారు. రైతులను యాసంగిలో వరి వేయమని రెచ్చ గొట్టిన బీజేపీ నేతలు ఇపుడు ఎక్కడున్నారు?” అని ప్రశ్నించారు.
Palla Rajeshwar Reddy slams Telangana BJP MPs