Monday, November 25, 2024

ప్రశ్నకు సమాధానమే పల్లా విజయం

- Advertisement -
- Advertisement -

Palla Rajeshwar reddy wins in MLC Election

 

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14న జరిగిన రెండు పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన హోరాహోరీలో అధికార పార్టీదే అంతిమ విజయం అయింది. హైద్రాబాద్-రంగారెడ్డి-మమాబుబ్ నగర్, నల్లగొండ -ఖమ్మం- వరంగల్ నియోజక వర్గాల పరిధిలో మొత్తం 11 పార్లమెంట్ స్థానాలు, 70 శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి. అంటే 119 అసెంబ్లీ స్ధానాల్లో ఇవి దాదాపు సగానికి పైగా నియోజక వర్గాలకు సంబంధించిన ఎన్నికలు. మొత్తం నల్లండ ఖమ్మం వరంగల్ పరిధిలో 5 లక్షల 5 వేల 565 మంది ఓటర్లకుగాను 3 లక్షల 86 వేల 320 అంటే 76 శాతం ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇక హైద్రాబాద్ రంగారెడ్డి మాహబూబ్‌నగర్ పరిధిలో కూడా 5 లక్షల 31 వేల 268 మందికి గాను 3 లక్షల 57 వేల 354 అంటే 67 శాతం మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు. అందులోనూ ఇవి సామాన్య ప్రజలు వేసే ఓట్లు అంతకన్నాకావు.

విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు మొత్తంగా పట్టభద్రులు పాల్గొనే ఎన్నికలు. అసలే నిరుద్యోగ అంశం సర్కారును వెంటాడుతున్నది. ఉద్యోగుల పిఆర్‌సిపై ఫైటింగ్ జరుగుతున్నది. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ధరణీ, రిజిస్ట్రేషన్లు, కరోనా వంటి అంశాలు తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. వీటన్నింటికి తోడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో పాగా వేసేందుకు కాచుకుని కూర్చుంది. దొరికిన ఛాన్స్‌ను వదలకుండా ప్రభుత్వం పై వ్యతిరేకతను పెంచేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఇక ఇది ఇలా ఉంటే 2018 లో రెండోసారి అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీ పట్ల అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే అందరూ పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు సోషల్ మీడియాతో పాటు పొలిటికల్ ఎనలిస్టులు సైతం వివరిస్తూ వస్తున్నారు. వారి ప్రచారానికి తగ్గట్లుగానే దుబ్బాక శాసన సభ్యుడు రామలింగారెడ్డి అకాల మరణంతో అక్కడ జరిగిన ఎన్నికల్లో భారతీయ జనాత పార్టీ విజయం సాధించింది.

ఆ తర్వాత హైదరాబాద్ నగర పాలక సంస్ధకు జరిగిన ఎన్నికల్లో 99 నుంచి 56 స్ధానాలకు పడిపోయినా అతి పెద్ద పార్టీగానే అవతరించింది. మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. కారణాలు ఏమైన వార్ వన్ సైడ్ అనుకునే టిఆర్‌ఎస్ పార్టీకి ఈ రెండు ఎన్నికలు పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి. కానీ ప్రత్యర్ధుల సంతోషాన్ని ఎక్కువ సేపు నిలువనీయలేదు కెసిఆర్. ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అందివచ్చిన అవకాశంగా పట్టభద్రుల నియోజక వర్గాల ఎన్నికలను సవాల్‌గా స్వీకరించారు. పార్టీకి, క్యాడర్‌కి ఛాలెంజ్ ఎన్నికలు అని స్పష్టం చేశారు. అంతే వ్యూహా, ప్రతి వ్యూహాలలో దిట్ట అయిన కెసిఆర్ ఎత్తులకు ప్రతిపక్షాలు చిత్తు అయ్యాయి. జిల్లాల వారీగా మంత్రులను, శాసన సభ్యులను ఇతర నేతలకు ఈ గెలుపు అనివార్యం అని క్లారిటీ ఇచ్చారు. పార్టీ ఉంటేనే మనం అని లీడింగ్ ఇచ్చారు. కనీసం తానేక్కడా ప్రచారం చేయకుండానే విజయం దరి చేరేలా చేశారు. అయితే ఇక్కడ కొన్ని అంశాలు పరిశీలిస్తే ఈ రెండు శాసన మండలి ఎన్నికల్లో ప్రధాన నినాదం నిరుద్యోగం.

తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉస్మానియా, కాకతీయ విశ్వ విద్యాలయాలతో పాటు ఇతర యూనివర్శిటీలు కూడా ఈ నియోజక వర్గాల పరిధిలోనే ఉన్నాయి. అసలు తెలంగాణ ఉద్యమానికే కేంద్రాలు అన్ని ఈ పరిధిలోనే ఉన్నాయి. దీంతో ఇక్కడ విజయం ఎవరికీ అంతా ఈజీ కాదనుకున్నారు. టిఆర్‌ఎస్‌కు అసలు సాధ్యం కాదనుకున్నారు. ఈ గడ్డు పరిస్థితుల్లో సిట్టింగ్ ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డిని, హైదరాబాద్ – రంగారెడ్డి- మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి మాజీ ప్రధాని పివి నరసింహరావు వారసురాలు సురభి వాణిదేవిని బరిలోకి దింపారు.

ఆమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా ఆమె రాజకీయ నాయకురాలు కాదు. ప్రజల్లో గుర్తింపు లేదు. అయిన సిట్టింగ్ బిజెపి ఎంఎల్‌సిపై తన అస్త్రంగా వాణిదేవిని ప్రయోగించారు. ఈ నియోజక వర్గంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో సెకండ్ ప్లేస్ సంపాదించిన బిజెపి తన స్థానం పదిలం అనుకుంది. అంతేకాకుండా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడుగా, మేధావిగా పేరు పొంది రెండు సార్లు ఎంఎల్‌సిగా ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన మాజీ ఎంఎల్‌సి ప్రొఫెసర్ నాగేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి వంటి వారు పోటీలో ఉన్న నేపథ్యంలో వాణిదేవి విజయం అంత సులువేమి కాదని అనుకున్నారు. పైగా టిఆర్‌ఎస్ ఇక్కడ ఒక్క సారి కూడా గెలుపొందిన దాఖలాలు కూడా లేవు. అటువంటి సమయంలో కెసిఆర్ అండ్ టీమ్ సవాల్‌తో పని చేసి రాజధానిపై తొలిసారిగా పాగా వేశారు.

అయితే ఈ ఎన్నికల్లో ప్రభుత్వం పై వ్యతిరేకంగా పని చేసిన పార్టీలన్నింటివి ఒకే నినాదం. ప్రశ్నిస్తాం, -నిలదీస్తాం. ఈ రెండు నియోజక వర్గాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎన్నిక నల్లొండ ఖమ్మం వరంగల్ ది అని చెప్పాలి. ఇక్కడ మహామహులు బరిలోకి దిగారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ నుంచి మాజీ ఎంఎల్‌సి రాములు నాయక్, బిజెపి నుంచి ప్రేమేందర్ రెడ్డి, సిపిఐ-, సిపిఎంల ఉమ్మడి అభ్యర్ధి జయసారథి రెడ్డి, తెలంగాణ జన సమితి నుంచి ప్రొఫెసర్ కోదండరాం, ప్రశ్నించే గొంతునంటూ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న, ఇంటి పార్టీ చెరుకు సుధాకర్, యువ తెలంగాణ నుంచి రాణి రుద్రమ రెడ్డి వంటి వారు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఒక వైపు అధికార పార్టీని గద్దె దించుదాం, ఉమ్మడి ఉద్యమాలు నిర్మిస్తాం అని ఆ సందర్భంగా ప్రకటించి, సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఎవరికి వారే అధికార యావతో పోటీపడి వ్యతిరేక ఓట్లను చీల్చుకుని ఆ తర్వాత చేతులు కాల్చుకోవడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారింది. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ నాన్‌లోకల్ అభ్యర్ధిని బరిలోకి దింపడంతో పార్టీకి షరా మాములుగానే స్ధానిక నేతల మద్దతు కరువైంది.

ఉద్యమకారులైన నాయకులు అంతా విడిపోయి యుద్ధంలో దిగితే ఫలితం ఎలా ఉంటుందో చరిత్రలో అనేక సార్లు రుజువైంది. ఇక్కడ కూడా అదే పునారావృతం జరిగిందని స్పష్టం అవుతున్నది. వీరంతా కలసి ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబించలేకపోయారు. కేవలం అధారాలులేని ఆరోపణలకు పరిమితం అయ్యారు. తామేందుకు పోటీ చేస్తున్నామో, ఎవరి కోసం పోరాటం చేస్తున్నామో… అసలు కెసిఆర్ ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేయాలో చెప్పలేని పరిస్థితి వారిది. గుడ్డి వ్యతిరేకత ఒక్కటే ఓటును మార్చలేదు. పరిస్థితి, పరిణామాలు కూడా అందుకు దోహదం చేయాలి.

ఇవన్నీ పక్కకు పెట్టి మేం ప్రశ్నిస్తాం అంటే ప్రజలు విశ్వసిస్తారా? మరో వైపు వీరి ఆరోపణలకు, ప్రశ్నలకు తాను సమాధానం అంటూ టిఆర్‌ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి కన్వీన్స్ చేసిన విధానం అందరినీ ఆకర్షించిందని చెప్పక తప్పదు. తెలంగాణ గడ్డకు ప్రశ్నించడం ఎవరూ నేర్పాల్సిన అవసరం లేదు. అది పుట్టుకతోటే వస్తుందని ఆయన తన ప్రచారం లో ముందు నుంచి చెప్పుకొచ్చారు. తన ప్రభుత్వం ప్రజలకు, ఉద్యోగ నియమాకాల కోసం చేపట్టిన నోటిఫికేషన్లతో పాటు ప్రతి అంశాలకూ సమాధానం అయ్యారు. అంతేకాకుండా రైతు బంధు సమితి చైర్మన్‌గా రైతు సమస్యలను గుర్తు చేశారు. తన పై, తన విద్యా సంస్ధలపై, వ్యక్తిగత విమర్శలు చేసినా చిరునవ్వుతో సైడ్ చేశారు.

ఇక ఫలితాలు ప్రారంభం అయినప్పటి నుంచి పల్లా ఎక్కడ వెనకబడలేదు. ప్రతి రౌండ్‌లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. తన ప్రత్యర్ధికి ఎప్పుడు అందనంతా దూరంలోనే ఉన్నారు. దీనిని బట్టే తెలస్తుంది ప్రభుత్వంపై ప్రజల కంటే పార్టీలకు , నాయకులకే అధిక వ్యతిరేక ఉందని. అంతేకాదు నోముల నర్సింహ్మయ్య మరణంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజక వర్గంలో జరిగే ఉప ఎన్నికపై చూపిస్తుందనడంలో సందేహం లేదు. దీంతో మరో గెలుపు టిఆర్‌ఎస్ ఖాతాలో పడడం ఖాయంగా కనిపిస్తుంది. దుబ్బాక వయా గ్రేటర్ హైద్రాబాద్ టు నాగర్జున సాగర్ అనుకున్న బిజెపికి, తిరిగి పుంజుకోవడానికి ఛాన్స్ వచ్చిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ పట్టభద్రుల ఫలితాలతో ఉహించని బ్రేక్ వేశారు గులాబీ దళపతి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News