మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి : బిజెపి, బిఆర్‌ఎస్‌కు ఓట్లడిగే అర్హత లేదని పి సిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ భువనగిరి ఎంపి అభ్య ర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి అంబేద్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన రోడ్ షో ఆయన ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బిజెపి, బిఆర్‌ఎస్‌ను బొందపెట్టడానికి క మ్యూనిస్టులు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ వ్యవస్థలను, ప్రభుత్వ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. భువనగిరి పార్లమెంట్ బిఆర్‌ఎస్ అభ్యర్థిగా క్యామ మల్లేష్‌ను ముందు పెట్టి వెనుక నుండి బూర నర్సయ్య గెలుపుకోసం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ‘బూర’ ఊదుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కులం పేరుతో బరిలోకి దింపి గొల్లకురుమలను కెసిఆర్ మోసం చేస్తున్నారని అన్నారు. ‘పదే పదే ప్రభుత్వం పడిపోతుందని కెసిఆర్ అంటుండు.. ఇదేమైనా ఫుల్ బాటిలా.. పడిపోడానికి’ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పడిపోతదని ఎవరైనా మాట్లాడితే ఉరికించి కొడతామని ఆయన హెచ్చరించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే రాష్ట్ర అవతరణను తప్పుపట్టిన బిజెపికి తెలంగాణలో ఓట్లు అడిగే అర్హతలేదన్నారు.
ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేసే బాధ్యత తనదని యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా మాట ఇస్తున్నానని వెల్లడించారు. మూడు లక్షల మెజార్టీలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే గందమల్ల, బ్రాహ్మణ వెల్లెంల, బస్వాపూర్ ప్రాజెక్టులను పూర్తి చేయించే బాధ్యత తనదని అన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేసి మూసీ మురికి నుండి ప్రజలను విముక్తి చేస్తానని భరోసా ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ భువనగిరికి డబుల్ ఇంజన్ లాంటి వారని పొగడ్తలతో ముంచెత్తారు. కష్టనష్టాల్లో పేదలకు సేవలందించిన బిడ్డ కోమటిరెడ్డి అని అన్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి అయితే తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన నాయకుడని ప్రశంసించారు. భూమికి మూరెడులేని సన్నాసి.. మంత్రి పదవి కోసం కెసిఆర్‌ను కాకా పట్టే దద్దమ్మ.. నేడు రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డిలను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ దొంగచాటున దొరగారి సారాలో సోడా పోసి రాజకీయాల్లోకి రాలేదన్నారు. రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి రాజకీయాల్లో పైకి వచ్చారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో తనతోపాటు ఎవరికైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే.. అది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
భువనగిరిలో కాంగ్రెస్‌కు సిపిఐ మద్దతు: పల్లా వెంకట్ రెడ్డి
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి సిపిఐ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మబిక్షం, సురవరం సుధాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారసుడిగా చామల కిరణ్ రెడ్డిని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఏకమైన ఇండియా కూటమే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి సిపిఐ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే భువనగిరిలో బిజెపిని ఓడించాలన్న ప్రధాన ఉద్దేశంతో సిపిఐకి కాకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ కెసిఆర్ అయ్య జాగీరా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
‘ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపుతామని అనడానికి బచ్చాగాడు కెటిఆర్‌కి బుద్ధి లేకున్నా కట్టె పట్టుకుని తిరుగుతున్న ఆయన తండ్రి, ముసలాయన కెసిఆర్‌కైనా బుద్ధి ఉండాలి కదా.. తెలంగాణ మీ అయ్య జాగీరా ఎట్లా ..దింపుతార్రా’ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘మీ నోట్లో నుండి మరోసారి ఆ మాటలు వస్తే మీ సంగతి ఏంటో చూస్తాం’ అని హెచ్చరించారు. అడ్డగోలుగా మాట్లాడడం మానుకోవాలన్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌కి ఓటు వేస్తే బిజెపికి వేసినట్లేనని, బిఆర్‌ఎస్, బిజెపి వేరు వేరు కాదని.. ఆ రెండు ఒక్కటే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను బొంద పెట్టినట్టే, పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని బండకేసి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించి తెలంగాణకు విముక్తి కల్పించిన రావి నారాయణరెడ్డి నడయాడిన గడ్డ మీద మతోన్మాద పార్టీని మట్టి కరిపించి కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. భువనగిరి ఎంఎల్‌ఎ కుంభం అనీల్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంఎల్‌ఎలు మందుల సామేల్, వేముల వీరేశం, మల్‌రెడ్డి రంగారెడ్డి, డిసిసి అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.