Sunday, December 22, 2024

ప్రగతి సాగేనో పల్లె మురిసేనో…

- Advertisement -
- Advertisement -

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం జరుపుకొన్న పల్లె ప్రగతి దినోత్సవం చాలా ప్రత్యేకమైనది. గ్రామ స్వపరిపాలన, గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామ జ్యోతి తెలంగాణ గ్రామ అభివృద్ధి పథకాన్ని రూపొందించింది. భారత దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంది. గ్రామాల అభివృద్ధితోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉన్నది అన్న మహాత్మాగాంధీ ఆశయాన్ని నిజం చేసే దిశగా ప్రభుత్వం గ్రామ అభివృద్ధి ప్రణాళికలను పార్లమెంటు, అసెంబ్లీలో కాకుండా గ్రామాల్లో ప్రజల సమక్షంలో గ్రామసభలో రూపొందించిందని, పంచాయతీలు సాధికారత సాధించాలంటే ఏడు కీలక రంగాలకు సంబంధించిన అభివృద్ధి జరగాలని సూచించింది 1. పారిశుధ్యం, త్రాగు నీరు 2. ఆరోగ్యం పోషకాహారం 3. విద్య 4. సామాజిక భద్రత 5. పేదరిక నిర్మూలన 6. సహజ వనరుల నిర్వహణ 7. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన.

ఈ ఏడు రంగాల్లో ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత అభివృద్ధిలో కొనసాగుతుంది ఇటీవల కేంద్రం ప్రకటించిన దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ వికాస్ పురస్కారాలు 2023లో దేశ వ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు పోటీ పడగా 46 పురస్కారాలకు గాను 13 పురస్కారాలు తెలంగాణకే దక్కాయి. దాదాపు 30% తెలంగాణకే దక్కడం జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ఖ్యాతిని తెలియజేశాయి. గత సంవత్సరం ఆదర్శ గ్రామ యోజన పురస్కారాల్లో తొలి 20 గ్రామ పంచాయతీలో 19 తెలంగాణ గ్రామ పంచాయతి ఉండడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అరకొర నిధులతో సతమతమైన తెలంగాణ పల్లెలు నేడు కంపోస్ట్ ద్వారా చెత్త నుండి సంపదను తయారు చేస్తున్నాయి. కేంద్రం ప్రకటించే ఏ పురస్కారాలైనా ఈ పంచాయతీ ఆన్‌లైన్ ఆడిటింగ్ ఆదర్శ గ్రామాలు స్వచ్ఛభారత్ ఒడిఎఫ్ వంటి ఈ విభాగమైనా తెలంగాణది పైచేయి. రాష్ట్ర ఆవిర్భావం నుంచి గత తొమ్మిది ఏళ్లలో ఏకంగా 79 జాతీయ పురస్కారాలను తెలంగాణ రాష్ట్రం గెలుచుకున్నది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ పల్లెలు పాత గోడలు, పాడుబడ్డ బావులు, చెత్త కుప్పలు అస్తవ్యస్తంగా ఉండేవి.సమైక్య పాలనలో ఆంధ్ర పాలకులు తెలంగాణ అభివృద్ధికి తీసుకున్న చర్యలు ఎడారిలో ఎండమావి లాంటివే. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ప్రతి గ్రామంలో పారిశుధ్య సేకరణకు ఒక ట్రాక్టర్, హరితహారం మొక్కలకు ఒక ట్యాంకర్, ప్రతి గ్రామానికి ఒక మోడల్ స్మశాన వాటిక, తడి పొడి చెత్త సేకరణకు డంపింగ్ యార్డ్, అలాగే ప్రతి గ్రామానికి ఒక నర్సరీ, ఆహ్లాదకరానికి ఒక పార్క్ లాంటి సదుపాయాలు ఎన్నో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పల్లెలో చూపెట్టింది. స్వరాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి పల్లెల రూపు రేఖలను మార్చడానికి 2015లో గ్రామ జ్యోతి పథకానికి శ్రీకారం చుట్టారు. అతి తక్కువ వ్యవధిలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ఫలితాలను సాధించడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారుల దార్శనికత, నిబద్ధతకు తోడు 2018లో తీసుకు వచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం ఒక స్ఫూర్తిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో 61.3% జనాభా కలిగి ఉన్న గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి 2019లో పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టారు.

పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 500 జనాభా ఉన్న గిరిజన తండాలను సైతం గ్రామ పంచాయతీలుగా మార్చింది. స్వరాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న 8368 గ్రామ పంచాయతీలను 12,569 గ్రామ పంచాయతీలుగా మార్చి ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ కార్యదర్శిని నియమించారు. కార్యదర్శులు నియామకం వలన గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వానికి నివేదికలు సమాచారం అందించడం వీలైంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ ఆదేశాలను, పథకాలను అమలు చేయడంలో గ్రామ కార్యదర్శి కీలక పాత్ర పోషిస్తున్నారు. నూతన పంచాయతీ రాజ్ చట్టం సర్పంచికి విశేషాధికారాలను కల్పించింది. గ్రామ స్థాయిలో అభివృద్ధికి తోడ్పడే సర్పంచ్‌లకు ప్రోత్సాహకాలను కల్పిస్తూ అవినీతికి పాల్పడే వారిని తొలగించే అధికారాన్ని సైతం కలెక్టర్లకు పంచాయతీరాజ్ చట్టం కల్పించింది. ఐదు విడతలుగా సాగిన తెలంగాణ పల్లె ప్రగతితో పల్లె రూపురేఖలు మారి క్రమంగా అభివృద్ధి పథంలో కొనసాగుతున్నాయి సిసి రోడ్లు, సిసి కెమెరాలతో వేలాడే విద్యుత్ తీగల స్థానంలో ఎల్‌ఇడి లైట్లు మిరమిడ్లు కోల్పోతున్నాయి డ్రైనేజీలు టంప్యాడ్ల నిర్మాణంతో పారిశుధ్య వసతులు మెరుగయ్యాయి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పరిశుభ్రతకు రథచక్రంగా మారింది.

పల్లె ప్రకృతి వనాలతో పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. వైకుంఠ ధామాలు నిర్మించక ముందు కుల ప్రాతిపాదికన శ్మశాన వాటికలు ఉండేవి. ఇప్పుడు అందరికీ ఒకే వేదికను నిర్మించి అందరూ సమానమని భావనను తీసుకు వచ్చారు. హరితహారం, రైతు వేదికలు, ఇంకుడు గుంతల వంటి భూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఒకప్పుడు నిధుల లేమితో సతమతమైన తెలంగాణ పల్లెలు నేడు కంపోస్ట్ ద్వారా చెత్త నుంచి సంపదను తయారు చేస్తున్నాయి. అదిలాబాద్‌లోని ముఖారా గ్రామపంచాయతీ సొంత నిధులతో సొంత సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పరిచి గ్రామ పంచాయతీ వీధి దీపాలకు విద్యుత్ అందిస్తున్నది. ఇలాంటి గ్రామ పంచాయతీలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఒడిఎఫ్, ఒడిఎఫ్ ప్లస్, స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామాలు అధికంగా కలిగిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణనే.

తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు రూ. 14236 కోట్లు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ హోదా కల్పిస్తూ తొమ్మిదవ భాగం 11వ షెడ్యూల్ ఏర్పరిచి 29 అధికారాలను కేటాయించారు. కానీ వీటిని కొన్ని రాష్ట్రాలు నేటికీ గ్రామ పంచాయతీలకు కేటాయించలేదు.
స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా నేటికీ రవాణా సౌకర్యాలు, తాగు నీటి వసతులు, విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు దేశంలో కోకొల్లలు. సొంత గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాలు సగానికి పైగానే ఉన్నాయి. అంగన్వాడి కేంద్రాలను, ప్రాథమిక పాఠశాలలను పంచాయతీ భవనాలుగా వినియోగిస్తూ ప్రాథమిక విద్య సౌకర్యాలను కల్పిస్తున్న గ్రామాల ఎన్నో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు ప్రధాన సమస్య నిధుల కొరతే.

ప్రభుత్వాలు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వలన పాలన అస్తవ్యస్తంగా మారుతున్నది. చిన్న గ్రామ పంచాయతీలు పూర్తిగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్నది. దీనికి తోడు పాలనపరమైన అనుమతుల పరంగా అధికారులు అలసత్వం, జాప్యం, అవినీతి వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతున్నది. కేంద్ర స్థాయిలో షెడ్యూల్డ్ గ్రామ పంచాయతీలకు పెసా చట్టం ద్వారా కల్పించిన ప్రత్యేకమైన అధికారాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఇటీవల కేంద్ర అటవీ హక్కుల చట్టం 2006కు సవరణలు తీసుకు రావడానికి చేసే ప్రయత్నం షెడ్యూల్డ్ ప్రాంత గ్రామసభ అధికార పరిధిని తగ్గించేలా ఉందని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సహకార సంఘాలకు, స్వయం సహాయక బృందాలకు సకాలంలో రుణాలు మంజూరు కావడం లేదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధులు రూ. 20వేల కోట్లు తగ్గాయి. అంటే 18 శాతం నిధులు తగ్గించారు. పల్లెలకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు వెంటనే విడుదల చేయాలని, పల్లెలు అభివృద్ధిలో ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.

పేర్వాల నరేష్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News