Monday, January 20, 2025

పల్లెప్రగతితో కానవస్తున్న అద్భుత ప్రగతి

- Advertisement -
- Advertisement -

పచ్చల హారంగా మారుతున్న గ్రామాలు
ఇప్పటికే మారిన గ్రామసీమల రూపురేఖలు
మెరుగు పడిన మౌలిక సదుపాయాలు
పల్లెల్లో ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ట్రాక్టర్లు, ట్రాలీలు
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
20వ తేదీ నుంచి ఐదవ విడత పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం

Palle pragathi guidelines

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో ప్రగతి బాట పడుతున్నాయి. ఎవరూ ఊగించని విధంగా అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని గ్రామాలు పచ్చల హారంగా కళకళలాడుతున్నాయి….పల్లెల రూపురేఖలు సమూలంగా మారుతున్నాయి. అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పనులు గ్రామాలకు వరంగా మారాయి. ఈ కార్యక్రమం కింద ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పింస్తుండడంతో గ్రామ పంచాయతీలు అద్దంలా మెరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో విడత పల్లెప్రగతికి సిద్దమవుతోంది. ఇప్పటికే నాలుగు విడుతలుగా పూర్తి చేస్తున్న పల్లెప్రగతి ఐదవ విడతగా ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

గతంలో గ్రామాలంటే పేరుకుపోయిన చెత్త, కంపుకొట్టే మురుగు కాలువలు కనిపించేవి. అంతా గందరగోళంగా ఉండేది. కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకొచ్చిన ‘పల్లె ప్రగతి’తో పల్లెల్లో నేడు అద్భుతమైన వాతావరణం ఏర్పడింది. గ్రామాలకు వస్తూనే రోడ్డుకిరువైపులా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాటయ్యాయి. గతంలో చెత్త ఎవరింటి వద్ద వారు కుప్పలు తెప్పలుగా వేసుకుని రోగాల పాలయ్యేవారు. కానీ నేడు ఊరికో ట్రాక్టర్ ఏర్పాటు చేయటం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ క్రమం తప్పకుండా జరుగుతూ పల్లెలు పరిశుభ్రంగా మారుతున్నాయి. ఫలితంగా పల్లె తల్లి పచ్చని ఆకుపచ్చ చీర కట్టినట్లుగా పచ్చ(గ్రీనరి)గా కనిపిస్తున్నాయి. ఆగమైన పల్లెలు అందంగా తయారవుతున్నాయి. పల్లె ప్రగతికి నిధుల సమస్య తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా రూ.339 కోట్లు విడుదల చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇస్తున్న నిధులతో పంచాయతీలకు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. ప్రతి చిన్నపంచాయతీకి కూడా ప్రభుత్వ రూ.5 లక్షల నిధులను ఇస్తోంది. కాగా పల్లెప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో నాంది పలికగా… 2020 జనవరిలో రెండో విడుత, జూన్ మూడో విడుత, 2021 జూలై 1 నుంచి నాలుగో విడుతగా నిర్వహించింది.

అభివృద్ధికి తొవ్వ జూపుతున్న ఊర్లు

నాడు ఊరు అంటే సర్కారీ తుమ్మలతో స్వాగతం పలికే చెరువులు.. దుమ్మూధూళీ గుంతలతో కూడిన రోడ్లు, చివరకు మరణించిన వారికి అంత్యక్రియలు సక్కగా చేయలేని దుస్థితిలో ఉండేవి. తెలంగాణ రాష్ట్రం సాధించి ఉద్యమ నాయకుడైన కెసిఆర్ సిఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పల్లెల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సాగునీరు, తాగునీరు తదితర మౌలికరంగాలు, కులవృత్తులను కొత్తపుంతలు తొక్కించే ఆలోచనలను పక్కాగా ఆచరణలో పెట్టారు.

ఫలాలను అందిస్తున్న పల్లె ప్రగతి

విరివిగా మొక్కలు పెంచి జీవ వైవిధ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాల లక్ష్యం నెరవేరింది. ప్రకృతి వనంలో తిరగడానికి వీలుగా రోడ్లు, కూర్చోవడానికి సిమెంట్ బల్లలు, విద్యుత్ దీపాలు, నీటి వసతి ఏర్పాటు చేశారు. గతంలో గ్రామాల్లో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వ స్థలాల్లో శ్మశానవాటికల నిర్మాణాలతో కాటి కష్టాలు తీరాయి. దహన సంస్కారాల ప్లాట్ ఫారం, స్నానాల గదులు, నీటి సౌకర్యం, పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు వంటి సదుపాయం కల్పించారు.

చెత్తపై యుద్ధం

పల్లెల్లో గతంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే వారు. ఇప్పుడు సేకరించిన చెత్తను ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లి డంపింగ్ యార్డులో వేయడంతో వీధులు శుభ్రంగా మారుతున్నాయి. కంపోస్టు షెడ్లు నిర్మించి ఎరువుల తయారీకి సన్నాహాలు చేస్తున్నారు. చెత్త తొలగింపునకు ఇతర అవసరాలకు ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్‌ను, నీటి ట్యాంకర్‌ను కొనుగోలు చేశారు. హరితహారంలో మొక్కలను తీసుకెళ్లడానికి, నాటిన వాటికి నీళ్లు పెట్టడానికి వీటిని వినియోగిస్తున్నారు. ట్రాక్టర్ల కొనుగోలుతో గ్రామాల్లో అనేక సమస్యలు తొలగిపోయాయి. గ్రామానికి ఒక ట్రాక్టర్ ఉంటే చెత్త సేకరణతో పాటు, మొక్కలకు నీళ్లను పట్టించేందుకు ఉంటుందని జిల్లా వ్యాప్తంగా ప్రతి జిపికి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీని సమకూర్చారు. ఇంటింటి నుంచి వచ్చిన చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్తను సేకరించడంతో పాటు సేకరించిన చెత్తను వర్మి కంపోస్టు మార్చేందుకు గ్రామాల్లో డంపింగ్ యార్డులు సైతం నిర్మాణాలు చేపట్టారు. కంపోస్టు షెడ్లు నిర్మించారు.

గ్రామానికి బలం ఊరి చెరువు

గ్రామానికి బలం ఊరి చెరువు.. చెరువుపై ఆధారపడి వ్యవసాయపనులు, కులవృత్తులు జరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఊరి చెరువు బాగుంటే ఊరంతా పనే. ఈ కీలకమైన విషయానికి కెసిఆర్ అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువులను బాగుచేసి నీటి నిల్వ సామర్థ్యం పెంచారు. కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును నిర్మాణం చేసి సాగునీటి కష్టాలు తీర్చారు. పరాయి పాలనలో ప్రాజెక్టులంటే శిలాఫలకాలుగా చూసిన ప్రజలకు తెలంగాణలో ప్రాజెక్టులంటే నీళ్లు పారటం అని కళ్లారా చూపించారు. నాడు కరెంట్ అంటే- కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, అర్ధరాత్రి అపరాత్రి వచ్చీ రాని కరెంట్‌తో రైతుల మరణాలు, పంటలెండి ఆత్మహత్యలు. కానీ నేడు కరెంట్ పోతే వార్తగా మారింది. దీంతో రైతు ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటున్నడు. పంట పండించడం రాదని హేళన చేసిన చోట నేడు తెలంగాణ దేశానికే అన్నం పెట్టే స్థితికి చేరింది.

దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా

పల్లె ప్రగతి ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, కల్లాలు సమకూరుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితి దేశంలో మరే రాష్ట్రంలోనూ కనిపించడం లేదు. ఇది రాష్ట్రానికి గర్వకారణంగా మారింది. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పక్కగా జరగడానికి మండలానికి ఒక ప్రత్యేక అధికారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఎంపిటిసి, కార్యదర్శి, వార్డు మెంబర్లు, లైన్ మెన్, మిషన్ భగీరథ ప్రతినిధి సభ్యులుగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు ప్రత్యేకంగా వర్క్ కమిటీ, శానిటేషన్ కమిటీ, స్ట్రీట్ లైట్ కమిటీ, గ్రీన్ కవర్ కమిటీలు కూడా ఉంటాయి.

నాలుగు విడతల్లో సాధించిన ప్రగతి

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నాలుగు విడతల పల్లెప్రగతిలో అనేక పనులు జరిగాయి. వాటిల్లో ప్రధానంగా రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామాలకుగాను 11,641 గ్రామాల్లో డంపింగ్ షెడ్లను నిర్మించడం జరిగింది. -ఇందులో 9,023 గ్రామాల్లో సేంద్రీయ ఎరువుల తయారీ మొదలైంది. అలాగే రాష్ట్రంలోని 540 మండలాల్లోని మొత్తం 12,765 గ్రామాలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను సమకూర్చింది. 12,755 గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి 1784.54 లక్షల మొక్కలను నాటింది. రాష్ట్రంలో 2601 రైతువేదికలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2580 రైతు వేదికల నిర్మాణం పూర్తయింది. ప్రకృతివనాల ఏర్పాటు కోసం రాష్ట్రంలోని మొత్తం 19,470 ఆవాసాలకు గాను 19,027 ఆవాసాల్లో భూములను గుర్తించి -18,656 పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించడం జరిగింది. ఇందులో 15,646 ప్రకృతి వనాల్లో 13 కోట్ల 87 లక్షల మొక్కలను నాటారు. 12,695 గ్రామాల్లో వైకుంఠ ధామాలను నిర్మించాలని లక్షంగా పెట్టుకోగా 6,500లకు పైగా వైకుంఠధామాల నిర్మాణం పూర్తవగా, 4,500లకు పైగా వినియోగంలోకి వచ్చాయి. మండలానికి 5 చొప్పున బృహత్ పల్లె ప్రకృతి వనాలు 5 నుండి 10 ఎకరాలలో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇప్పటివరకు 98 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయగా, మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ 6,908 కిలోమీటర్ల రహదారులకు ఇరువైపులా నాటడం జరిగింది. 1,28,278 మిడిల్ కరెంట్ పోల్స్‌ను నెలకొల్పారు. అలాగే 1,04,857 వంగిన, పాడైన, తుప్పుపట్టిన పోళ్ల స్థానంలో కొత్త స్థంబాలను వేశారు. అలాగే 76,671 కిలోమీటర్ల మేర రహదారులను,55,051 కిలోమీటర్ల డ్రైనేజీలను శుభ్రం చేశారు. 48,699 ప్రాంతాల్లో పాడుపడిన ఇండ్ల శిథిలాల తొలగించారు. 1,24,827 ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు, పొదలు, సర్కారు తుమ్మల తొలగించారు.

నిధులకు చేయూత

జిల్లా పరిషత్‌లకు, మండల పరిషత్తులకు గత ఆర్ధిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం రూ. 1,365 కోట్ల నిధులను విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సమాధానంగా బడ్జెట్‌లో రూ.1,365 కోట్లు కేటాయించి విడుదల చేయనైనది. ఇందులో జిల్లా పరిషత్తులకు రూ.68.25 కోట్లు మండల పరిషత్తులకు రూ.136.50 కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ.1,160.25 కోట్లు కేటాయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News