Wednesday, January 22, 2025

పనామా కాలువ … అమెరికా ఇచ్చిన గిఫ్ట్ కాదు : జోస్ రౌల్ ములినో

- Advertisement -
- Advertisement -

దావోస్ : పనామా కాలువ తమదేనంటూ గత కొన్ని రోజులుగా వ్యాఖ్యానిస్తున్న డొనాల్డ్ ట్రంప్, ఇటీవల తన ప్రమాణస్వీకారం సమయంలోనూ దీని గురించి ప్రస్తావించారు. ఆ కాలువను తప్పకుండా వెనక్కి తీసుకుంటామని పునరుద్ఘాటించారు. దీనిపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తీవ్రంగా స్పందించారు. ఈ కాలువను అమెరికా తమకేం బహుమతిగా ఇవ్వలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ములినో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనామా కాలువపై ట్రంప్ చెప్పిన ప్రతిమాటను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అదంతా అవాస్తవం. ఆ కాలువ అమెరికా నుంచి మాకు రాయితీగానో, బహుమతిగానో వచ్చింది కాదు. ఇది మాది.న మాకు మాత్రమే సొంతం ” అని స్పష్టం చేశారు.

గత సోమవారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ “ పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోంది. మేం దాన్ని చైనాకు ఇవ్వలేదు. పనామాకు ఇచ్చాం. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంటాం. ” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు పైనే ములినో స్పందించారు. అంతేగాక కాలువ విషయంలో చైనా ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని ఆయన తెలిపారు. ఇలాంటి ప్రకటనలతో పనామా ప్రజలను తప్పుదోవ పట్టించలేరని అన్నారు. ఈ కాలువను 1914లో అమెరికా నిర్మించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు 1999 డిసెంబరులో దీన్ని పనామాకు ఇచ్చేసింది. అయితే అమెరికా వాణిజ్య , నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని , వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. లేకుంటే ఆ కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News