ఒత్తిడిని మాయం చేసేలా…వ్యాధులను నయం చేసేలా ప్రణాళికలు…
నగరంలో 16 పార్కుల ఏర్పాటుకు రంగం సిద్ధం
పార్కుల ఏర్పాటుకు ఖాళీ స్థలాల వివరాలను సేకరిస్తున్న అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ లాంటి కాంక్రీటు జంగల్‌లో ప్రజల కోసం ఆరోగ్యం కోసం ‘పంచతత్వ’ పార్కులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. ఉరుకుల పరుగుల జీవితంతో అలసిపోయే నగరవాసుల్లో ఒత్తిడిని దూరం చూసి, ఆరోగ్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ‘పంచతత్వ’ పార్కులను రూపొందిస్తోంది. రాష్ట్రంలోనే మొదటగా దోమలగూడలోని ఇందిరాపార్కులో రూ.16 లక్షలతో ఆక్యుప్రెజర్ వాకింగ్ ట్రాక్‌ను పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ గతంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇలాంటివే నగరవ్యాప్తంగా మరో 16 పంచతత్వ పార్కులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోంది. నగరం మొత్తం ఈ పార్కులు ప్రారంభం కాగానే మిగతా జిల్లాలోనూ ఇలాంటి పార్కులను అక్కడి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మున్సిపల్, కార్పొరేషన్‌లు ఇలాంటి పార్కులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది. అందులో భాగంగానే ఆయా ప్రాంతాల్లో గతంలో ఉన్న పార్కులు ఎన్ని, ప్రస్తుతం ఎంత విస్తీర్ణంలో ఈ పార్కులు ఉన్నాయి, మిలు భూమి ఎంత ఉందన్న విషయమై స్థానిక అధికారులు నివేదికను తయారు చేస్తున్నారు. త్వరలోనే జిల్లాల వారీగా పంచతత్వ పార్కుల ఏర్పాటుకు సంబంధించి విధి, విధానాలను రూపకల్పన చేయనున్నట్టుగా తెలిసింది.
‘పంచతత్వ’ పార్క్ ప్రత్యేకతలు..
స్వచ్ఛమైన గాలి అందేలా ఇక్కడి వాతావరణం ఉంటుంది. ఇక్కడకు వచ్చిన వారికి ఎంత ఒత్తిడి ఉన్నా దాని నుంచి రిలాక్స్ కావడంతో పాటు వారి ఆయుష్షు పెంచే విధంగా సంజీవని పంచతత్వ పార్కులు పనిచేస్తాయి. ప్రజలకు ఆరోగ్యాన్ని కలిగించి హాయిని కలిగించే లక్ష్యంగా ప్రభుత్వం అనేక ప్రత్యేకతలతో ప్రభుత్వం ఈ పంచతత్వ పార్కులను నిర్మించడంతో ప్రతిఒక్కరినీ ఇది ఆకట్టుకుంటోంది.
ఔషధ మొక్కల నుంచి వెలువడే పరిమళాలు
రకరకాల చెట్లు, ఔషధ మొక్కల నుంచి వెలువడే పరిమళాలు, కంకర రాళ్లు, చెట్ల బెరడు, ఇసుక, నల్లరేగడి మట్టి, రివర్‌స్టోన్స్, నీళ్ల అనుసంధానంతో వాకింగ్ ట్రాక్‌ను నిర్మాణం కనువిందు చేస్తోంది. మధ్యలో ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రాశివనం, నవగ్రహాలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి.
ఎకరం విస్తీర్ణంలో పంచతత్వ పార్కు
మొత్తం 67 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇందిరాపార్కులో ఎకరం విస్తీర్ణంలో పంచతత్వ పార్కును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నవగ్రహ వనం, రాశివనం, హెర్బల్ గార్డెన్, 2 వాటర్ కాన్‌స్కెడ్స్‌ను ఇందులో ఏర్పాటు చేశారు.
ప్రయోజనాలు ఎన్నో..
ఈ ట్రాకుపై చెప్పులు, షూలు వంటివి లేకుండా నడవాలి.పాదానికి తగిలే స్పర్శతో శరీరంలో పాజిటివ్ వైబ్స్ ఏర్పడుతాయి.
దీని వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. ఈ ట్రాకుపై వాకింగ్ చేస్తే నాడి వ్యవస్థ బలోపేతమవుతుంది..
శరీరానికి నూతనోత్తేజం కలుగుతుంది. దీనివల్ల హార్మోన్లను ఉత్తేజితం కావడంతో పాటు శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. గుండె సంబంధిత పనితీరును మెరుగుపరుస్తుంది. బిపి తగ్గుతుంది, ఆలోచన శక్తిని పెరుగుతుంది. ప్రశాంతత లభించడంతో పాటు తలనొప్పి రాదు. టెన్షన్ ఫ్రీ అయితే థైరాయిడ్ సమస్యలు దరి చేరవని అధికారులు పేర్కొంటున్నారు.